– తెలంగాణలో చంద్రబాబు అరెస్టు ప్రభావం
– ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో సెటిలర్ల నిరసన ర్యాలీలు
– హైదరాబాద్‌లో ఆగని ఐటీ ఉద్యోగుల నిరసనలు
– కూకట్‌పల్లి, ఎల్బీనగర్, వైరాలో భారీ ర్యాలీలు
– బాబు అరెస్టుపై కమ్మ సంఘాల కన్నెర్ర
– తొలిసారి ప్రెస్‌మీట్లు పెట్టి ఖండించిన కమ్మ సంఘాలు
– అరెస్టును ఖండించని బీఆర్‌ఎస్ బాసులపై సెటిలర్ల ఆగ్రహం
– అనివార్య పరిస్థితిలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
– బాబు అరెస్టును ఖండించిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
– బాబుకు బాసటగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
– తొలుత నిరసన గళం విప్పిన తుమ్మల నాగేశ్వరరావు
– తెలంగాణలోని 35 నియోజకవర్గాల్లో కమ్మ-సెటిలర్ల ప్రభావం
– 20 వేల నుంచి 3 లక్షల మంది వరకూ ఉన్న నియోకవర్గాలు 38
– రాజేందర్‌నగర్, పటన్‌చెరు, మేడ్చెల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఉప్పల్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో 30 వేల నుంచి 2 లక్షల ఓటర్లు
– 2018 సర్వేలో తెలంగాలో 35 నియోజకవర్గాల్లో కమ్మ-సెటిలర్ ఓటర్ల సంఖ్య 1367000
– బాబు అరెస్టుపై స్పందించని బీఆర్‌ఎస్‌పై సెటిలర్లు-కమ్మ వర్గం ఆగ్రహం
– బీజేపీ-బీఆర్‌ఎస్-వైసీపీ కుట్ర చేశాయన్న అనుమానం
– జగన్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి
– ఇప్పటివరకూ బీఆర్‌ఎస్‌కే మద్దతునిస్తున్న కమ్మ-సెటిలర్లు
– గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల డివిజన్లలో దూసుకువెళ్లిన ‘కారు’
– బాబు అరెస్టు పరిణామాల తర్వాత బీఆర్‌ఎస్‌పై మారుతున్న కమ్మ-సెటిలర్ల వైఖరి
– సెటిలర్లపై ఇప్పటికీ కుదరని కమల సమీకరణం
– కులసమీకరణలో విఫలవుతున్న కమల నాయకత్వం
– కాంగ్రెస్‌కు కలసిరానున్న బాబు అరెస్టు ప్రభావం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలిగినట్టుంది టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు ప్రభావం. ఏపీలో జగన్ సర్కారు బాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిస్తే… దాని ప్రభావం తెలంగాణలో చూపిస్తోంది. బాబు అరెస్టుకు నిరసనగా, నాయకుడు లేకుండానే ఐటీ ప్రోఫెషనల్స్ రోడ్డెక్కుతుండటం, కేసీఆర్ సర్కారుకు శిరోభారంగా మారింది. ఈ నిరసన సెగ క్రమంగా జిల్లాలకు అంటుకోవడం, బాబుకు మద్దతుదారుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగై, ఉనికి కోసం పోరాడుతున్న సమయంలో జరిగిన బాబు అరెస్టు పరిణామాల ప్రభావం, టీడీపీ సానుభూతిపరులు మద్దతునిస్తున్న బీఆర్‌ఎస్‌పై కనిపించడమే ఆసక్తికర పరిణామం. ఈ పరిణామాలన్నీ పరోక్షంగా.. కాంగ్రెస్‌కు కలసివచ్చేలా కనిపిస్తుండటం, తాజాగా ‘కారు’లో కనిపిస్తున్న కలవరం! మోదీ-కేసీఆర్-జగన్ కలసి బాబును అరెస్టు చేశారని కాంగ్రెస్ జాతీయ నేత మధుయాష్కీ ఆరోపించడం ప్రస్తావనార్హం.
