– మంగళగిరి రోడ్డులో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం
– అప్పట్లో పార్ట ఆఫీసు శంకుస్థాపనకు కేసీఆర్ వస్తారని ప్రచారం
– బిజీగా ఉండటంతో రాలేకపోయారన్న ఆంధ్రా బీఆర్‌ఎస్ నేతలు
– పార్టీ ఆఫీసు ప్రారంభానికి వస్తారని మరో ప్రచారం
– దానికీ డుమ్మా కొట్టనున్న కేసీఆర్
– కేసీఆర్ లేకుండానే ‘తోట’తో ప్రారంభోత్సవం
– మరి కేసీఆర్ ఇప్పట్లో ఆంధ్రా వెళ్లరా?
-కర్నాటక ప్రచారానికీ వెళ్లని కేసీఆర్
– కర్నాటక ప్రచార సమయంలో మహారాష్ట్ర కార్యక్రమాలపై దృష్టి
– రేపు ఆంధ్రా ఎన్నికల్లోనూ అంతేనా?
– ఆంధ్రా బీఆర్‌ఎస్‌లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ఆంధ్రాలో కూడా బీఆర్‌ఎస్ విస్తరిస్తుంది. మేం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్ బిడ్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్గొని, కార్మికుల ప్రయోజనాలు రక్షిస్తుంది. విశాఖ ప్రజలు కేసీఆర్‌ను తీసుకురావాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఆంధ్రా ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్‌ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి’’.. ఇదీ ఏపీ బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి కూడా.. ఆంధ్రా ప్రజలు కేసీఆర్ తరహా పాలనే కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రధానంగా విశాఖ స్టీల్ బిడ్ల సందర్భంగా , ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇచ్చిన బిల్డప్పులు చూస్తే.. అసలు విశాఖ స్టీల్‌నే బీఆర్‌ఎస్ సర్కారు కొనేసి, ప్రైవేటీకరణను అడ్డుకున్నదన్నంత హడావిడి చేసినట్లు కనిపించింది. స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులతో కలసి బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్-కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం కూడా చేయించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు నిరసనగా, బీఆర్‌ఎస్ చేసిన ఆందోళనకూ బోలెడంత పబ్లిసిటీ ఇచ్చారు. చివరాఖరకు అసలు విశాఖ స్టీల్‌కు బిడ్డింగ్ వేయకుండానే బీఆర్‌ఎస్ సర్కారు ముఖం చాటేసింది.
ఇప్పుడు గుంటూరు మంగళగిరిరోడ్డులో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఆ మేరకు అన్ని హంగులూ ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని మొదట చాలా హడివిడి చేశారు. ఆయన కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని, గుంటూరులో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ సమక్షంలో కొందరు రాజకీయ ప్రముఖులు, బీఆర్‌ఎస్‌లో చేరేలా ఏర్పాట్లు జరిగాయన్న ప్రచారమూ కొద్దిరోజులు వినిపించింది.
అయితే .. చివరాఖరకు బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ ఆఫీసును..ఆదివారం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభిస్తారన్న సమాచారం, పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియా గ్రూపులకు వచ్చింది. దీనితో ఇక ఇప్పట్లో కేసీఆర్ ఆంధ్రా వెళ్లే అవకాశమే లేదని స్పష్టమయింది. కేవలం కేసఆర్ పర్యటనను ఆంధ్రా నేతలు భూతద్దంలో చూపించి, ఎక్కువ ప్రచారం చేస్తున్నారన్న విషయం ఆయన గైర్హాజరీతో తేలిపోయింది.
