Suryaa.co.in

Andhra Pradesh

ఏపీని “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర” గా ప్రకటించేయండి

పవన్ ఎద్దేవా

అమరావతి: ఏపీలోని అధికార వైకాపాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేనికీ గర్జనలు?అంటూ సోమవారం ట్వీట్లతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఆయన.. మంగళవారం కూడా వైకాపాపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఏపీని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’గా ప్రకటించాలని పవన్‌ ఎద్దేవా చేశారు. ”వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు? 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులను ఏర్పాటు చేయండి. చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్లుగా భావిస్తుంటారు.. అలాగే ప్రవర్తిస్తుంటారు కదా! ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు కదా మీకు! ఏమాత్రం సంకోచించకండి.. రాష్ట్రంలో వైకాపా రాజ్యాంగాన్ని అమలు చేయండి!”అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

‘దేనికీ గర్జనలు’ అంటూ పవన్‌ చేసిన ట్వీట్లపై వైకాపాకు చెందిన పలువురు మంత్రులు ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ ఘాటుగా బదులిచ్చారు.మరోవైపు అమెరికాలోని సౌత్‌ డకోటాలో ఉన్న ‘మౌంట్‌ రష్‌మోర్‌’ ఫొటోను పవన్‌ పోస్ట్‌ చేస్తూ దాన్ని ‘రుషికొండ’కు అన్వయించారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకు ‘మౌంట్‌ రష్‌మోర్‌’ చిహ్నమని పేర్కొన్నారు. రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌’.. ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నమంటూ కొంతమంది వ్యక్తుల ఫొటోలతో ఉన్న కార్టూన్‌ను పవన్‌ పోస్ట్‌ చేశారు.

LEAVE A RESPONSE