మునుగోడులో.. బడు‘గోడు’

– అక్కడ మూడుపార్టీల ‘రెడ్డి’కార్పెట్‌
– పేరు బీసీలది పెత్తనం ఓసీలది
– అన్ని పార్టీల అభ్యర్ధులూ అగ్రకులాలవారే
– బీసీలు లక్షన్నర
– ఎస్సీలు 35 వేలు
– ఓసీలు 20 వేలు
– అయినా రెడ్లదే హవా
( మార్తి సుబ్రహ్మణ్యం)

మునుగోడు ఉప ఎన్నిక సామాజిక చిత్ర విచిత్రాన్ని ఆవిష్కరించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. తమ అభ్యర్ధులుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే ప్రకటించాయి. బీఎస్పీ మాత్రమే విశ్వబ్రాహ్మణ
munugodu-candidatesసామాజికవర్గానికి చెందిన శంకరాచారి బీసీ అభ్యర్ధిని ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్ధులుగా ప్రకటించాయి.

మునుగూడు నియోజకవర్గం ఏర్పడిన 1962 తర్వాత, ఇప్పటివరకూ ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం విచిత్రం. ఇక్కడి నుంచి సీపీఐ ఐదుసార్లు గెలిచినా, సామాజిక న్యాయం గురించి పోరాడే ఆ పార్టీ నుంచి కూడా, వెలమ-రెడ్డి వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలవడం మరో విశేషం.

మరి దశాబ్దాల నుంచి రెడ్డి సామాజికవర్గానిదే అక్కడ హవా సాగుతోంది కాబట్టి, మునుగోడులో రెడ్ల సంఖ్య ఎక్కువ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పోనీ అంతకుముందు.. వెలమలు కూడా గెలిచినందున, అక్కడ వెలమ ఓట్లు అధికం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజానికి ఆ రెండు కులాల ఓట్లు అత్యల్పం. మునుగోడు నియోజకవర్గంలో బీసీల సంఖ్య అధికం. మరి బీసీలకు ప్రధాన పార్టీలు సీట్లు ఎందుకు ఇవ్వటం లేదు? సామాజిక న్యాయ పాఠాలు చెప్పే పెద్ద పార్టీలు, వాటిని ఆచరణలో ఎందుకు అమలుచేయవు? ఓట్లు మావి.. సీట్లు వారివా?.. ఇప్పుడదే మునుగోడులో.. బడు‘గోడు’.

munugodu-picమునుగోడు నియోజవర్గం ఓటర్ల సంఖ్య 2 లక్షల 27 వేల 101. అందులో బీసీలు 1,50,400 (66.2శాతం), ఎస్సీలు 35,411 (15.6 శాతం), ఓసీలు 20,290 (8.9 శాతం), ఎస్టీలు 13000 (5.7 శాతం), మైనారిటీలు 8000 (3.5 శాతం). కాగా కులాలవారీగా పరిశీలిస్తే.. గౌడ 38000 (16.7 శాతం), గొల్ల,కురుమ 35000(15.4 శాతం), ముదిరాజ్‌ 34,500 (15.2 శాతం), పద్మశాలి 19000 (8.4 శాతం), వడ్డెర 8300 (3.6 శాతం), విశ్వబ్రాహ్మణ 7800 (3.4 శాతం), కుమ్మరి 7800 (3.4 శాతం). కాగా ఎస్సీలలో మాదిగ 25000 (11శాతం), మాల 10411 (4.6 శాతం). ఇక ఓసీలలో.. రెడ్డి 7701 (3.3 శాతం), కమ్మ 4,800 (2.1శాతం), వెలమ 2360 (1.0 శాతం), వైశ్య 3760 (1.6 శాతం), ఇతరులు 1589 (0.9) ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అంటే మూడు ప్రధాన పార్టీలు నిలబెట్టిన రెడ్ల ఓట్ల సంఖ్య.. కేవలం 7701 కాగా, బీఎస్పీ నిలబెట్టిన బీసీల సంఖ్య 7800 అన్నమాట. ఇంకా చెప్పాలంటే.. బీఎస్పీ అభ్యర్ధి శంకరాచారి సామాజికవ ర్గమైన విశ్వకర్మల కంటే, రెడ్ల ఓట్ల సంఖ్య వంద తక్కువ కావడం విశేషం. పైగా రెడ్లలో మూడు నాలుగు తెగల ఓట్లు ఉండటం, మూడు పార్టీల అభ్యర్ధులు, ఆయా తెగల వారు కావడంతో.. రెడ్ల ఓట్లు మొత్తంగా ఎవరికీ పోలయ్యే అవకాశాలు లేవు. అదొక విచిత్రం.

రెడ్లలో మటాటి, పాకనాటి, పెడకంటి, గుడాటి తెగలలో.. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి గుడాటి, కాంగ్రెస్‌ అభ్యర్ధి స్రవంతి మటాటి, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ప్రభాకర్‌రెడ్డి గుడాటికి చెందిన వారు. వీరిలో మటాటి రెడ్లకు ఎక్కువ పలుకుబడి ఉన్న వర్గంగా పేరుంది. మటాటి-గుడాటి రెడ్ల మధ్య పొసగదు. ఫలితంగా రెడ్ల ఓట్లు, ఏ పార్టీకీ గంపగుత్తగా పడే అవకాశాలు ఉండవు. అయినప్పటికీ దశాబ్దాల నుంచి రెడ్డి సామాజికవర్గమే మునుగోడును శాసించడం ఆశ్చర్యం.