ఏపీలో కూడా బీఆర్‌ఎస్ ఆఫీసు ప్రారంభిస్తున్నారని ప్రకటించిన తర్వాత, కొన్ని మీడియా వర్గాలు అప్పుడే అత్యుత్సాహం చూపాయి. కేసీఆర్ ఏపీలో పర్యటిస్తారని కొందరు, ఉత్తరాంధ్రలో బీసీ వెలమ కులాల సంఖ్య అధికంగా ఉన్నందున, ఎక్కువగా ఉత్తరాంధ్రపైనే దృష్టి సారిస్తారన్న ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి , వైసీపీకి లబ్థి చేకూరుస్తుందన్నంత ఉధృతమైన ప్రచారం జరిగింది. చివరకు ఆంధ్రాలో ఒక దినపత్రిక కూడా ప్రారంభిస్తున్నారన్న లీకు వార్తలు కూడా వెలువడ్డాయి.
అయితే.. విశాఖ స్టీల్ బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కారు ముఖం చాటేయడంతో, బీఆర్‌ఎస్ వర్గాలు ఆ తర్వాత ఇప్పటివరకూ భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించలేదు. మళ్లీ తర్వాత గుంటూరులోని పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చివరకు దానికీ కేసీఆర్ రావడం లేదని ఖరారు కావడంతో, ఏపీ బీఆర్‌ఎస్ కేవలం కేసీఆర్ ఇమేజ్‌ను వాడుకుని, కాలం దొర్లిస్తోందన్న విమర్శలు నిజం చేసినట్టయింది.
నిజానికి పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు కేసీఆర్ లేదా కొందరు మంత్రులు వస్తారని ప్రచారం చేసిన ఏపీ బీఆర్‌ఎస్ వర్గాలు, ఆ తర్వాత మాట మార్చాయి. కేసీఆర్ బిజీగా ఉండటంతో రాలేకపోయారని, పార్టీ ఆఫీసును మాత్రం ఆయనే ప్రారంభిస్తారని ప్రచారం చేశారు. చివరకు రెండింటికీ కేసీఆర్ డుమ్మా కొట్టడం విశేషం.
ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లోనూ, బీఆర్‌ఎస్-జనతాదళ్ అభ్యర్ధులు పొత్తులో భాగంగా పోటీ చేస్తారన్న ప్రచారం మీడియా వర్గాల్లో చేశారు. ఆ మేరకు అన్ని రాష్ర్టాల్లో పోటీ చేసి, బీఆర్‌ఎస్ సత్తా చాటతామని ఆ పార్టీ నేతలు గంభీరమైన ప్రకటనలు చేశారు. తెలుగువారున్న నియోజకవర్గాల్లో జనతాదళ్‌తో కలసి, బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందన్న ప్రచారం జరిగింది. తీరా నామినేషన్ల చివరిరోజున కూడా బీఆర్‌ఎస్ అభ్యర్ధులు పత్తా లేకుండా పోయారు. తెలంగాణ నిఘా వర్గాలు కూడా కర్నాటకలో తిష్ట వేసి, అభ్యర్ధులపై అన్వేషణ మొదలుపెట్టారన్న ప్రచారం కూడా ఉధృతంగానే జరిగింది.
ఆ తర్వాత.. ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ తప్పకుండా హాజరవుతారని, మంత్రులు-ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారన్న లీకు వార్తలు వెలడ్డాయి. చివరాఖరకు ప్రచార ముగింపు తేదీ వరకూ, కేసీఆర్ సహా నేతలెవరూ కనిపించలేదు. దానితో ‘కర్నాటక ఎన్నికల్లో ప్రచారాన్ని’.. కేవలం ప్రచారానికే వాడుకున్నారన్న విషయం తేలింది.
విచిత్రంగా కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంటే.. కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడంపై, సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. ‘‘రేపు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఆంధ్రాలో విస్తరణపై దృష్టి పెడతారేమోరనంటూ’’ బీఆర్‌ఎస్ విమర్శలకులు, సోషల్‌మీడియాలో చేతికి పనిచెప్పారు. దీన్నిబట్టి.. ఇప్పట్లో కేసీఆర్ ఆంధ్రాపై దృష్టి పెట్డడం అసంభవమని, కర్నాటక ఫలితాల తర్వాత.. ముందు ఇల్లు చక్కబెట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారన్నది బీఆర్‌ఎస్ నేతల ఉవాచ.