– రాష్ట్రంలో 60 లక్షల కార్డులకు కేంద్రం బియ్యం సున్నా..
– మావి నాణ్యత ఉన్న సార్టెక్స్ బియ్యం.. మీవి నాన్ సార్టెక్స్ బియ్యం
– అర్థ బంతి భోజనాలు మేం పెట్టం.. 1.46 కోట్ల మందికి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం
– రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలు ఉంటే.. కేవలం 86 లక్షల మందికే కేంద్రం బియ్యం సరఫరా
– ఏపీ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే.. పేదలందరికీ బియ్యం సరఫరా చేయాలి
– ఆ దిశగా ఏపీ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
1- ఆంధ్రప్రదేశ్ ప్రజలపై బీజేపీ నేతలు లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. పేదలకు బియ్యం పంపిణీ గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా ప్రభుత్వం నూటికి నూరు శాతం మందికి అంటే, రాష్ట్రంలో ఉన్న 1.46 కోట్ల మంది పేదలకు నూకలు లేని నాణ్యమైన బియ్యాన్ని ఇస్తుంటే… కేంద్రం కేవలం 86 లక్షల మందికే, అదికూడా నాన్ సార్టెక్స్ బియ్యాన్ని ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. పైగా రాష్ట్రంలోని పేదలందరినీ ఉద్ధరిస్తున్నట్టుగా స్థానిక బీజేపీ నేతలు మాట్లాడటం సమంజసం కాదు. కేంద్రం సరఫరా చేసే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని, అది కూడా కొంతమందికి ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం మావల్ల కాదు.
– ఎందుకంటే, వంద మంది భోజనానికి కూర్చుంటే.. 60 మందికి వడ్డించి.. మిగతా 40 మందికి మానేసే పని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చేయమంటుంది. అది మా వల్ల చేతకాదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా, రాష్ట్రంలోని 1.46 కోట్ల పేద కుటుంబాలకు సార్టెక్స్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, మిగతా సరుకులు ఇస్తున్నాం.
2- పేదలకు ఇచ్చే రేషన్ ను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు నీతి ఆయోగ్ కు లేఖ రాస్తే.. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులన్నీ కరెక్టుగా ఉన్నాయని, వారికి బియ్యం పంపిణీ చేయాలని కేంద్రానికి కూడా సిఫార్సు చేశారు. అయినా కేంద్రం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా.. అర్థాకలితో ప్రజలను ఉంచమని బీజేపీ ఎంపీ జీవీఎల్ చెప్పడం బాధాకరం.
3- దేశంలో ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ లలో కేంద్ర ప్రభుత్వం 75 శాతం మందికి ఇస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 60 శాతం లోపలే పేదలకు బియ్యం ఇస్తున్నారు. పేదలకు ఇచ్చే బియ్యాన్ని కేంద్రం తక్కువగా సరఫరా చేస్తుందని, ఏపీ పట్ల వివక్ష చూపిస్తుందని ప్రజలకు అర్థం కావటం లేదా.. ?
4- ఈ పరిస్థితిని వివరిస్తూ, రాష్ట్రంలోని 1.46 కోట్ల మందికి రేషన్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 16 మే 2022న ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నా స్థానిక బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అందరికీ బియ్యం అందేలా చూడండి. కేంద్రంలో మీ పరపతి ఉపయోగించి, నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆ సిఫార్సులను అమలయ్యేలా చూడండి. ముందుగా ఈ వాస్తవాలను తెలుసుకుని స్థానిక బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, మా బాధ్యతగా పేద ప్రజలందరికీ రేషన్ అందిస్తున్నాం. కేంద్రాన్ని ఒప్పించి, పేదలందరికీ బియ్యం ఇప్పించగలిగితే.. అప్పుడు బీజేపీ నేతలను కూడా అభినందిస్తాం.
5- మీరు చెప్పినట్టు… అర్థ బంతి భోజనాలు పెట్టడానికి మేం సిద్ధంగా లేం.. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బంతి భోజనాలే పెడుతుంది. ఇది మా ప్రభుత్వ విధానం. రాష్ట్రానికి ఎక్కువ బియ్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్నకు జీవీఎలే సమాధానం చెప్పాలి. ఇదే విషయంపై, ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా నేను, పౌర సరఫరాల శాఖ అధికారులు అంతా కలిసి విజ్ఞప్తి చేశాం.
6- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో… చట్టం తన పని తాను చేసుకుపోవాలని దావోస్ పర్యటనలో ఉన్న సీఎం గారు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ తప్పు చేస్తే.. ఏ రకంగా శిక్ష పడాలో న్యాయస్థానాలు తేలుస్తాయి.