– త్యాగానికి చంద్రబాబు సిద్ధం?
– జగన్‌ను ఎదుర్కొనేందుకు టీడీపీ బ్లూప్రింట్ రెడీ
– రెడ్డి, ఎస్టీ, యాదవ్, కమ్మ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి?
– మాదిగ నేతకు ఏపీ పార్టీ పగ్గాలు?
– మంత్రుల్లో 60 శాతం బీసీలకే?
– క్యాబినెట్‌లో ముస్లిం, శెట్టిబలిజ, కొప్పుల వెలమ, కళింగ, తూర్పు కాపులకు ప్రాధాన్యం
– కార్పొరేషన్ పదవుల్లో వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం
– పార్టీ పదవుల్లో కమ్మ, రెడ్డి, ముస్లిం, ఎస్సీలకు పెద్ద పీట
– కుల సమీకరణతో అధికారం వైపు టీడీపీ అడుగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వచ్చే ఎన్నికలను చావో రేవోగా భావిస్తున్న టీడీపీ నాయకత్వం ఆమేరకు కులసమీకరణ వైపు అడుగులేస్తోంది. అందులో భాగంగా పార్టీ కోసం త్యాగం చేసేందుకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం సీఎంగా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఇకపై కీలక కుల నేతకు సీఎం పగ్గాలు అప్పగించి, తాను పార్టీ-ప్రభుత్వాన్ని పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్ధికంగా బలంగా మారిన జగన్‌ను ఎదుర్కొనేందుకు, కుల సమీకరణ ఒక్కటే మార్గంగా భావిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ మేరకు జనాభాలో 24 శాతం ఉన్న కాపులకు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చే సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి అర్ధబలాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ నాయకత్వం.. దానికి కులసమీకరణ ద్వారా, చెక్ పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా జనాభాలో 24 శాతం ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు, పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి తూర్పు-పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపులుగా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బలిజలుగా చెలామణి అవుతున్న కాపు వర్గాల సంఖ్య, దాదాపు 24 శాతానికి పైనే ఉంది. ఆ స్థాయిలో తమ జనాభా ఉన్నప్పటికీ.. 10 శాతంలోపే ఉన్న కమ్మ-రెడ్డి వర్గాలు దశాబ్దాల నుంచి ముఖ్యమంత్రి పదవి అనుభవించడాన్ని, కాపు-బలిజ-ఒంటరి వర్గాలు కొన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ ఆకాంక్షతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి, ఆయా వర్గాలు జైకొట్టాయి. ఫలితంగా 18 అసెంబ్లీ సీట్లతోపాటు, 74 లక్షల ఓట్లు ఆ పార్టీ సాధించగలిగింది. అయితే పీఆర్పీని ఎక్కువ కాలం నడిపించలేని చిరంజీవి, తన పార్టీకి కాంగ్రెస్‌లో విలీనం చేసి కాపుల ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసే ముందు.. కాపులను బీసీల్లో చేర్చాలన్న షరతు విధించలేదు.
ఆవిధంగా చిరంజీవి, కాపుజాతిని పట్టించుకోకుండా తన దారి తాను చూసుకున్నారన్న ఆగ్రహం, కాపు జాతిలో భగ్గుమంది. ఆ సమయంలో చిరంజీవి.. కాపులకు బీసీ రిజర్వేషన్ల షరతు విధించి ఉంటే, వైఎస్ కచ్చితంగా దానిని అమలుచేసి తీరేవారన్న వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి.
రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పెరిగిన ఆ కాలంలో.. చాలామంది కాపు ప్రముఖులు పీఆర్పీ టికెట్ల కోసం భూములు అమ్ముకుని, ఆర్ధికంగా నష్టపోయారన్న అపవాదు వినిపించింది.
