Suryaa.co.in

Editorial

తెలంగాణలో కాంగ్రెస్‌ కు ‘కమ్మ’టి సందేశం

– బాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో మారిన కమ్మ వర్గ వైఖరి
– బీజేపీ-బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండాలని కమ్మ సంఘాల నిర్ణయం
– ఆ రెండు పార్టీల సహకారంతోనే బాబు అరెస్టయ్యారన్న భావన
– బీజేపీ ప్రోత్సాహంతోనే జగన్ రెచ్చిపోతున్నారన్న ఆగ్రహం
– అమరావతిని చంపేయడంలో జగన్ కంటే బీజేపీ పాత్రనే ఎక్కువన్న అసంతృప్తి
– బాబు అరెస్టును ఖండించని బీఆర్‌ఎస్ బాసులపై ఆగ్రహం
– ఇకపై బీఆర్‌ఎస్‌కు మద్దతు కొనసాగించకూడదన్న నిర్ణయం
– కాంగ్రెస్‌కే ఓటేయాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో కమ్మ సంఘాల పిలుపు
– ఎక్కడికక్కడ సర్క్యులేట్ చేస్తున్న కమ్మ సంఘాలు
– తుమ్మల నిష్క్రమణతో బీఆర్‌ఎస్‌కు బదులు కాంగ్రెస్ వైపు కమ్మ వర్గం
-తుమ్మల-మండవలను కేసీఆర్ అవమానించారన్న ఆగ్రహం
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కమ్మ ఓట్ల కోసమే బాబు అరెస్టును ఖండించారన్న భావన
– అదే నిజమైతే కేసీఆర్-కేటీఆర్ అరెస్టును ఎందుకు ఖండించలేదన్న ప్రశ్న
– తాము అంత అమాయకులం కాదని కమ్మ నేతల స్పష్టీకరణ
– కమ్మనేతలను అభ్యర్ధులుగా పెట్టినా బీఆర్‌ఎస్‌ను నమ్మవద్దన్న పిలుపు
– కమ్మ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో బాబు అరెస్టుపై చర్చోపచర్చలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు… ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం, తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు తలనొప్పిలా పరిణమించింది. గత రెండు అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకే మద్దతునిచ్చిన కమ్మ వర్గం.. ఇకపై కాంగ్రెస్‌కు మద్దతునిచ్చేందుకు సిద్ధమవుతున్న వైనం ‘కారు’లో కలవరం కలిగిస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో..రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి, బీజేపీ-బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలంటూ, కమ్మ సంఘాలు సోషల్‌మీడియా ప్రచారానికి దిగడమే.. ‘కారు’ కలవరానికి అసలు కారణంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘కారు’లో ‘కమ్మ’టి కలవరం!

జగన్ సర్కారుతో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించిన ఘటన వెనుక.. బీజేపీ-బీఆర్‌ఎస్ పరోక్ష హస్తం ఉందని భావిస్తున్న తెలంగాణ కమ్మ వర్గం, ఆ రెండు పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. జగన్‌కు తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్-కేంద్రం నుంచి బీజేపీ దన్నుగా నిలుస్తున్నాయన్న భావన, తెలంగాణలోని కమ్మ-సెటిలర్లకు గత నాలుగున్నరేళ్ల క్రితమే స్థిరపడింది. అసలు అమరావతిని సమాధి చేయడం వెనుక జగన్ కంటే, మోదీనే కారణమన్న భావన.. తెలంగాణలోని సెటిలర్లు-కమ్మ వర్గంలో బలంగా నాటుకుపోయిన విషయం రహస్యమేమీ కాదు.

