Suryaa.co.in

Editorial

కక్కుర్తి విలాస్ కాఫీక్లబ్!

  • జగనన్న పఫ్.. ఉఫ్

  • జగన్ ఎగ్ పఫ్ బిల్లు మూడుకోట్లా?

  • ఐదేళ్లలో 18,12,835 ఎగ్ పఫ్‌లు తిన్నారట

  • రోజుకు 993 పఫ్‌లు తిన్న జగన్ ఆఫీసు

  • ఖజానాకు 3 కోట్ల 62 లక్షలు కన్నం

  • సీఎం హోదాలో పది కిలోమీటర్ల ప్రయాణానికీ హెలికాప్టర్

  • పదవి పోయిన తర్వాత ఇండిగోలో ఆర్డినరీ క్లాసు జర్నీ

  • జగన్ కక్కుర్తిపై సోషల్‌మీడియా ర్యాగింగ్

  • జగనన్న వెరీ ‘గుడ్డు’ అంటూ వెక్కిరింపు

( మార్తి సుబ్రహ్మణ్యం)

మహేష్ బాబు పోకిరీ సినిమా చూశారా? అందులో రైల్వే స్టేషన్ సీన్ డైలాగు గుర్తుందా? మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మాతిని బతుకుందా అంటాడు మహేష్. ఏపీలో సేమ్ టు సేమ్ డైలాగ్. కాకపోతే కొద్దిగా ఛేంజ్. జగనన్న క్యాంపు ఆఫీసు అంతా ఐదేళ్లపాటు, ఎగ్ పఫ్‌లు తిని బతికేసిందిట. అవును ఇది నిజంగా నిఝం.

తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నాట్ట వెనుకటికెవడో. ఐదేళ్లు ఏపీని వెలగబెట్టిన జగనన్న వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆయన అధికారం వెలగబెట్టినప్పుడు ఆఫీసులో ఎన్ని లక్షల ఎగ్ పఫ్‌లు తిన్నారో తెలిస్తే, మీ పొట్ట నిజంగానే పగులుతుంది మరి. జగనన్న గద్దె దిగిన తర్వాత ఆ వివరాలు ఇప్పుడు సోషల్‌మీడియా కోడై కూస్తోంది. దానితో నెటిజన్లు జగనన్న ఎగ్ పఫ్‌ల కక్కుర్తిపై కామెడీ కామెంట్లు పెట్టి తెగ ర్యాగింగ్ చేస్తున్నారు.

జగనన్న ఐదేళ్ల పాలనలో చేతికి ఎముకలేకుండా ఖర్చు చేసి, ఖజానాను నాకించేశారన్నది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దానితో తుంగభద్ర గేట్లకు గ్రీజు పెట్టే డబ్బులకూ గతిలేకుండా పోయింది. తెలంగాణ-కర్నాటక-ఆంధ్రాలు ఆ ప్రాజెక్టు నిర్వహణకు తలా ఇంత వాటా వేసుకోవాలన్న నిబంధన అమలులో ఉంది. అయితే మన రాష్ట్రాన్ని వెలిగించిన జగనన్న దానికి నయాపైసా విదిల్చలేదట. ఇక పక్కరాష్ట్రాలేమో ఎన్నికల బిజీలో పడి దాని సంగతి మర్చిపోయాయట. ఆ పాపమే మొన్న గేటు కొట్టుకుపోవడానికి అసలు కారణమట. ఆ కథ వేరు.

సీన్ కట్ చేస్తే.. జగనన్న గద్దె దిగిన తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మించిన ఇనుపకంచెలు బయటకొచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రగతిభవన్ చుట్టూ నిర్మించిన ఇనుపకంచెలు కూడా, ఈర్ష్యపడే స్థాయిలో వాటిని నిర్మించిన వైనం చూసి తాడేపల్లి పేదలు నోరెళ్లబెట్టారు. కిమ్ కూడా ఈ రేంజ్‌లో సెక్యూరిటీలో పెట్టుకోలేదంటే నమ్మండి!

ఇప్పుడు లేటెస్టుగా.. ఐదేళ్లు సీఎంగా ఉన్న జగనన్న ఆఫీసు, కేవలం ఒక్క ఎగ్ పఫ్ కోసమే 3 కోట్ల 62 లక్షల 56 వేల 700 రూపాయలు ఖర్చు పెట్టిందన్న వార్త, కోళ్లను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ ప్రకారంగా ఏడాదికి 72 లక్షల 51 వేల 340 రూపాయల ఎగ్ పఫ్‌లు తిన్నట్లు అర్ధమవుతుంది. రోజుకు 993, గంటకు 41 ఎగ్‌పఫ్‌లు తిన్నారన్నమాట. అంటే మొత్తం ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ జగనన్న జనులు, 18 లక్షల 12 వేల 835 ఎగ్ పఫ్‌లు తిన్నట్లు తేలింది.

