Suryaa.co.in

Devotional

కర్మలను ఒక యోగంగా చేసే వాడే కర్మయోగి

వేదాలలో కర్మకాండ గురించి కూడా చెప్పబడింది. కాని దాని గురించి ఎవరూ పట్టించుకోరు. స్వర్గసుఖాలకు సంబంధించిన కర్మకాండల గురించే అందరూ చెబుతారు. అదే వేదము అనుకుంటారు.
కర్మలు అందరూ చేస్తారు. కాని కర్మలను ఒక యోగంగా చేసే వాడిని కర్మయోగి అంటారు. వేదములలో కూడా ఈ సత్వ, రజస్, తమో గుణముల గురించి వాటితో చేయబడే కర్మల గురించి చెప్పాయి.
మూడు గుణములతో చేసే కర్మలు అన్నీ ప్రాకృతిక కర్మలు. అంటే ఏవేవో కోరికలు తీరడానికి చేయబడే కర్మలు. ఈ లోకంలో భోగభాగ్యములను, పరలోకంలో స్వర్గసుఖాలను కోరి చేసే కర్మలు. అవే యజ్ఞయాగములు. వాటి గురించి కూడా వేదములలో చెప్పబడ్డాయి.

ఎందుకు చెప్పబడ్డాయి అంటే..
వేదాలు కేవలం మేధావులకు జ్ఞానవంతులకు మాత్రమే చెప్పబడలేదు. సామాన్య మానవుని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది. సామాన్య మానవునికి, ఈ కర్మకు ఈ ఫలం వస్తుంది అని చెబితే కానీ చెయ్యడు. అందుకే స్వర్గ సుఖములు, భోగభాగ్యములు, కోరినకోరికలు తీరడం ఇలాంటి తాయిలాలు ప్రకటించింది. కాని, మానవులు అక్కడే ఆగిపోతున్నారు.
వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేయడం, కోరికలు తీర్చుకోవడం, స్వర్గ సుఖములు అనుభవించడం, మరలా జన్మ ఎత్తడం, జనన మరణ చక్రంలో తిరగడం. దీనితోనే జీవితాలు గడిచిపోతున్నాయి.

మరి కర్మలు ఎలా చేయాలి?? అనే ప్రశ్న వస్తుంది..
అదే కర్మయోగము. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములను, కర్మలను ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి హర్షము, శోకము లేకుండా కర్మలు చేయాలి. ఈ కర్మ ఫలించింది అని సంతోషము ఫలించలేదని దు:ఖము చెందకూడదు. కర్మలను ఒక యోగంగా చేయాలి. ముఖ్యంగా వేదములలో చెప్పబడిన కర్మలను, ప్రాపంచిక కర్మలను అన్నిటిని కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తిలేకుండా చెయ్యాలి. ఏదో ఒక ఫలమును ఆశించి చేయకూడదు. ధనం సంపాదించడం జీవితంలో అవసరమే కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. అలాగే స్త్రీపురుషులు జీవిత భాగస్వాములు అంతే కానీ వారే జీవితం అనుకుంటే తుదకు దుఃఖం మిగులుతుంది. అలాగే..సుఖములు అనుభవించడం జీవితంలో అవసరమే కానీ ఎప్పుడూ సుఖాలు కావాలని కోరుకుంటే తుదకు దుఃఖమే మిగులుతుంది.కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ద్వంద్వములను సహించే ఓర్పు ఉండాలి.

– గూడూరు ఆంజనేయ రాజు

LEAVE A RESPONSE