నవరస నటనా సార్వభౌముడాతడు..
ఎన్టీవోడికి డూపైనా..
తొలినాళ్లలో అచ్చం
ఆయన రూపైనా..
యముడై ..భీముడై ..
అంతటి నందమూరికే తాతై..
ప్రతినాయక పాత్రకు
తానే ప్రాణదాతై..
ఘనత వహించిన
ఎస్వీఆర్ నటవారసుడై..
ఆయన నటించి మెప్పించిన రావణ..ఘటోత్కచ..
సుయోధన పాత్రలకు
తాను మరోపేరై..
విలనిజాన్ని ఉన్నత
కళ నిజంగా..
విషాదాన్ని విశేషంగా..
వినోదాన్ని సశేషంగా
ఒప్పించి మెప్పించి…
ఇందుగలడందు లేడని
సందేహము లేక
కైకాల కలకాలం
నిలిచే పాత్రలెన్నో
పోషించి..మెప్పించి
యమలీలను ఒంటి చేత్తో
అవలీలగ నడిపి
సాంఘిక..చారిత్రక..
జానపద..పౌరాణిక..
కౌబాయ్ సినిమాలలో పాత్రలెన్నో లెస్సగ పోషించి
తెలుగు సినిమా సువర్ణాధ్యాయపు
రారాజుగా వెలుగొందిన సత్యనారాయణా..
కీర్తి బావుటాను ఎగరేస్తూ
జీవించు శతవర్షాయణా..!
విలక్షణ నటుడు..ఘన చరితకు వారసుడు కైకాల సత్యనారాయణ
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286