Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణపట్నం పోర్టును నిండా ముంచేసిన కాకాణి ధనదాహం

కంటైనర్ టెర్మినల్ నుంచి సర్వీసెస్ లేవు..లైనర్ కంపెనీకి స్పష్టం చేసిన అదానీ ప్రతినిధులు
నిన్న వచ్చింది ఖాళీ కంటైనర్లే. అవి కూడా కేరళలోని అదానీకి చెందిన పోర్టులో రద్దీ కారణంగా ఇక్కడ దించారు
ఇప్పటికే ఉపాధి కోల్పోయిన 10 వేల కుటుంబాలకు నిన్న వచ్చిన ఖాళీ కంటైనర్లతో ఉపయోగం శూన్యం
ఎగుమతులు, దిగుమతులు కొనసాగిస్తామని లైనర్ కంపెనీలకు అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి మెయిల్స్ పెట్టిస్తారా
ఫిబ్రవరి నెలకు సంబంధించిన వెజల్స్ షెడ్యూల్ ను ఈ రోజుకీ విడుదల చేయలేదు. అంటే కంటైనర్ టెర్మినల్ ను మూతేసినట్టే
కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోవడంతో ఇప్పటికే రాయలసీమ, కోస్తా జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ రోజూ నిజాలు చెప్పలేదు. ఆయనది ఐరన్ లెగ్గు

మంత్రి అయిన తెల్లారి నుంచే వైసీపీలో వరుసగా వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వికెట్లు పడిపోతున్నాయి

– నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను మూసివేయడానికి సంబంధించి ఆధారాలతో బయటపెట్టిన సోమిరెడ్డి

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ మూతపడిపోతోందని నేను గత నెలలో బయటపెట్టాను.

ఈ విషయం వెలుగులోకి తెచ్చానని నాపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెలరేగిపోయాడు.

కంటైనర్ టెర్మినల్ మూతపడితే ఎమ్మెల్యే, మంత్రి పదవుల్లో కొనసాగనని శపథాలు చేశాడు.అఖిలపక్షంలోని పార్టీల నేతలందరం పోర్టు సీఈఓను కలిసి కంటైనర్ టెర్మినల్ ను కొనసాగించాలని కోరాం. నిన్న ఖాళీ కంటైనర్లతో ఓ వెజల్ కృష్ణపట్నం పోర్టుకు వచ్చింది..2200 కంటైనర్లను తెచ్చింది.

సాధారణంగా వెజల్ వస్తే విదేశాల నుంచి ఏదో ఒకటి దిగుమతి కావాలి, లేదంటే పత్తి, మిర్చి, రొయ్యలు, చేపలు, బియ్యం, పొగాకు ఏదో ఒకటి ఎగుమతి కావాలి.ప్రస్తుతం పోర్టులో ఉన్న ఖాళీ కంటైనర్ల ద్వారా ఏమి జరగబోతోంది. ఖాళీ కంటైనర్లతో ఉపయోగమేంటి? నిన్న వచ్చింది ట్రాన్స్ షిప్మెంట్ వెజల్. ఇది వస్తుందని తెలుసుకున్న ఓ కంపెనీ ప్రతినిధులు పోర్టు నిర్వాహకులకు ఓ మెయిల్ పెట్టారు.

సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ కు ఎగుమతులు జరపడానికి వెజల్ షెడ్యూల్ ఇవ్వాలని ఆ మెయిల్ ద్వారా కోరారు.దానికి సమాధానంగా కృష్ణపట్నం నుంచి ఎలాంటి సర్వీసు లేదని రిప్లయి వచ్చింది.కేరళలో అదానీకే చెందిన విజమ్ జం పోర్టులో రద్దీతో పాటు స్టోరేజీ సమస్య కారణంగా ఎంఎస్ఈ కంపెనీ ఖాళీ కంటైనర్లను కృష్ణపట్నం పోర్టకు తీసుకొచ్చింది.ఖాళీ కంటైనర్లతో వచ్చిన వెజల్ తో ఉపాధి కోల్పోయిన 10 వేల మందికి ఎలాంటి ఉపయోగం లేదు.

ఇప్పుడొచ్చిన ఖాళీ కంటైనర్లలో ఏ ఉత్పత్తులను, ఏ దేశానికి ఎగుమతి చేస్తారో చెప్పగలరా?ఫిబ్రవరి నెలకు సంబంధించిన కంటైనర్స్ వెజల్ షెడ్యూల్ ను ఈ రోజుకీ అదానీ కంపెనీ వెల్లడించలేదు. సాధారణంగా నెలకు 14 వెజల్స్ వస్తుంటాయి. ఈ నెలలో కనీసం 8 వెజల్స్ అయిన తీసుకురావాలని కోరుతున్నా. ఇప్పుడేమో ఖాళీ కంటైనర్లను తెచ్చి అక్కడ పడేసి వెళ్లారు.

