అంటరాని తనాన్ని రూపుమాపాలి… దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని, దళితులను అత్యున్నత స్థాయికి చేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి KCR దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దళిత బంధు క్రింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం క్రింద లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయా రంగాలలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
మొదటి దశలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మందికి దళితబంధును ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మందికి ఈ కార్యక్రమం వర్తింప చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇంతటి సాహసోపేత కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు.
డాక్టర్ B.R అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దళితులు సంఖ్యాపరంగం అత్యధికంగా ఉన్నప్పటికీ, సామాజికంగా ఎంతో వెనుకబడిపోయారని, వారు అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం
అనేక విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే దళిత బంధు క్రింద ప్రతి ఒక్క అర్హులైన దళితులకు దళిత బంధు క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర సాధన ఉద్యమానికి ముందు అనేక ఆరోపణలు, విమర్శలు చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. అదేవిధంగా దళిత బంధు పథకం ప్రారంభ సమయంలో కూడా అనేక విమర్శలు వచ్చాయని పేర్కొన్నారు. లబ్దిదారులు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.