పోలీసు హాండౌట్ జర్నలిజం నుంచి పోలీసు మనస్తత్వ జర్నలిజానికి…

ఇవాళ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఒక శీర్షికలో “ఒకడు” “మరొకడు” అని ఏకవచన, అవమానకర ప్రయోగాలు చూసి దిగ్భ్రాంతి చెందాను. అది ఉగ్రవాదులనే ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరి గురించి వార్త. పత్రికల్లో ఎవరి గురించి అయినా అటువంటి ప్రయోగం అనుచితం కాగా, ఇవాళ్టి సందర్భంలో ఇది తీవ్రంగా అభ్యంతరకరం.

పోలీసుల మాటలు యథాతథంగా నమ్మవచ్చునా, పోలీసులు ఉగ్రవాదులు అని ఆరోపిస్తున్నవాళ్లు ఉగ్రవాదులు అవునా కాదా, వాళ్లకు ఏదైనా ఉగ్రవాద చర్య చేసిన చరిత్ర ఉందా, పోలీసులు వాళ్లను ఉగ్రవాదులు అంటున్నారు గనుక సాక్ష్యాధారాలు లేకుండానే, “సహేతుకమైన అభ్యంతరాలన్నిటినీ దాటిన” (బియాండ్ రీజనబుల్ డౌట్) చట్టబద్ధమైన విచారణ ప్రక్రియ లేకుండానే పోలీసులు చెప్పిన మాటను అంగీకరించవచ్చునా అనే మౌలిక ప్రశ్నలు తర్వాత. అసలు ఎవరైనా ఒక వ్యక్తిను ఒకడు అని అవమానకరంగా రాయడం ఏమి జర్నలిజం?

నిజానికి పోలీసులు సాధారణంగా చేసే ఆరోపణలు తప్పుడువనీ, అబద్ధాలనీ, కూట సృష్టి అనీ, ఉద్దేశపూర్వకమైన కుట్ర, రాజకీయ ప్రేరేపితమనీ, డబ్బు చేతులు మారిన లావాదేవీలనీ వందలాది కేసుల్లో రుజువయ్యాయి. మామూలు కేసుల్లో పోలీసుల అబద్ధాలు అలా ఉంచండి, “తీవ్రవాదులు” అని ఆరోపించి, పత్రికాసమావేశాలు పెట్టి, నానా హంగామా చేసిన డజన్ల కొద్దీ కేసుల్లో కూడ విచారణ క్రమంలో పోలీసుల అబద్ధాలు బైటపడ్డాయి.

ఆ తప్పుడు ఆరోపణల మీద విచారణకు ఐదేళ్లు, పదేళ్లు జైళ్లలో గడిపి చివరికి నిర్దోషులుగా బైటికి వచ్చిన నిరపరాధులున్నారు. ఇటీవలనే తెలుగులోకి వచ్చిన మహమ్మద్ అమీర్ ఖాన్ ‘తీవ్రవాది ముద్ర’ చదవండి. బాంబు పేలుళ్ల తప్పుడు ఆరోపణల మీద విచారణలో పద్నాలుగేళ్లు బెయిల్ కూడ రాకుండా జైళ్లలో గడిపి, జీవితం ధ్వంసమై, చివరికి నిర్దోషిగా విడుదలయ్యాడు. అబ్దుల్ వాహిద్ షేక్ రాసిన ‘ఇన్నొసెంట్ ప్రిజనర్స్’ చదవండి. బొంబాయి పేలుళ్ల కేసుల్లో వందలాది మంది అమాయక ముస్లిం యువకులు ఎన్ని చిత్రహింసలు, ఎన్నెన్ని సంవత్సరాల జైలు నిర్బంధాలు అనుభవించారో చూడండి.

అవన్నీ ఎక్కడెక్కడివో అనుకుంటే ఈ నగరంలోనే 2007లో జరిగిన మక్కామసీదు బాంబు పేలుళ్ల కథ చూడండి. ఆ పేలుళ్లు జరగగానే పోలీసులు అది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థ చేసిన, చేయించిన పని అని పత్రికా సమావేశాల్లో చెప్పి, దాదాపు 200 మంది ముస్లిం యువకులను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి, వారి చేత నేరాలు ఒప్పించి, చార్జిషీట్ కూడ దాఖలు చేశారు. రెండు సంవత్సరాల తర్వాత మరొక కేసులో విచారిస్తుండగా, మక్కా మసీదు బాంబు పేలుళ్లు జరిపింది తామేనని అభినవ భారతి అనే హిందూ తీవ్రవాద సంస్థ నాయకుడు అసీమానంద్ చెప్పాడు.