బీజేపీ-బీఆర్‌ఎస్ దన్నుతోనే ఏపీలో జగన్ రెచ్చిపోతున్నారని, ఆ ముగ్గురి ఆటలో భాగంగానే.. చంద్రబాబు అరెస్టయ్యారన్న భావన కూడా వారిలో కనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్, తెలంగాణ జిల్లాలు వేదికగా జరుగుతున్న ఆందోళనలకు, భారీ సంఖ్యలో జనం రావటం బీఆర్‌ఎస్‌కు కలవరం కలిగిస్తోంది. మరోవైపు కాకతీయ కమ్మ సేవా సంఘం కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దానితో సెటిలర్లు-కమ్మ వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, తమ ఉనికి కోసం చంద్రబాబు అరెస్టును ఖండించడం అనివార్యంగా మారింది.

అయితే.. నిజంగా చంద్రబాబు అరెస్టు అక్రమమని భావిస్తే, కేసీఆర్-కేటీఆర్ ఎందుకు ఖండించలేదని కమ్మ సంఘాలు లా పాయింట్లు తీస్తున్నాయి. కేవలం తమ ఓట్లపై ఉన్న ప్రేమతోనే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బాబు అరెస్టును ఖండిస్తున్నారన్న సంగ తి తెలియని అమాయకులం కాదని, కమ్మ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఈ ఎన్నికల్లో తాము బీఆర్‌ఎస్‌కే మద్దతునివ్వాలని భావించామని, కానీ చంద్రబాబు అరెస్టుపై బీఆర్‌ఎస్ నాయకత్వం స్పందించని కారణంగా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని తీర్మానించినట్లు ఒక కమ్మ సంఘ నేత వెల్లడించారు.

ఆమేరకు కమ్మ సంఘాలు గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో సోషల్ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ‘‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేద్దాం. తెలంగాణలో మన సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపించాల్సిన సమయం వచ్చేసింది. అందరూ విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నిజాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. మనల్ని తమ అవసరాల పనిముట్టుగా-ఓటు బ్యాంకుగా భావిస్తున్న పార్టీలకు, మన అవసరం లేదని భావించే పార్టీలకు ఓటు ద్వారా కళ్లు తెరిపిద్దాం. ఇదే మన తీర్మానం. ఈ సందేశాన్ని మన సంఘాలు, వ్యక్తులు, లోకల్ గ్రూపులకు ఫార్వార్డ్ చేయండి ’’ అన్న ఎస్‌ఎంఎస్ సందేశాలు, స్థానిక కమ్మ సంఘాలకు చేరవేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

మొదటి నుంచీ తెలంగాణలో కమ్మజాతికి పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం కూడా, బీఆర్‌ఎస్‌పై ప్రతికూల ఫలితాలకు కారణమవుతోంది. జీరో స్థాయిలో ఉన్న ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ను అగ్రస్థానంలో నిలిపిన తుమ్మలను, కేసీఆర్ అవమానించారన్న భావన కమ్మ వర్గంలో బలంగా ఉంది. ఆప్తమిత్రుడైన కేసీఆర్ తమ నేతను అవమానించడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేపోతున్నట్లు, కమ్మ సంఘ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక తెలంగాణలో కమ్మ వర్గానికి సుపరిచితుడైన మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కూడా, కేసీఆర్ అవమానించారని కమ్మసంఘాలు రగిలిపోతున్నాయి. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మండవను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్, తర్వాత ఆయనను పట్టించుకోకుండా అవమానించారని కమ్మసంఘ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. నిజాయితీపరుడు, అవినీతి మకిలి అంటని నేతగా పేరున్న మండవను పక్కనపెట్టడాన్ని, కమ్మ సంఘాలు భరించలేకపోతున్నట్లు వారి మాటలు బట్టి స్పష్టమవుతోంది.

అయితే.. తుమ్మల- మండవ వంటి అగ్రనేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడం ద్వారా, తెలంగాణలో కమ్మ సమాజం మొత్తం తన వెంటే ఉందన్న సంకేతాలివ్వడంలో, కేసీఆర్ విజయం సాధించారని కమ్మ సంఘ నేతలు విశ్లేషిస్తున్నారు. వారిని చూపి మొత్తం కమ్మ సమాజ ఓట్లు కొల్లగొట్టాలన్నదే.. కేసీఆర్ అసలు వ్యూహమన్న వాస్తవం, తమకు ఆలస్యంగా అర్ధమైందని వ్యాఖ్యానిస్తున్నారు.