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఏపీలో చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు, తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత, తెలంగాణలో పార్టీని దాదాపు వదిలేసి, ఏపీపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. నిమిత్తమాత్రంగా పార్టీని నడుపుతున్న పరిస్థితి. తాజాగా ముదిరాజ్‌నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, ఫలితం సున్నా. ఖమ్మం బహిరంగ సభ ఊపును కొనసాగించడంలో కాసాని చతికిలపడ్డారు. ప్రస్తుతం కాసాని టీడీపీని ఒక రాజకీయపార్టీగా కాకుండా, ఒక కులసంఘం మాదిరిగా నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే టీడీపీ నుంచి మెజారిటీ శాతం నేతలు వెళ్లిపోయినా, ఇంకా చెప్పుకోదగ్గ క్యాడర్ పార్టీని అంటిపెట్టుకునే ఉంది. ఆ కారణంతోనే హైదరాబాద్‌లో అక్కడక్కడా పార్టీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వారే ఇంకా కొనసాతుండటంతో, పార్టీ ఉనికి చాటుకోగలుగుతోంది.
చంద్రబాబు తెలంగాణలో టీడీపీపై దృష్టి సారించని కారణంగా, మెజారిటీ నేతలంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. కొద్దిమంది మాత్రమే బీజేపీ వైపు వెళ్లారు. వీరిలో అధికశాతం నేతలంతా చంద్రబాబుకు చెప్పి ఇతర పార్టీలకు వెళ్లడం విశేషం. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న లీడర్-క్యాడర్‌లో, 70 శాతం టీడీపీ మాజీలే. దానితో తెలంగాణలోని కమ్మవర్గం-సెటిలర్లు కూడా, బీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపింది. సెటిలర్లు కూడా రక్షణ కోణంలో బీఆర్‌ఎస్‌కే జై కొడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో కీలకనేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత, కమ్మ వర్గం మొత్తం ఆయన వైపు నడి చింది. ఫలితంగా గత ఎన్నికల్లో ఆయన ఓడినా, కమ్మ వర్గం-సెటిలర్లు కారునే గెలిపించారు. ఇప్పుడు ఆయన కారు దిగి, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మళ్లీ కమ్మవర్గం అటువైపు అడుగులు వేస్తున్న పరిస్థితి. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, శేరిలింగపల్లి, రాజేందర్‌నగర్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గతంలో టీడీపీకి చెందిన వారే. ఆ అనుబంధంతో సెటిలర్లు-కమ్మ వర్గం వారినే గెలిపిస్తోంది.
మానసికంగా ఆ ఎమ్మెల్యేలను సెటిలర్లు-కమ్మవర్గం ‘తమవారి’గానే భావిస్తోంది. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత.. సెటిలర్లు-కమ్మ వర్గంపై ఎలాంటి దాడులు జరగకపోవడం కూడా, వారంతా బీఆర్‌ఎస్‌ను బలపరచడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అటు కేసీఆర్ కూడా కమ్మవర్గానికి.. ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ సీట్లు ఇచ్చి వారిని మెప్పించారు. తాజాగా కమ్మ కుల భవనానికి స్థలం కూడా కేటాయించారు. తెలంగాణ సర్కారు కొనసాగిస్తున్న అనేక ప్రాజెక్టు పనులలో సింహభాగం, ఆంధ్రా కాంట్రాక్టర్లే చేస్తుండటం ప్రస్తావనార్హం. వారిలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్‌తో, టీడీపీ జతకట్టడాన్ని తెలంగాణ లోని కమ్మ-సెటిలర్లు జీర్ణించుకోలేకపోయారు. ప్రధానంగా ఎన్టీఆర్‌ను అభిమానించే సంప్రదాయ కమ్మ-సెటిలర్లు, ఈ విషయంలో టీడీపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఫలితంగా గత ఎన్నికల్లో టీడీపీకి కనీస స్థానాలు దక్కకుండా పోయాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్ధులను పోటీ పెట్టినప్పటికీ, సెటిలర్లు-కమ్మ వర్గం బీఆర్‌ఎస్‌నే గెలిపించింది. ఈ విధంగా ఆంధ్రా సెటిలర్లు-కమ్మ వర్గం బీఆర్‌ఎస్‌కు మానసిక మద్దతుదారుగా మారింది.
అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఖండించకుండా మౌనంగా ఉండటాన్ని, సెటిలర్లు-కమ్మ వర్గం సహించలేకపోతోంది. అసలు జగన్‌ను ప్రోత్సహిస్తున్నది కేసీఆరేనన్న ఆగ్రహం వారిలో చాలాకాలం నుంచి లేకపోలేదు. అయితే రక్షణ కోణంలో, అనివార్యంగా బీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టును జాతీయ నేతలు ఖండించినప్పటికీ.. కేసీఆర్-కేటీఆర్‌లలో ఒక్కరు కూడా ఖండించకపోవడంపై, వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పైగా బాబుకు మద్దతుగా ధర్నా చేస్తున్న ఐటి ప్రొఫెషనల్స్, టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం, అరెస్టు చేస్తుండటం.. సెటిలర్లు-కమ్మవర్గంలో కొత్త ఆలోచనకు కారణమయింది.
అయితే ఈ వర్గ ఆగ్రహాన్ని పసిగట్టిన తెలివైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, స్థానికంగా వారి నిరసన కార్యక్రమాలకు, మద్దతునిస్తుండటం గమనార్హం. ఎల్‌బీనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్వయంగా టీడీపీ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఆయనకు పోటీగా బీజేపీ కార్పొరేటర్ కూడా పాల్గొనడం ప్రస్తావనార్హం. అక్కడ సెటిలర్లు-కమ్మ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటమే దానికి కారణం.
ఈ వర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న.. కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా, చంద్రబాబు అరెస్టును ఖండించారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బాబు అరెస్టును ఖండించారు. కాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరికంటే ముందే.. బాబు అరెస్టును ఖండించడం విశేషం.
అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సెటిలర్లు-కమ్మ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ధర్నాలకు మద్దతునిస్తున్నప్పటికీ.. బీఆర్‌ఎస్ మాత్రం సంస్థాగతంగా ఇప్పటివరకూ స్పందించకపోవడాన్ని, సెటిలర్లు-కమ్మవర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇది బీఆర్‌ఎస్‌కు ప్రమాదఘంటికగానే కనిపిస్తోంది. ఆ వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో, ఈ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.
మరోవైపు బీజేపీ తొలి నుంచి తెలంగాణలో కుల సమీకరణలో విఫలమయింది. బీసీలో మున్నూరుకాపు, ఓసీలలో రెడ్లు తప్ప మరో వర్గాన్ని బీజేపీ నాయకత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శ లేకపోలేదు. తాజాగా ముదిరాజ్ కులానికి చెందిన ఈటల పార్టీలో చేరిన తర్వాత, ఆ కులానికి చెందిన ఒక వర్గం మాత్రమే దరిచేరింది. బీజేపీ తొలి నుంచి తెలంగాణలో కీలక పాత్ర పోషించే సెటిలర్లు-కమ్మ వర్గంపై, పెద్దగా దృష్టి సారించడంలో విఫలమైంది. దానితో గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లు ఉండే డివిజన్లన్నీ, బీఆర్‌ఎస్ గెలిచేందుకు కారణమయింది.
