Suryaa.co.in

Andhra Pradesh

ఓడినచోటే గెలవాలనే మంగళగిరి నుంచి పోటీ

లోకేష్ సంకల్పానికి స్పందన
లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన ప్రముఖులు

అమరావతి: మంగళగిరిని నెం.1 గా మార్చాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రముఖుల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం నుంచి మాజీ ఎఎంసీ ఛైర్మన్ ముత్తయ్య ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యురాలు కనపాల మేరికుమారి సహా 10 మంది, చినపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లవరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 10 మంది, తాడేపల్లి పట్టణం 18వ వార్డుకు చెందిన కుంభ కిషోర్ ఆధ్వర్యంలో 20 మంది టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తనను మంగళగిరితో పాటు మరో నియోజకవర్గంలో పోటీచేయాలని కొందరు సన్నిహితులు సూచించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో మంగళగిరిలోనే పోటీచేస్తున్నానని చెప్పారు. దేశచరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుడైన జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేశాం.

దళితవాడలు అభివృద్ధి చెందాయంటే టీడీపీనే కారణం. జగన్ పాలనలో దళితులకు సంబంధించిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేదే టిడిపి లక్ష్యం. పార్టీలో కొత్తగా చేరినవారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషిచేయాలని లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబదయ్య పాల్గొన్నారు.

LEAVE A RESPONSE