Suryaa.co.in

Editorial

వైసీపీకి ‘కాపుముద్ర’గడ!

– వైసీపీలో చేరేందుకు ముద్రగడ రెడీ?
– పవన్‌ పిఠాపురంలో పోటీ చేస్తే ఆయనపై ముద్రగడ పోటీ?
– లేకపోతే కుమారుడికి టికెట్‌
– వైసీపీ అసలు వ్యూహం అదేనా?
– త్వరలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని లేఖ రాసిన ముద్రగడ
– తనను గతంలో తీహార్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారంటూ లేఖ
– ఏపీ పోలీసులు తీహార్‌కు ఎలా తీసుకువెళతారోనని సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
– కొడుకుకు టికెట్‌ కోసమే వైసీపీలో చేరుతున్నారా?
– గతంలో కాపు ఉద్యమం నుంచి నిష్క్రమిస్తున్నానన్న ముద్రగడ
– మరి ఇప్పుడు కాపులు మళ్లీ ఆదరిస్తారా?
– గతంలో బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతల ఆహ్వానం
– వైసీపీతో ముద్రగడకు మానసిక రాజకీయ బంధం
– ఎన్నికల ముందు భూమనతో ముద్రగడ ముచ్చట్లు
– బాబు హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్ద‘రగడ’
– కంచాలతో శబ్దయుద్ధం చేసిన ముద్రగడ
– కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన చంద్రబాబు
– అయినా కృతజ్ఞత చెప్పని పద్మనాభం
– జగన్‌ హయాంలో ఒక్క ఉద్యమం కూడా చేయని మొహమాటం
– కాపు ఉద్యమాన్ని జగన్‌కు తాకట్టు పెట్టారన్న నిందలు
– టీడీపీ హయాంలోనే ముద్రగడకు కాపు సమస్యలు గుర్తుకొస్తాయన్న విమర్శలు
– వైసీపీలో మరి ‘ఆత్మగౌరవ ముద్రగడ’కు విలువ ఉంటుందా?
– ముద్రగడను వైసీపీ భరిస్తుందా?
– జగన్‌ వైఖరితో ‘ఆత్మగౌరవ’ నేత ముద్రగడ సర్దుకుపోతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎట్టకేలకూ ‘కాపు ఉద్యమ మాజీనేత’.. ముద్రగడ పద్మనాభం రాజకీయ పున:ప్రవేశం చేస్తున్నారు. ఆమేరకు తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ముద్రగడతో ఆయన భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కలిసినా ప్రయోజనం కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు ముద్రగడ.. తన రాజకీయ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానంటూ, ఒక లేఖ ద్వారా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తర్వాతనే, ముద్రగడ లేఖ రాశారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన కుమారుడికి అసెంబ్లీ సీటు కోసమే, వైసీపీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. బహుశా మంచి ముహుర్తం చూసుకుని, పుత్రుడితోపాటు ముద్రగడ వైసీపీలో చేరవచ్చంటున్నారు. మరోవైపు జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆయనపై ముద్రగడ పద్మనాభాన్ని, బరిలోకి దించాలన్న వ్యూహం కూలా లేకపోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

కాపులు వైసీపీకి పూర్తి వ్యతిరేకతతో ఉన్న క్రమంలో.. ముద్రగడ ద్వారా కాపులను తన వైపు మళ్లించుకోవాలన్నది, వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ముద్రగడకు కాపులలో ఉన్న ఇమేజ్‌ను సొమ్ము చేసుకోవడం ద్వారా.. టీడీపీ-జనసేనకు చెక్‌ పెట్టాలన్న వ్యూహంతోనే, ముద్రగడ కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని, వైసీపీ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? లేదా అన్న అంశంపై కాపు వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నిజానికి తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు, ముద్రగడ చాలాకాలం క్రితమే ప్రకటించారు. దానితో కాపు సంఘాలు ఆయనను కలవడం మానేశాయి. చంద్రబాబు హయాంలో రిజర్వేషన్ల కోసం పోరాడి, అరెస్టయిన ముద్రగడ.. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి కూడా ఉద్యమం చేసిన దాఖలాలు లేవు. లేఖలతో సరిపుచ్చడమే తప్ప, సమరశంఖం పూరించలేదు. అది సహజంగానే ముద్రగడ ఇమేజీ.. డామేజీ కావడానికి కారణమయింది.