మక్కా మసీదు పేలుళ్లతో ముస్లిం యువకులకు గాని, ఆ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు గాని ఎటువంటి సంబంధమూ లేదని తేలింది. అభినవ భారత్ మక్కా మసీదు ఒక్కచోటనే కాదు, సంఝౌతా ఎక్స్ ప్రెస్, మాలేగాం, అజ్మేర్ షరీఫ్ లలో కూడ బాంబు పేలుళ్లకు బాధ్యురాలని సిబిఐ దర్యాప్తులో తేలింది. పాత నిందితులను వదిలిపెట్టి, కొత్త నిందితుల మీద కేసు నడిచింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మారిపోయాక, అసీమానంద్ ఒప్పుకోలు ప్రకటనను, ఆ చార్జిషీటును కూడ మసిపూసి మారేడుకాయ చేశారు. చివరికి 2018లో ఈ నిందితుల మీద కూడ కేసు కొట్టేశారు. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.

మక్కా మసీదు బాంబుపేలుళ్లు జరిగీ జరగగానే పోలీసులు అది ముస్లిం తీవ్రవాదుల పనే అని పత్రికాసమావేశం పెట్టినప్పుడు, అప్పటికి నేను ఆంధ్రజ్యోతిలో రాస్తుండిన వారం వారం శీర్షిక ‘కాలం వర్తమానం’ లో “అనుమానం తయారీ” అని రాశాను. నా వాదన సరైందని తర్వాత తేలింది.

ఈ దేశంలో ముస్లింల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద, బహుజనుల మీద, వ్యవస్థా వ్యతిరేకుల మీద ఇటువంటి అనుమానం తయారీని పాలకవర్గాలు ఆనవాయితీగా మార్చేశాయి. అందులోనూ ప్రస్తుత పాలకుల పరివారమే అబద్ధానికీ విద్వేషానికీ కన్నతల్లి గనుక వాళ్లు ఒక నేరం జరగగానే, అసలు నేరం జరగకుండానే కొన్ని ముస్లిం పేర్లూ, కొన్ని వ్యవస్థా వ్యతిరేకుల పేర్లూ, కొన్ని దళితుల పేర్లూ విదల్చడం అలవాటు చేసుకున్నారు.

అది వాళ్లకు సహజమే. కాని వస్తుగత నిష్పాక్షికత, పరిశోధన మీద ఆధారపడిన వాస్తవాల ప్రకటన తన లక్ష్యంగా చెప్పుకునే పత్రికా రంగం కూడ ఆ అనుమానం తయారీలో భాగస్వామి కావచ్చునా? కనీసం దేశంలో అమలులో ఉన్న న్యాయశాస్త్ర సూత్రాలనైనా గమనంలో పెట్టుకోవద్దా?

అవన్నీ పెద్ద విషయాలనుకుంటే కనీసం ఏకవచన, అవమానకర పదాల వాడకం ఎవరిని సంతృప్తి పరచడానికి? మూడు వేల మంది మారణకాండకు కారణమైన వ్యక్తి ఇవాళ ప్రభుత్వ ఉన్నతాధికారంలో ఉన్నారు. ఆయన గురించి అలా రాయగలరా? ఒకరికి ముగ్గురిని హత్య చేయించి, ఆ హత్యను విచారిస్తున్న న్యాయమూర్తిని కూడ హత్య చేయించిన వ్యక్తి శాంతిభద్రతల మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఆయన గురించి అలా రాయగలరా? అసలు ఇవాళ గద్దెల మీద కూచున్నవాళ్లలో ఎన్ని రకాల నేరస్తులున్నారు! ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ల గురించి ఏకవచన, అవమానకర పద ప్రయోగం జరిగిందా?

ఇంకా విచారణే జరగని, అసలు నేరమే జరగని, నేరం చేయబోతున్నారని ఊహించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు అప్పుడే అవమానించదగిన, గౌరవించనక్కరలేని ఏకవచన, అవమానకర పద ప్రయోగానికి అర్హులని పాత్రికేయులుగా మనకు మనమే నిర్ణయిస్తున్నామా?
ఆకాశమునందుండి, శంభుని శిరమందుండి… ఎక్కడికి చేరుతున్నాం మనం?

– ఎన్‌.వేణుగోపాల్‌

Leave a Reply