ఆంధ్రప్రదేశ్..
ఆనాడు కాంగ్రెస్ చేసింది
రెండు ముక్కలు..
తెలుగోడి గోడు పట్టించుకోక..
శాసనసభ తీర్మానాన్ని లెక్కచేయక..
హైదరాబాద్ ను కోల్పోయి..
భద్రాచలాన్ని వదులుకుని
పడుతూ లేస్తూ
అటు అమరావతిని..
ఇటు ఒంటిమెట్టను ఆశ్రయించి నిలదొక్కుకునే వేళ మరో పిడుగు..
అమ్మతోడు ఏం జరిగిందో జగన్ను అడుగు..
ఆ తర్వాత మూడుముక్కలాట..,!!
రాజధాని మార్పు..
ఇది ఎవరిచ్చిన తీర్పు..
ఎందుకీ ఏమార్పు..
ఎవరికి ఓదార్పు..
అసలు ఎందుకొచ్చిన
ఈ చిత్రమైన కూర్పు..?
ఒక బుర్రలో పుట్టిన ఆలోచన
నమ్మి భూములిచ్చిన
రైతులకు వంచన..
ఇప్పుడు నడిరోడ్డుపై
ఆక్రందన..
వెయ్యి రోజులుగా
అరణ్యరోదన..!?
ఇప్పటికే తయారైన భవనాలు..
ఆకాశ హర్మ్యాలు..
ప్రస్తుత సర్కార్ దృష్టిలో గాలిమేడలు..
ఎప్పటికైనా కూలిపోయే పేకమేడలు..
బాబు హయాంలో జరిగిన అభివృద్ధికి జగన్ వర్గం
పెట్టిన పేరు గ్రాఫిక్స్..
ఇప్పుడు రాజధాని మార్పు బాబు బ్యాచి
భాషలో మాచ్ ఫిక్స్..!
ఎవరికి లాభం..
ఇంకెవరికి నష్టం..
అసలు రాష్ట్రానికి ఎందుకొచ్చిన
ఈ కష్టం..
అమరావతిలో రగులుతున్న రావణకాష్టం..
ఇందులో దాగున్నది రాజకీయమా..
రాజుకున్న కులవివాదమా..
అధికార దర్పమా
కాటేస్తున్న కాలసర్పమా..?లక్ష్యం అభివృద్ధా
స్వయం సమృద్ధా..
సౌకర్యమా.. కైంకర్యమా..
అసలు ఈ మార్పు అనివార్యమా..
ఇప్పటివరకు జరిగిన వ్యయం..
ఇకపై ఏం జరుగుతుందో తెలియని అయోమయం..
తినేసాడంట చంద్రన్న..
నిజమే కావొచ్చు..జగనన్న కాడా ఆచంట మల్లన్న..
దొందూ దొందే..
నిధుల విందే..!
రెండు పార్టీలూ దేనికది
కుక్కమూతి పిందే..
పాలనా వికేంద్రీకరణమట..
మూడు చోట్ల తిరగడానికయ్యే ఖర్చు
ఎవరి బాబుగారి సొమ్మట..
ప్రజల నెత్తిపైనే కదా సమ్మెట..
ఇక టిఎ బిల్లుల మోత
ప్రజలకు పెరిగే
పన్నుల వాత..
జీతాలివ్వడానికే కటకట
మరి బడాబాబుల
ఖద్దరు చొక్కాలు
ఉబ్బిన పొట్టలతో పిటపిట..
ఇంతా చేస్తే ఇదంతా రియల్ ఎస్టేట్ మాయంట..
ఏ నోట విన్నా భూముల
రేట్ల గొలేనంట..
ఇంతకీ ఇదంతా రాజధాని వ్యవహారమా
వ్యాపారమా..
ఒకరికి చెలగాటం..
మరొకరికి ప్రాణసంకటం..
మొత్తానికి అమరావతిలో
భూములిచ్చిన
రైతులే సమిధలు..
ఎక్కడికక్కడ సరికొత్త సమాధులు..
ఇంత ఆందోళన చెవిటోడి ముందు శంఖమా..
గెలిచింది వైశాఖమా..
మరి ఓడింది అమరావతా ?
ధర్మదేవతా!??
కుప్పకూలింది తెలుగుదేశం
మర్యాదా..
ప్రజాస్వామ్య పునాదా..?
సురేష్ కుమార్ ఇ
9948546286