అమరావతి నిలిచిపోవడానికి, ఏపీలో అభివృద్ధి ఆగిపోవడానికి, చంద్రబాబుపై జగద్ సర్కారు వేధింపులకు.. బీజేపీ ప్రోత్సాహం ఉందన్న ఆగ్రహం, ఆ పార్టీపై లేకపోలేదు. అసలు ఈ విషయంలో వారికి జగన్‌పై కంటే, మోదీ-షాలపైనే ఎక్కువ ఆగ్రహం ఉండటం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి తాజా పరిణామాలు తెలంగాణలో టీడీపీకి రాజకీయంగా లాభించకపోయినప్పటికీ, కాంగ్రెస్‌కు కలసివచ్చేవేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే తెలంగాణలోని 35 నియోజకవర్గాల్లో సెటిలర్లు-కమ్మ వర్గ ప్రభావం ఎక్కువ. ఆ నియోజకవర్గాల్లో 20 వేల నుంచి లక్షల ఓట్ల వరకూ ఈ వర్గాలవి ఉండటాన్ని విస్మరించకూడదు.2018లో జనరల్ సర్వేతోపాటు.. ఒక ప్రముఖ తెలుగుదినపత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం.. బాన్సువాడలో 20 వేలు, నిజామాబాద్ రూరల్‌లో 10 వేలు, మంచిర్యాలలో 18 వేలు. పటన్‌చెరులో 75 వేలు, ములుగులో 25 వేలు, కొత్తగూడెంలో 21 వేలు, అశ్వారావుపేటలో 24 వేలు, భద్రాచలంలో 30 వేలు, పినపాకలో 30 వేలు, సత్తుపల్లిలో 25 వేలు, మధిరలో 20 వేలు, పాలేరులో 18 వేలు, వైరాలో 12 వేలు, నాగార్జునసాగర్‌లో 14 వేలు, మిర్యాలగూడలో 12 వేలు, కోదాడలో 35 వేలు, ఇబ్రహీంపట్నంలో 20 వేలు, మహేశ్వరంలో 40 వేలు, చేవెళ్లలో 10వేలు, ఎల్బీనగర్‌లో 32 వేలు, షాద్‌నగ2ర్‌లో 12వేలు, మేడ్చెల్‌లో 80 వేలు, సనత్‌నగర్‌లో 35 వేలు, జూబ్లీహిల్స్‌లో 45వేలు, మల్కాజిగిరిలో 70 వేలు, ఉప్పల్‌లో 60 వేలు, ముషీరాబాద్‌లో 23 వేలు, సికింద్రాబాద్‌లో 25 వేలు, రాజేంద్రర్‌నర్‌లో లక్ష, కుత్బుల్లాపూర్‌లో రెండులక్షలు, కూకట్‌పల్లిలో 90 వేలు, శేరిలింగంపల్లిలో 3లక్షల 80 వేలమంది సెటిలర్లు-కమ్మ వర్గ ఓటర్లు ఉన్నారు. ఆ ప్రకారంగా 1367000మంది కమ్మ-సెటిలర్ల ఓట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 414500, ఖమ్మం జిల్లాలో 222500, హైదరాబాద్ జిల్లాలో 172500, నిజామాబాద్ జిల్లాలో 112000, నల్లగొండ జిల్లాలో 110000, వరంగల్ జిల్లాలో 65500, మెదక్ జిల్లాలో 60500, మహబూబ్‌నగర్ జిల్లాలో 18 వేలు, ఆదిలాబాద్ జిల్లాలో 21500, కరీంనగర్ జిల్లాలో 11500 మంది కమ్మ-సెటిలర్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. ఇది 2018నాటి సర్వే. తాజా ఓటరు జాబితాలో కనీసం 2 శాతం అదనంగా చేరి ఉండటం సహజం. ఆ ప్రకారంగా ఈ 35 నియోజకవర్గాల్లో కమ్మ-సెటిలర్ల సంఖ్య 15లక్షల పైమాటేనని స్పష్టమవుతోంది.
ఎందుకంటే ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత.. లక్షల సంఖ్యలో రేషన్‌కార్డులు హైదరాబాద్‌కు బదిలీ కావడాన్ని విస్మరించకూడదు. ఆ ప్రకారంగా ఈ నాలుగున్నరేళ్లలో… ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఎన్ని లక్షల మంది, వలస వచ్చారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.