మొన్నటి వరకు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ద్వారా బియ్యం, పొగాకు, మిర్చి, పత్తి, రొయ్యలు, చేపలు తదితర ఉత్పత్తులను ఎగుమతి చేసేవారు. ఇప్పడు వాటిని తమిళనాడులోని పోర్టులకు తీసుకెళ్లాల్సిరావడంతో రవాణా ఖర్చులు అదనంగా పడుతున్నాయి. ఆ ఖర్చు దామాషా ప్రకారం రైతుల దగ్గర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు.

కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎంఎస్ఈ, మియాసెక్, హ్యుందాయ్, హాపాక్ లాయడ్, వన్ లైన్, సీఎంఏ సీజేఎం తదితర కంపెనీలు లైనర్స్ గా ఎగుమతులు, దిగుమతులు చేసేవి.కంటైనర్ టెర్మినల్ యథావిధిగా కొనసాగిస్తున్నామని, ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చని అదానీ కంపెనీ ప్రకటిస్తుందా? అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అధికారిక ప్రకటన చేసే దమ్ముందా?

కాకాణి గోవర్ధన్ రెడ్డి జీవితమే అబద్ధాలమయం. ఆయన చరిత్రంతా నకిలీ పత్రాలు, నకిలీ ఫొటోలు, నకిలీ మద్యం.ఏ నాడూ నిజం చెప్పడం అలవాటు లేని కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేయమనడం వృథానే. పోర్టుతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం 16 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు.

ఈ రోజు వారి త్యాగాలకు అర్థం లేకుండా కంటైనర్ టెర్మినల్ ను తమిళనాడుకు తరలించి, కాలుష్యాన్ని వెదజల్లే డర్టీ కార్గోను కృష్ణపట్నంకు పరిమితం చేయడం బాధాకరం.రాయలసీమ, కోస్తా జిల్లాల రైతుల ప్రయోజనాలు, 10 వేల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కంటైనర్ టెర్మినల్ ను ఇక్కడే కొనసాగించాలని నేను మరోమారు అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

మొన్నేమో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులను వెజల్ వద్దకు తీసుకెళతానని కాకాణి ప్రకటించాడు. తీరా చూస్తే ఆయనతో ఉన్నవారంతా పోర్టు రోడ్డులో కంటైనర్లను ఆపి బలవంతంగా డబ్బులు గుంజే కాకాణి టోల్ మాఫియా ముఠా సభ్యులే.కాకాణి టోల్ మాఫియా మీద కోపంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అదానీ సర్వేపల్లి నియోకవర్గ ప్రజలకు ద్రోహం చేయడం అన్యాయం.

కంటైనర్ టెర్మినల్ ను అదానీ కంపెనీ కొనసాగించాలని నిర్ణయిస్తే కాకాణి టోల్ మాఫియా ఆ దరిదాపులకు రాకుండా తరిమికొట్టేందుకు అఖిలపక్షం సిద్ధంగా ఉంది. కాకాణిది ఒక ఐరన్ లెగ్. ఆయన మంత్రి అయిన తెల్లారే వైసీపీలో మూడు ఎమ్మెల్యే వికెట్లు పడిపోయాయి. వారంతా టీడీపికి వచ్చారు.

ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నారు. మరో ఎమ్మెల్యే వైసీపీ టికెట్ వద్దని దండం పెట్టేశారు.ఐదు ఎమ్మెల్యే వికెట్లను పడగొట్టిందంటే కాకాణి లెగ్ ఎంత పవర్ ఫుల్లో. ఇప్పటికే మాగుంట లేఅవుట్ నుంచి ఓ ఎంపీ వికెట్, మినీ బైసాస్ నుంచి మరో వికెట్ లేచిపోయాయి. మరో ఎంపీ వికెట్ డైలామాలో ఉంది..ఆ వికెట్ కూడా లేచే అవకాశం ఉంది.

మరో ఎమ్మెల్యేను ఏకంగా జిల్లాలను దాటించేశారు. ఆయన చేసిన తప్పేమిటంటే కాకాణి లాంటి దుష్టశక్తి మంత్రి అయితే జిల్లా సర్వనాశనం అవుతుందని మీటింగ్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడమే. కాకాణి కారణంగా ఇక్కడేమో కంటైనర్ టెర్మినల్, అక్కడేమో వైసీపీ మూతపడిపోతున్నాయ్.

 

LEAVE A RESPONSE