Suryaa.co.in

Family

కలలు ఎవరికి ఊరికే రావు !

అది నిండు పౌర్ణమి రాత్రి. కోమలి గాఢంగా ఆదమరచి నిద్రపోతోంది. మధ్యరాత్రి ఒంటిగంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ నిద్ర లేచాడు. కోమలీ ఏమైంది? అని అడిగాడు.

తనకు తెలియదని, తనకు చెడు కల ఒకటి వచ్చిందని, భయపడ్డానని చెప్పింది. సరే పడుకో అని, కృష్ణ అటు తిరిగి పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి కూడా అదే కల వచ్చి మళ్లీ లేచి కూర్చుంది కోమలి. ఆమెకు, రోజూ ఈ కలలు రావడం ప్రారంభమయ్యాయి.

కృష్ణ ఒకరోజు ఉదయం ఆమెను అడిగాడు, “ఆ కల ఏమిటో చెప్పు, దానిలో ఏదైనా ఉంటే పంచాంగంలో చూద్దాం” అన్నాడు. కోమలి ఇలా చెప్ప సాగింది. ఒక బట్టతల మనిషి వస్తాడు. వాడు వచ్చి కేకలు వేస్తాడు మా దగ్గరికి రా… మా దగ్గరికి రా…” అని, నాకు భయంగా ఉంది, వాడు యమకింకరుడిలాగానే ఉన్నాడు అంది. కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు.. కానీ, ఆమె కలలోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు.

కృష్ణకు, ఆమె అవస్థ రోజూ చూడలేక తలనొప్పి ప్రారంభమైంది. చివరకు ఒకరోజు ఆమెను ఆ పట్టణంలోని ప్రముఖ జ్యోతిష్కుల వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి జ్యోతిష్కులను సమయం అడిగి ఆ సమయానికి వారి వద్దకు వెళ్లారు. జ్యోతిష్కులు ఆమె గురించి, ఆమె రాశి, నక్షత్రం గురించి, అన్ని జాతకాలను చూశారు. కానీ ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తేల్చారు.

మీ కల గురించి వివరంగా చెప్పమన్నప్పుడు. కోమలి అంతా వివరించింది. చివరికి జ్యోతిష్కులు ఒక నిర్ణయానికి వచ్చి, పరిష్కారాన్ని సూచించారు. వాళ్ళు చెప్పింది ఇంతే. “మీ కలలో బట్టతల ఉన్న వ్యక్తి వచ్చి, మా దగ్గరకు రా… మా దగ్గరకు రా… అని పిలిచేది మరెవరో కాదు, అతను లలితా జ్యువెలరీ అంకుల్” అని అంటూ, “నీ భార్యను అక్కడికి తీసుకెళ్లి బంగారు నగలను కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది” అన్నారు. కలలు ఎవరికి ఊరికే రావు !

– సేకరణ

LEAVE A RESPONSE