పేరుపొందిన క్రాంతివాద రచయిత్రిని. గారాలపట్టి ప్రేమించానంటే, మంచి అబ్బాయిని కులం తక్కువని వద్దన్న పిరికిదాన్ని. లక్షలు పెట్టినా చదువు అబ్బని పెద్దోడు. సరస్వతి అయినా ఆడపిల్ల చదువుకు ఖర్చెందుకనుకొన్న నేను, నా పతిదేవుడు. దాని ప్రేమే గెలిచింది. లోటు తీర్చుకుందామని ఆస్తి లేకున్నా తమ్ముడు కూతుర్ని కోడలుగా తెచ్చుకొన్నాము. ఎంత అన్యాయం! కోడలు, తిరగలేకపోతున్న నన్ను, ఆయన్ని గదిలో పడేసి తాళం వేసి౦ది. పోనీలే, కనీసం టివి అయినా వుంచారనుకొనేలోగా తెలిసింది, అది మమ్మల్ని అదుపులో పెట్టే కుక్క గొలుసని. ఎప్పుడు చెక్కును రాయమో, రిమోటు అదృశ్యమయ్యేది. తెలివిగలపిల్ల, చప్పుడు లేకుండా పిచ్చెంకిచగలదు. మొన్న ఆయన పంచ ఖరాబు చేసుకొని, పిల్లాడిలా ఏడుస్తూ, వాడిని ఎంత పిలిచినా రాకపోతే, కూతురుతో చెప్పాను. పాప వాడికి ఫోన్ చేసి పంచె మార్చమనిందని, వాడు ఎంతంత మాటలన్నాడు. మేము అలగాజనమంట, వేరేఇంట్లో పెట్టి తాళం వేస్తాడంట. పాలుపోక, పరువుపోతుందని హైబిపి ఉన్న నేను గ్లాసునిండా ఉప్పుకలుపుకొని తాగేసా. ఫలితమే ఈ అంపశయ్య. ఇది ఆత్మహత్య? హత్యా? నిర్వేదంగా ఉన్న ఆయన దగ్గరకొచ్చి స్టాంపుపత్రాల మీద కొడుకు కోడళ్ల సంతకాల ప్రహసనం చూసిన తరువాత, ఒకటే ఘోష. చిట్టితల్లి! పుట్టినప్పటి నుండి ఆడపిల్లవైన పాపానికి నీకు అంతా అన్యాయమే చేసాము. ఉందో లేదో తెలియని పున్నామనరకం తప్పించుకోవాలనుకొని ఈ పాపకూపంలో పడ్డాము. కానీ, మరల పుడితే ఆడపిల్లని సమానంగా చూడాలి. విదేశాల నుండి పరుగున వస్తున్నావు. వేచిచూస్తున్నా? ఈ కాగితం పూలను క్షమిస్తావా!