Suryaa.co.in

Features

నిరతాన్నధాత్రి డొక్కా సీతమ్మ!

-డొక్కాసీతమ్మ ది మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా
-నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కాసీతమ్మ వర్ధంతి 

తూర్పుగోదావరి జిల్లా, లంకలగన్నవరంలో ‘డొక్కా సీతమ్మ’ జోగన్న దంపతులు ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా ఇప్పుడు కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నధాత్రి! వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ అన్నదాన సంకల్పం, దీక్ష ఎంత గోప్పవంటే, కనీసం తన ఇష్టదైవం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళటానికీ కుదిరేది కాదు.

ఈ అన్నదానం పనిలో పడి.. ఆవిడ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే అక్కడకు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న అంతర్వేది శ్రీ స్వామివారి దర్శనానికని పల్లకిలో బైలుదేరారు. గోదావరి వంతెన వద్ద బోయీలు పల్లకి దింపారు. ఆవిడ పల్లకిలోనే కూర్చుని ఉన్నారు. బోయీలు అలసిపోయి గట్టుమీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక పెళ్లిబృందంలో పిల్లలు ఆకలని ఏడుస్తున్నారు.

పెద్దవాళ్ళు “ఒక్కగంటలో గన్నవరం వెళ్లిపోతాం…! సీతమ్మ గారి ఇల్లొస్తుంది. ఆవిడ మనకు అన్నం పెడతారు!” అనే మాటలు ఆవిడ చెవిలో పడ్డాయి. అంతే! వెంటనే ఆవిడ అంతర్వేది దేవుడి దర్శనం ప్రయాణం ఆపేసి “పల్లకీ తిప్పెయ్యండి! వీళ్ళు గన్నవరం వచ్చేసరికి వీరికి అన్నం వండి పెట్టాలి!” అని ఇంటికి తిరిగి వెళ్ళిపోయీ వారికి అన్నం పెట్టి ఆకలి తీర్చారు. అంత గొప్ప నిరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ!

ఆవిధంగా ఆవిడ అందరికీ పెట్టి పెట్టి, చాకిరీ ఎక్కువ కావటంతో ఆరోగ్యం నాశనమై చావువరకూ పరిస్థితి వెళ్ళింది. కానీ భర్త జోగన్న ఆమెకు అనుక్షణం అండగా ఉండి, ఆమె చేసే అన్నదానానికి ఎటువంటి లోటూ లేకుండా వ్యవసాయం చేస్తూ ఆమెకు ప్రత్యక్ష పతిదైవం లాగా జీవితాంతం ఉండటం విశేషం. ఇంకా అనేకానేక కష్టాలు నష్టాలు ఈ అన్నదానం మూలంగా చుట్టుకున్నాయి. ఇదంతా చూస్తూ ఒకదశలో భార్త జోగన్న “ఎందుకు ఇంకా ఈ అన్నదానం? ఈ ఓపిక మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది? ప్రాణాలు పోయే విధంగా ఉందికదా.. ఇకనైనా ఆపేద్దామా?” అన్నారు.

ఐనా కొనసాగించింది.. ఒకసారి కరువు కాటకాలు వచ్చాయి. అన్నదానం ఆగిపోతుంది అనుకున్న క్షణాల్లో ఓ అద్భుతం జరిగింది. ఇన్నాళ్ళనుంచీ దున్నుతున్న తమ లంక పొలంలోనే సీతమ్మ భర్తకు నుయ్యి తవ్వుతుంటే ఒక బిందె బైటపడింది. మూత తీస్తే, దాన్నిండా బంగారు నాణాలే! తెచ్చుకుని మళ్లీ రొజూ అన్నదానం జీవితాంతం కొనసాగించారు. ఈ అన్నదానం విషయం ఆనోటా ఈనోటా బ్రిటిష్ చక్రవర్తి ఐదవ ఎడ్వర్డ్ దృష్టినీ ఆకర్షించింది. సీతమ్మ ఫొటో తమకు పంపాలని తూర్పుగోదావరి జిల్లా కలక్టరుకు ఆదేశించాడు.

తన పట్పట్టాభిషేక వార్షికోత్సవ సభలో తన సింహాసనం సరసనే మరొక ఉన్నతాసనం ఏర్పాటు చేయించి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు వార్షికోత్సవం చేసుకున్నాడు. అనంతరం ఆమె ఫొటో లండన్ గ్యాలరీలో ఆవిష్కరించాడు. ఆ ఫొటో కింద “డొక్కాసీతమ్మ ది మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా!” అని రాయించాడు. ఇప్పటికీ గ్యాలరీలో చూడొచ్చు.. డొక్కాసీతమ్మ జీవితం తెలుగువారందరికీ గర్వకారణం.. దాతృత్వానికి మాతృత్వాని నిదర్శనం. డొక్కాసీతమ్మ గారికి కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ఇవ్వాలనీ కోరుకుందాం! ఆమె వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులు!

మురళి

LEAVE A RESPONSE