Suryaa.co.in

Features

జాతి నిర్మాతలకే నిర్మాత.. ఆధునిక విధాత!

బ్రాహ్మణుడై పుట్టి
ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాడాడు…
తెలియని వయసులో
పెళ్లి చేసుకున్నా
బాల్యవివాహాలు తగదన్నాడు..
ఇలాగే ప్రతి దురాచారంపై
తిరుగుబాటు..
తిరుగులేని మాట..
జీవితమంతా అదే బాట..
కందుకూరు వీరేశలింగం…
నవయుగ తొలి వైతాళికుడు
జాతి నిర్మాతలకే నిర్మాత..
ఎందరి తలరాతలనో
తానుగా మార్చిన
ఆధునిక విధాత!

మగవాడెంతటి ముసలాడైనా
మళ్లీ పెళ్లికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని
బాలవితంతువులెందుకు
లేదా హక్కన్నాడు..
అని ఊరుకున్నాడా..
చేతికి గాజులు తొడిగాడు..
నుదుటిన తిలకం దిద్దాడు..
మోడువారిన చీకటి బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు..నిలిపాడు..
ఏదైనా గాని చెప్పి ఊరుకోలేదు..
నమ్మిందే చెప్పాడు..
చెప్పింది చేశాడు,.
ప్రవచనానికి అతడు కార్యరూపం..
సంస్కరణకు బహురూపం..!

హితకారిణి ఆవిర్భావం..
ఆస్తుల ధారాదత్తం..
బాలికల విద్య..
మూఢనమ్మకాల నిర్మూలన..
వితంతు వివాహం…
బాల్య వివాహాల నిషేధం..
ఇలా ఎన్నెన్నో సంస్కరణలు..
వీటి అమలుకు
అక్షరమే ఆయుధం..
సంస్కరణకు
సాహితీ సహకారం..
అలా అయ్యాడు ఈ లింగం
సంస్కరణల మేరునగం..
ఆయన సాహసానికి
అచ్చెరువొందె జగం..
అర్ధాంగి బాపమ్మ
జీవితంలోనూ..
ఆ జీవిత గమనంలోనూ
అచ్చంగా సగం..!

లంచం అడిగారని
సర్కారీ నౌకరీకి రాంరాం
అబద్ధాలు చెప్పరాదని
లాయరు చదువుకూ దూరం
బడే గుడని..
పంతులే దేవుడని
స్కూల్లోనే ఆవాసం..
సంస్కరణలతోనే సహవాసం!

ఆయనే వితంతు వివాహానికి
తొలి పురోహితుడు..
సహవిద్యకు ఆద్యుడు..
మొదటి నవలాకారుడు..
తొట్టతొలి ప్రహసనమూ
కందుకూరిదే..
తొలి నాటకం..
తొలి దర్శకుడు..
తొలి ప్రదర్శనకారుడు..
అన్నిటా వీరుడే
ఈ వీరేశలింగం..!
స్టేజీపై నాటకాలాడినా
జీవితంలో నాటకాలెరుగని
కందుకూరి జయంతి
అయింది నాటక దినోత్సవం
ఏ సంస్కరణ అయినా
ఆయనకే సంభవం!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE