Suryaa.co.in

Editorial

‘ఫ్యాను’ గాలి తీసిన ధర్మాన

– ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తామంటున్నారట
– ‘ఫ్యాను’ గుర్తు ఎక్కడా కనిపించడం లేదట
– కాంగ్రెస్ పేరు కూడా చెబుతున్నారట
– ఎవరిని అడిగినా అదే చెబుతున్నారంటూ విస్మయం
– పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వేడికోలు
– పల్లెల్లో ‘ఫ్యాను’ గాలి ఆగినట్లేనా?
– ధర్మాన ప్రసాదరావు మనసులోమాట
– అన్నిచోట్లా వైసీపీ అభ్యర్ధులది ఇదే పరిస్థితి
– మనసులో మాట బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు
– వైనాట్ 175 అంటూ వైసీపీ మేకపోతు గాంభీర్యం
– గోదావరి జిల్లాలలో ఫోన్లు తీయని వైసీపీ అభ్యర్ధులు
– తలపట్టుకుంటున్న నాయకత్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిరోజుల్లో సీఎంగా ఉండగా మనసులో మాట అని పుస్తకం రాశారు. దానిలో వివిధ రంగాల్లో సంస్కరణలు తదితర అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఆ పుస్తకంలోని అంశాలలో వ్యతిరేక కోణాలు ఆవిష్కరించి, చంద్రబాబును అప్రతిష్టపాలు చేయడంలో విజయం సాధించారు. ఇది చాలాకాలం క్రితం నాటి ‘మనసులోమాట’ పుస్తకానికి సంబంధించిన వ్యవహారం.

ఇప్పుడు జగన్ సర్కారులో అత్యంత సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు కూడా తన మనసులో మాట బయటపెట్టారు. అప్పుడు వైఎస్ మాదిరిగా ఇప్పుడు కూటమి దానిని అందుకుని, వైసీపీకి ఊపిరాడకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది. పల్లెల్లో తమ పార్టీ గుర్తు కనిపించడం లేదంటూ ధర్మాన బయటపెట్టిన మనసులోమాట, ఇప్పుడు ఫ్యానును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దానితో ‘దర్మాన ధర్మరాజులా తన పార్టీ వాస్తవ పరిస్థితి బయటపెట్టారం’టూ సోషల్‌మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి.

ఇంతకూ ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేటలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సహజంగా ఎక్కడికి వెళ్లినా వారి పల్సు తెలుసుకునే అలవాటున్న ధర్మాన, అక్కడ కూడా అదే పనిచేశారు. స్థానికుల వద్దకు వెళ్లి ‘ఏటమ్మా? ఎలగున్నరు? ఓటు ఎవరికేస్తారేటి?’ అని ఆరా తీశారు. దానికి అక్కడున్న మహిళలు టీడీపీకే వేస్తామని మూకుమ్మడిగా చెప్పడంతో విస్తుపోవడం ధర్మాన వంతయింది.

మరికొందరు మాత్రం, తాము కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పారే తప్ప.. ఒక్కరు కూడా ఫ్యాను గుర్తుకు వేస్తామని చెప్పకపోవడమే, ఆయనను విస్మయపరిచిందట. అంతమందిలో కనీసం ఒక్కడైనా.. తాను అడిగానన్న మొహమాటంతోనయినా ఫ్యాను గుర్తుకు వేస్తానని చెబుతాడేమోనని ఎదురుచూసిన ధర్మానకు, పాపం నిరాశే ఎదురయింది.

దానితో పార్టీ కార్యకర్తలను పిలిచి హితోపదేశం చేశారు. ‘‘ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అంతా టీడీపీకే ఓటు వేస్తామంటున్నారు. ఇంకొంతమంది కాంగ్రెస్‌కు ఓటేస్తామంటున్నారే తప్ప మన పార్టీకి ఓటు వేస్తామని ఎవరూ చెప్పడం లేదు. మన పార్టీ గుర్తును ప్రచారం చేయాలి కదా’’ అని గీతోపదేశం చేసి వెళ్లిపోయారట. ఇదండీ ధర్మాన ‘మనసులోమాట’. అంటే పల్లెల్లో ఫ్యాను గాలి ఆగిపోయిందని, అంతలావు అనుభవజ్ఞుడైన ధర్మాన అంగీకరించారంటే, క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.

నిజానికి పట్టణాల్లో అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గ్రామాల్లో మాత్రం వైసీపీకి బలం ఉందన్న భావన ఇప్పటివరకూ ఉంది. దానితోపాటు గ్రామీణప్రాంత మహిళలు, జగన్ పథకాలకు ఆకర్షితులయి ఉన్నారన్న భావన కూడా బలంగా ఉంది. ఆ ధీమాతోనే జగన్ అధికారంపై ధీమాతో ఉన్నారని అటు వైసీపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. కానీ తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లిన శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేట, నూటికి నూరు శాతం పక్కా గ్రామీణ ప్రాంతం. అక్కడి మహిళలే తాము టీడీపీకి ఓటు వేస్తామని మంత్రికే నిర్మొహమాటంగా చెప్పారంటే, పల్లెలో పార్టీ పరిస్థితి ఏమిటన్నది సుస్పష్టం.

అయితే పార్టీ అధినేత-సీఎం జగన్ నుంచి సలహాదారు సజ్జల వరకూ.. వైనాట్ 175? వైనాట్ కుప్పం? అని ఊదరగొట్టడమే పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. క్షేత్ర స్థాయిలో అసలు పార్టీకి ఓటేసేదే లేదని, టీడీపీకే వేస్తామని మంత్రుల ఎదుటే మహిళలు నిర్మొహమాటంగా, కుండబద్దలు కొడతున్న పరిస్థితిని గుర్తు చేస్తున్నారు.

గతంలో సజ్జల చెప్పినట్లు ‘మాకు వేరే సెక్షన్ ఓటర్లు ఉన్నార’నుకున్నప్పటికీ… ఇంత వ్యతిరేకతలో ఆ ‘వేరే సెక్షన్ వారి ఓట్ల శాతం’ ఎంతన్నది పార్టీ వర్గాలకు అర్ధం కావడం లేదు. 80 శాతానికి పైగా ప్రజల్లో సంతృప్తి ఉన్నప్పుడు సహజంగా భయపడాల్సిన పనిలేదని, కానీ జగన్ బస్సు దిగకుండా ప్రచారం చేస్తున్నారంటేనే, తమ పార్టీ ఏ స్థాయిలో ఆందోళనలో ఉందో స్పష్టమవుతోందని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఉభయగోదావరి జిల్లాల్లోని కొందరు టికెట్లు తీసుకున్న వైసీపీ అభ్యర్ధులు, పార్టీ నాయకత్వానికి అందుమాటులో ఉండకపోవడం నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందట. వారు ఫోన్లు కూడా తీయడం లేదని, దానితో ఆ నియోజకవర్గ ప్రముఖులకు ఫోన్లు చేసి, ఆ ఫోన్లను అభ్యర్ధులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి నామినేషన్ల నాటికి పార్టీ అభ్యర్ధులు ఎంతమంది బరిలో ఉంటారో.. ఎంతమంది అస్త్రసన్యాసం చేస్తారోనన్న ఆందోళన పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE