-జీవీ ఆంజనేయులు నివాసంలో చర్చలు సఫలం
-కలిసి పనిచేసేందుకు సిద్ధమని శివరామ్ వెల్లడి
-ఇక పల్నాడు టీడీపీలో పుల్ జోష్
-సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐక్యతా రాగం
గత కొంతకాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ కలయిక పల్నాడు టీడీపీలో జోష్ నింపింది. వాళ్లిద్దరూ కలిసి పనిచేస్తామని ప్రకటించారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు నివాసంలో ఆయన సమక్షంలో మంగళ వారం ఇద్దరూ అల్పాహార విందుకు హాజరయ్యారు. వారిద్దరితో జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు సత్తెనపల్లి పార్టీకి ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. చాలాకాలంగా టీడీపీ అధిష్ఠానం చర్యల పట్ల అసంతృప్తితో ఉన్న కోడెల శివరామ్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. కన్నా లక్ష్మీనారాయణతో కలసి పనిచేసేం దుకు సుముఖత వ్యక్తం చేశారు. 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి డాక్టర్ కోడెల శివప్రసాద్ గెలిచి స్పీకర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. కోడెల మరణం నేపథ్యం లో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను కోడెల శివరామ్ ఆశించారు. ఇదే టికెట్ ను బీజేపీ నుంచి వచ్చిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆశించడంతో వీరిద్దరి మధ్య పోటీ నడిచింది. కానీ చివరికి టీడీపీ అధిష్ఠానం రాజకీయ సమీకరణాల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణకే టికెట్ కేటాయించింది.
దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న శివరామ్ పార్టీ మీద అలక వహించారు. అయితే పల్నాడు జిల్లాలో డాక్టర్ కోడెల కుటుంబానికి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఇటు సత్తెనపల్లి, అటు నర్సరావుపేట రెండు నియోజకవర్గాల్లో ఆయన సేవలు వినియోగించుకోవాలని టీడీపీ నిర్ణయించింది. ఆ దిశగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఫలించడంతో పల్నాడు జిల్లా టీడీపీలో జోష్ నెలకొనగా వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జి.వి ఆంజనేయులు వారి కలయికకు చొరవచూపారు. వారిని కలిసి కూర్చోబెట్టి పార్టీకి వారి ద్దరి సఖ్యత ఎంత అవసరమో వివరించారు.
ఈ సమావేశంలో జి.వి.ఆంజనేయులుతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, చిరంజీవులు పాల్గొని కోడెల శివరామ్ ను బుజ్జగించారు. కోడెల శివరామ్ పార్టీ పట్ల తన అసంతృప్తికి కారణాలు వెల్లడిరచగా జి.వి.ఆంజనేయులు అధిష్టానం తన భవిష్యత్తుకు ఏమేమి చర్యలు తీసుకోనుందో వాటిని వివరించారు. డాక్టర్ కోడెల శివప్రసాద్‌తో టీడీపీ అనుబంధం, కోడెలకు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యం వివరిస్తూ తమకు కోడెల కుటుంబం ఎంత ప్రధానమో తెలియచెప్పారు. అలాగే కోడెల శివరామ్‌కు అతి త్వరలోనే పార్టీ నుంచి మంచి పదవిని కట్టబెట్టి సముచిత రీతిలో ప్రాధాన్యం కల్సించనున్నట్లు వెల్లడిరచారు.
దీంతో పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా తాను సత్తెనపల్లిలో కన్నాతో కలసి పనిచేస్తానని, అలాగే నర్సరావుపేటలోనూ తన సేవలను అందచేస్తానని శివరామ్ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు పార్టీ కార్యక్ర మాల్లో అంటీముట్టనట్లుగా ఉన్న కోడెల వర్గం సరైన సమయంలో ఎన్నికల సమరంలోకి కలసి రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి పల్నాడు జిల్లాలో డాక్టర్ కోడెల శివప్రసాద్‌కు అసంఖ్యాకంగా అభిమానులు ఉండగా వారందరూ ఇప్పుడు కోడెల శివరామ్ పిలుపుతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయటానికి సిద్ధమవుతున్నారు.