మొత్తంగా చిరంజీవి పీఆర్పీ వల్ల, చాలామంది కాపులు ఆర్ధికంగా నష్టపోయారన్న భావన ఇప్పటికీ లేకపోలేదు. ఇప్పుడు పవన్ కూడా తనకు కులం లేదని, తన కు అన్ని కులాలూ సమానమేనని స్పష్టం చేశారు. దానితో ఓటు హక్కు లేని కాపు యువత తప్ప, 40 ఏళ్లు దాటిన కాపులెవరూ జనసేనను నమ్మడం లేదన్న భావన బలంగా నెలకొంది. బహుశా ఆ కారణంతోనే కాపులు, పవన్ జనసేనను నమ్మడం లేదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇలాంటి సామాజిక సమీకరణను గమనించిన టీడీపీ నాయకత్వం… వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్ధిగా, కాపు నేతనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరకంగా కాపులను మెప్పించాలన్నది టీడీపీ వ్యూహంలా కనిపిస్తోంది. ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరినా-కుదరకపోయినా ఇదే ఫార్ములాను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక చాలాకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న రెడ్డి సామాజికవర్గానికి, డిప్యూటీ సీఎం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత మూడున్నరేళ్లలో, పార్టీని అంటిపెట్టుకున్న రెడ్డి నేతలెవరూ టీడీ పీని వీడలేదు. కమ్మ వర్గ నేతలు తప్ప, మిగిలిన ఏ సామాజికవర్గ నేతలూ పార్టీని వీడకపోవడం గమనార్హం. పైగా… రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్న చోట్ల, వైసీపీపై ఆ వర్గం విముఖతతో ఉన్న విషయాన్ని, టీడీపీ నాయకత్వం గ్రహించిందంటున్నారు.
తమకంటే.. తమవెంట తిరిగే దళితులు, ్రైకె స్తవులకే వైసీపీ నాయకత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న అసంతృప్తి వైసీపీ రెడ్డి నేతల్లో ఉంది. గ్రామ-మండల స్ధాయిలో చాలామంది రెడ్డి నేతలకు, బిల్లులు రాక అసంతృప్తితో రగలిపోతున్నారు. దీనిని టీడీపీ నాయకత్వం గ్రహించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా వారిని మెప్పించేందుకు.. రెడ్డి వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఏపీ జనాభాలో, రెండవ అతిపెద్ద కులమైన యాదవులకు సైతం.. ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, టీడీపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా గతంలో తాము నిర్లక్ష్యం చేసిన, ఎస్టీ సామాజికవర్గానికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక దశాబ్దాలుగా తనను నమ్ముకున్న, కమ్మ వర్గానికి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమకు టీడీపీతో ఎలాంటి ఉపయోగం లేదన్న అసంతృప్తితో, కమ్మవర్గం పోలింగ్ సమయంలో అంటీముట్టనట్లు వ్యవహరించింది. దీనిని పార్టీ నాయకత్వం గ్రహించినట్లు చెబుతున్నారు.
అదేవిధంగా క్యాబినెట్‌లో 6ం శాతం బీసీలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. అదే సమయంలో తొలి నుంచీ అనేక కారణాలతో ప్రాధాన్యం ఇవ్వని వర్గాలకు.. ఈసారి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే.. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, మైనారిటీ వర్గాలకు, పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఆ ప్రకారంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి శెట్టిబలిజ, ఉత్తరాంధ్ర నుంచి కొప్పుల వెలమ, తూర్పు కాపు, కళింగ, రాయలసీమలో బలిజలకు క్యాబినెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చె బుతున్నాయి. ప్రధానంగా రాయలసీమలో రెడ్లను వ్యతిరేకించే.. బలిజలకు ఎక్కువ సీట్లతోపాటు, క్యాబినెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో క్యాబినెట్‌లో ఈసారి ముస్లిం వర్గాలకు, అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక పార్టీ పదవుల్లో కమ్మ-రెడ్డి-ముస్లిం-మాదిగలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైశ్య-క్షత్రియ-రెడ్డి వర్గాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తర్వాత అత్యంత కీలకమైన మాదిగ వర్గానికి, ఏపీ పార్టీ అధ్యక్ష పదవి యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీలో మాలలు- దళిత క్రైస్తవులు, వైసీపీ ైవె పు ఉండగా, మాదిగలు తొలి నుంచీ టీడీపీకి మద్దతుదారుగా కొనసాగుతున్నారు. అయితే, గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు, మాదికలకు ఆగ్రహం కల్పించాయి. ఈ క్రమంలో మాదిగలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా, ఆ వర్గాన్ని మెప్పించే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జగన్‌ను ఎదుర్కొనే అంశంలోపాటు, భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే … కాపులకు సీఎం పదవి ప్రకటించడమే ఏకైక పరిష్కారంగా, పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు సీఎంగా పనిచేశారు. కేంద్రంలో ప్రధానులను నిర్ణయించారు. కాబట్టి ఆయనకు పదవులపై పెద్ద ఆశలేమీ లేవంటున్నారు.
ఇదే విషయాన్ని చంద్రబాబు, తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు. కాబట్టి.. చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికే పరిమితయి, కాపు నేతకు సీఎం అభ్యర్ధిగా ప్రకటించమే మంచిదన్న నిర్ణయానికి, టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ వ్యూహంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని, పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.