ఒక్క ఎగ్ పఫ్‌లే ఇన్ని లక్షలు తిన్నారంటే.. ఇక వెజ్ పఫ్‌లు, కేకులు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలకు ఎన్ని కోట్ల రూపాయలు నాకేశారన్నది ప్రశ్న. అసలు వాళ్లది కడుపా? కంభంపాటి చెరువా? అన్నది నెటిజన్ల సందేహం. అసలు ఆ బేకరీ వాడికి అన్నేసి డబ్బులు తగలేసేబదులు.. ఎంచక్కా ప్యాలెస్‌లోనే ఒక కోళ్లఫారం పెట్టుకుంటే గుడ్లకు గుడ్లు-చికెన్‌కు చికెనూ వచ్చేది కదా?! ఈ తిండిని చూసిన వాళ్లు, జగన్ వెరీ ‘గుడ్డు’.. జగనన్నా పఫ్‌ను భలే ఉఫ్ చేశావే అంటున్నారు.

ఈ లెక్కలు.. ఈ దయ్యపు తిండి చూసి.. జగనన్న పరివారం ఏమైనా కరువు ప్రాంతాలయిన సోమాలియా, కాంబోడియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా అన్నది మరో డౌటనుమానం. జనం సొమ్మును ఇంత తేరగా నాకేసిన జగన్ ప్యాలెస్‌ను చూసి ఒక బకాసురుడు.. ఇంకో ఘటోత్కజుడు, మరో హిడింబి, భీముడు, వృకోదరుడు కూడా, వారి దయ్యపుతిండిని చూసి నిలువుగుడ్లేసుకుంటారేమో! దీన్ని బట్టి సదరు బేకరీ ఓనరు, ఈపాటికి ఓ నాలుగైదు అపార్టుమెంట్లు, ఓ పది పదిహేను ఎకరాల భూమి కొన్నా హాశ్చర్యపోనక్కర్లేదు.

సీన్ కట్ చేస్తే.. జగన్ సతీసమేతంగా ఇండిగో విమానంలో సామాన్య ప్రయాణీకుల మాదిరి, జనరల్ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో యమా వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు తమ చేతిని తామే గిల్లుకున్నారట. నిజమా? మార్ఫింగా? అని కళ్లు పత్తికాయలు చేసి మరీ చూశారట. చివరాఖరకు అది నిజమేనని తేలింది.

అసలు అధికారంలో ఉండగా పది కిలోమీటర్ల దూరానికే హెలికాప్టరు వాడి , జనం సొమ్మును స్ట్రాతో పీల్చేసిన మన జగనన్నేంటి?.. విమానంలో వదినమ్మతో ఆర్డినరీ క్లాసులో జర్నీ చేయడమేమిటి? జనం సొమ్ముతో స్పెషల్ ఫైట్లలో తెగ తిరిగి, వదినమ్మను హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి, మళ్లీ అదే విమానంలో గన్నవరం వచ్చిన జగనన్నేంటి.. అలా సగటు మనిషి లెక్క విమానంలో ప్రయాణించడమేమిటన్న ప్రశ్నల వర్షం కురుస్తోంది.

ఐదేళ్లు జనం సొమ్మును తేనెతో నాకేసి, పది తరాలకు సరిపడా సంపాదించుకున్న జగనన్నకు ఈ ఖర్మేంటి? గంటకు ఓ ఐదు లక్షలు పడేస్తే హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు ఎన్ని హెలికాప్టర్లు లేవు? ఎందుకీ దరిద్రం? ఆ లిక్కరు సొమ్ము, శాండు మనీ అంతా ఏమైనట్లు? అంటే తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నట్లు.. తన సొమ్మయితే శుక్రవారం. మంది సొమ్మయితే మంగళవారమా? ఇంత కక్కుర్తి విలాస్ కాఫీక్లబ్ ఏంటి? అంటూ నెటిజన్లు తెగ ర్యాంగింగ్ చేస్తున్నారు. ఫాఫం.. మన అభివన కర్ణుడు, దానశీలి జగనన్నను అట్ల ర్యాంగిగ్ చేయమాకండయ్యా! ఎంతైనా సొంత సొమ్ము సొంత సొమ్మే.. మంది సొమ్ము మంది సొమ్మే కదా?!.. అర్ధంచేసుకోరూ..?!

1 COMMENTS

LEAVE A RESPONSE