– సీఎం, సీఎస్, డీజీపీ, సలహాదారు, పీసీసీఎఫ్ అంతా కడప వాసులే
– ఐదుగురిదీ ఒకే సామాజికవర్గమే
– రాష్ట్ర చరిత్రలో ఈ దృశ్యం ఇదే ప్రధమం
– చరిత్ర సృష్టించిన కడప జిల్లా
-చంద్రబాబు హయాంలో ఇద్దరు కమ్మ డీజీపీల నియామకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి నియామకంతో పాలనపై ‘కడప ముద్ర’ పడనుంది. దానితో పాటు , ఒకే సామాజికవర్గానికి చెందిన వారే అత్యంత కీలకశాఖలకు అధిపతులుగా పగ్గాలు చేపట్టిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఫలితంగా కడప చరిత్ర సృష్టించినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కెఎస్ జవహర్‌రెడ్డి నియమితులయిన విషయం తెలిసిందే. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్‌రెడ్డి కడప జిల్లాకు చెందినవారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అటవీశాఖకు చెందిన పీసీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి కూడా కడప జిల్లా వాసులే కావడం విశేషం.
దానితో ఒకే జిల్లా- ఒకే సామాజికవర్గానికి చెందినవారంతా.. రాష్ట్రంలో అత్యంత కీలకశాఖలకు అధిపతుల స్థానాల్లో ఉన్న ఘనత దక్కింది. ఇలాంటి అరుదైన ఘటన, ఉమ్మడి-విభజిత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, రాజకీయ-అధికార వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవ ర్గానికి చెందిన జెవి రాముడు, మాలకొండయ్య డీజీపీగా పనిచేశారు. అయితే రాముడుది అనంతపురం, మాలకొండయ్యది ప్రకాశం జిల్లా కావడం విశేషం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా నుంచి డీజీపీ గానీ, సీఎస్‌లుగా గానీ ఎవరినీ నియమించినట్లు లేదు.