Suryaa.co.in

Editorial

బీజేపీకి కవిత గుడ్‌బై?

– జయసుధ ఎంట్రీనే కారణమా?
– తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి
– ఇప్పటికే కవితతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మంతనాలు
– వైశ్యుల కోటాలో పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని హామీ
– గ్రేటర్‌లోనే ఎక్కువ ప్రచారం చేయాలని సూచన
– వైశ్య నేతలతో రాయబారాలు
– మిర్యాలగూడ ఇన్చార్జిగా కవిత బిజీ బిజీ
– జయసుధకు ప్రాధాన్యంపై అసంతృప్తి?
– సంజయ్‌ హయాంలో కవితకు ప్రాధాన్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీలో చేరిక మాట అటుంచి.. ఉన్న నేతలు వెళ్లిపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా అనర్గళంగా మాట్లాడే ప్రముఖ నటి, బీజేపీ మిర్యాలగూడ కవిత కూడా, సొంత దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వైశ్య వర్గానికి చెందిన కవిత, సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసి.. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ నాయకత్వం సూచనలతో, ఆమె తెలంగాణ బీజేపీకి సేవలందిస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషలపై పూర్తి పట్టున్న కవిత.. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు.

అయితే పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కవితకు, బీజేపీలో సరైన ప్రాధాన్యం లేకుండా పోయింది. గత అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆమెను బాగా ప్రోత్సహించారు. తాజాగా వచ్చిన కిషన్‌రెడ్డి నాయకత్వం ఆమెను పక్కనపెట్టి, కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన జయసుధకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆమెను అసంతృప్తికి గురిచేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. వైశ్యవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న మిర్యాలగూడకు పార్టీ ఇన్చార్జిగా నియమించారు. దానితో ఆమె అక్కడే ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మిర్యాలగూడకు చెందిన వైశ్య ప్రముఖులు ఆమెను కలసి మద్దతు ప్రకటించారు. ఆమె రాకతో అక్కడ బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండిపడే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటివరకూ మిర్యాలగూడలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు.

ఈ నేపథ్యంలో కవితను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన వైశ్య నేతలు సంప్రదించడం ఆసక్తికరంగా మారింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని, మీ గౌరవానికి తగ్గ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రధానంగా రెండు పార్టీలూ, గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆమె సేవలు వినియోగించుకుంటామని చెప్పడం విశేషం. తమ ప్రతిపాదనను కవిత అంగీకరిస్తే, పార్టీ అధినేతల వద్దకు తీసుకువె ళతామని చెప్పినట్లు తెలిసింది.అయితే ఆమె ఇప్పటివరకూ వారికి ఎలాంటి హామీలివ్వలేదని, వారు చెప్పింది మౌనంగా విన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లో నాయకత్వం వద్ద పట్టున్న ప్రముఖ వైశ్యనేతలు చేసిన ఈ ప్రతిపాదనను, కవిత అంగీకరిస్తారో లేదా అన్నది చూడాలి.

LEAVE A RESPONSE