వైసీపీతో మొహమాటంతోనే ఉద్యమాలు చేయడం లేదని కొందరు.. వైసీపీకి కాపు జాతిని తాకట్టు పెట్టారని ఇంకొందరు.. టీడీపీ అధికారంలో ఉంటేనే ఆయనకు కాపు సమస్యలు గుర్తువస్తాయని మరికొందరు.. సోషల్‌మీడియా వేదికగా ముద్రగడపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు సంధిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ, దానిని అమలు చేయాలని జగన్‌ సర్కారుపై, ఎందుకు పోరాడటం లేదన్న ప్రశ్నలు శరపరంపరగా ముద్రగడపై సోషల్‌మీడియాతో సంధించారు. దీనితో మనస్తాపం చెందిన ముద్రగడ, తనపై విమర్శలు భరించలేక.. ఇక తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరితే, పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కాపువర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి ఆయనకు వైసీపీతో మానసిక రాజకీయబంధం ఉంది. తుని సభకు ముందు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కిర్లంపూడికి వెళ్లి, ముద్రగడతో భేటీ అయ్యారు. దానితో కాపు ఉద్యమాన్ని వైసీపీ తెరవెనుక నుంచి నడిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాపు ఉద్యమాలతోనే పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న ముద్రగడ .. ఎప్పుడయితే కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారో, అప్పుడే ఆయన ఇమేజ్‌ పూర్తిగా దెబ్బతిందన్న వ్యాఖ్యలు, కాపు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అసలు కాపు ఉద్యమం నుంచే నిష్క్రమించిన ముద్రగడ చెబితే, కాపులు వైసీపీకి ఎందుకు ఓట్లు వేస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ల అమలు కోసం.. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యమం కూడా చేయని ముద్రగడకు, ఇక కాపుల్లో ఏం పలుకుబడి ఉంటుందని కాపు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరి దానివలన ఆయనను చేర్చుకుని, వైసీపీ కొత్తగా సాధించే రాజకీయ ప్రయోజనం ఏమిటన్న సందేహం, అటు వైసీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.

పైగా.. జగన్‌-ముద్రగడ మనస్తత్వాలు పూర్తి విరుద్ధమైన నేపథ్యంలో, వైసీపీలో ముద్రగడ ఉనికి ఎన్నాళ్లు అన్న ప్రశ్నలకు సహజంగానే తెరలేచింది. ముద్రగడ మొండి అయితే-జగన్‌ జగమొండి. సొంత శైలి, ఆత్మగౌరవంతో వ్యవహరించే ముద్రగడ.. అవి మచ్చుకయినా కనిపించని వైసీపీలో, ఆయన మనుగడ సాగించగలరా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకే అపాయింట్‌మెంట్లు ఇవ్వని జగనన్న పోకడను, ముద్రగడ ఎక్కువకాలం సహించకపోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే.. ముద్రగడ ఒంటెత్తు పోకడ, ఏకపక్ష నిర్ణయాలను వైసీపీ ఎంతకాలం భరిస్తుందన్న చర్చ, అటు వైసీపీ వర్గాల్లోనూ జరుగుతోంది. ఇప్పటివరకూ ముద్రగడ తీసుకున్న నిర్ణయాలన్నీ, ఏకపక్షమేనని వారు గుర్తు చేస్తున్నారు. తుని బహిరంగసభలో మాట్లాడి, కిందకు దిగిపోయిన సందర్భంలో కూడా ఆ నిర్ణయాన్ని.. వేదికపై ఉన్న కాపు నేతలతో పంచుకోని విషయాన్ని, వైసీపీ కాపు వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ వైఖరి రాజకీయాల్లో కుదరనందున, ఆయన తమ పార్టీలో ఎన్నాళ్లు కొనసాగుతారో చూడాలన్న వ్యాఖ్యలు, వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, పెండెం దొరబాబు , దొరబాబు, పర్వతపూర్ణచంద్రప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు వంటి ఐదుగురు కాపు ఐదుగురు ఎమ్మెల్యేలు- నియోజకవర్గ ఇన్చార్జులంతా కాపులే. వీరంతా వైసీపీలో పాతుకుపోయారు. విచిత్రంగా ముద్రగడతో వీరికి సంఖ్యత కూడా లేదు. పైగా వారంతా ఆయన వ్యవహారశైలిని, వ్యతిరేకిస్తారని కాపు వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్ర ప్రసాద్‌కు ఈసారి టికెట్‌ ఇవ్వరని, ఆయన స్థానంలో ముద్రగడకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదేజరిగితే పర్వతపూర్ణచంద్ర ప్రసాద్‌ వైసీపీకి, రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంపై బలమైన పట్టున్న పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అనుచరులు, కొత్తగా పార్టీలో చేరే ముద్రగడకు, రాజకీయంగా సహకరించడం కష్టమేనంటున్నారు.

తాజాగా ముద్రగడ ప్రజలకు రాసిన లేఖలో.. చంద్రబాబు హయాంలో తనను పోలీసులు అరెస్టు చేసి, తీహార్‌ జైలుకు తీసుకువెళ్లే కుట్ర చేశారని పేర్కొనడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ముద్రగడ ఉన్న ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా పరిథిలో జరిగే అరెస్టులన్నీ, సహజంగా ఆ జిల్లా పరిథిలోనే ఉంటాయి. ఆ క్రమంలో నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తుంటారు. ఈడీ, సీబీఐ కేసులతోపాటు.. ఢిల్లీ కేంద్రంగా జరిగే నేరాలకు మాత్రమే, తీహార్‌ సెంట్రల్‌జైలుకు పంపిస్తుంటారు.

‘‘మరి మిమ్మల్ని ఢిల్లీలోని తీహార్‌ జైలుకు ఎందుకు తీసుకువెళతారండి? మంత్రి పదవి చేసిన మీకు అది కూడా తెలియదాండి? లేఖలు రాసేముందు అన్నీ చూసుకోవాలి కదండీ?’’ అంటూ… ముద్రగడ లేఖ శైలిని అనుకరిస్తూ, సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

LEAVE A RESPONSE