కమ్మ సంఘానికి స్థలం కేటాయించడం, కొందరికి సీట్లు ఇవ్వడం కూడా ఆ వ్యూహంలో భాగమేనంటున్నారు. అయితే తాము అమాయకులం కాదని, రాజకీయాలను అర్ధం చేసుకోలేనంత అసమర్ధులం కాదని కమ్మ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు.

‘‘ చంద్రబాబు అరెస్టును కమ్మ ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఖండించి, మూలవిరాట్టులైన కేసీఆర్-కేటీఆర్ మాత్రం మౌనంగా ఉండటాన్ని అర్ధం చేసుకోలేనంత పిచ్చివాళ్లమా? ఏపీ రాజకీయాలు ఇక్కడెందుకని కేటీఆర్ అన్నప్పుడే మేం బీఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంకు మాత్రమేనని అర్ధమయింది. మరి మేం కూడా కళ్లు తెరవాలి కదా’’ అని, కుత్బుల్లాపూర్ కమ్మసంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత కేసీఆర్ వైఖరి ఏమిటో అర్ధమైన తర్వాత కూడా, తాము ఇంకా ఆ పార్టీకి మద్దతునివ్వడం అవివేకమని శేరిలింగంపల్లికి చెందిన ఓ కమ్మసంఘ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధులుగా కమ్మవారు ఉన్నప్పటికీ, తాము మాత్రం కాంగ్రెస్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు సదరు నేత కుండబద్దలు కొట్టారు. ‘‘తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది. సరైన అభ్యర్ధులెవరూ కనిపించడం లేదు. ఒకవేళ చంద్రబాబు జైలు నుంచి వచ్చి తెలంగాణపై దృష్టి సారిస్తే ఫర్వాలేదు. అది ఎంతవరకూ కార్యరూపం దాలుస్తుందో తెలియదు. అందుకే మేమంతా కాంగ్రెస్‌కే ఓటు వేసి.. ఏపీ వినాశానికి పరోక్షంగా సహకరిస్తున్న బీజేపీ-బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని ఎక్కడికక్కడ తీర్మానించాం. అప్పుడే మా సత్తా, ప్రభావం ఏమిటో తెలుస్తుంది. అది కచ్చితంగా భవిష్యత్తులో మమ్మల్ని నిర్లక్ష్యం చేసే పార్టీలకు ఒక హెచ్చరిక సంకేతం అవుతుంది’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.

కమ్మ సంఘాల పట్టుదల-పౌరుషం చూస్తుంటే.. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసే ఆ కులం అభ్యర్ధులకూ, సొంత కులం నుంచి ప్రమాదం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సహజంగా ఎంత అసంతృప్తి ఉన్నప్పటికీ, కులాభిమానంతో ఇప్పటివరకూ తమ వారిని గెలిపిస్తున్న కమ్మవర్గం.. ఇప్పుడు ఆ మొహమాటాలకు తెరదించి, తమ సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపించాలన్న పట్టుదల తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ కమ్మ అభ్యర్ధులను కూడా కమ్మ సంఘాలు కనిపించే పరిస్థితి కనిపించడం లేదు.

తాజా పరిణామాలు కాంగ్రెస్‌కు, సానుకూలంగా పరిణమించేలా కనిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరిక, ఒకరకంగా కాంగ్రెస్‌కు వరంగానే భావించాలి. తెలంగాణలో 35 నియోజకవర్గాలకు పైగా ప్రభావం చూపే కమ్మ వర్గం, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. అది బీఆర్‌ఎస్ ఓట్లకే గండికొట్టే ప్రమాదం లేకపోలేదని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE