అడుగుపెడితే ఆరు ముక్క‌లు అయిత‌వ్

– మిమ్మ‌ల్ని వ‌ద‌లం, వేటాడుతాం
– వంద ఎక‌రాల్లో నేను, నా కొడుకు బాజ‌ప్తాగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నాం
– బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా?
– బీజేపీ, బండి సంజయ్‌పై కేసీఆర్ ఫైర్

బీజేపీ, తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్‌పై.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల దాడి కొనసాగుతోంది. నిన్న కమలాన్ని కడిగిపారేసిన కేసీఆర్ రెండో రోజు కూడా, తన మాటల దాడి పదునుపెంచి మరింత ఎదురుదాడి చేశారు. ఈసారి సంజయ్‌కు మరింత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కేంద్రంతో యుద్ధమేనని తేల్చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ వివరాలివి.
బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ‘‘నా ఫామ్ హౌజ్ వ‌ద్ద అడుగుపెడితే ఆరు ముక్క‌లు అయిత‌వ్. అది గెస్ట్ హౌజ్ కాదు.. అది ఫార్మ‌ర్ హౌజ్.. అన్ని లంగ మాట‌లు మాట్లాడుతావ్. ఈ రాష్ట్రం కోసం క‌ట్టిన ప్రాజెక్టుల్లో మా అత్త‌గారి పొలం, మా పొలంతో పాటు ఊర్ల‌న్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బ‌త‌కం. అందుకే మేం దేనికి భ‌య‌ప‌డం. నా హ‌ద్దుల‌ను నిర్ణ‌యించ‌డానికి నీవు ఎవ‌రు? తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. ఇప్ప‌టికైనా మా ప్రాణం పోయే వ‌ర‌కు తెలంగాణ కోసం, రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజ‌మ్మ ఎవ‌రున్నా వ‌దిలిపెట్టం. ఈ దేశ ఖ‌జానాలో మా వాటా ఉంది. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు. మిమ్మ‌ల్ని వ‌ద‌లం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వ‌ర‌కు పోరాడుతాం. మీరు వ‌డ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వ‌ద్దా? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్ర‌జలు కేసీఆర్‌ను న‌మ్ముతున్నారు. మీరు డిపాజిట్లు కోల్పోయారు’’ అని గుర్తు చేశారు.ఎన్నికలల్లో గెలిపిస్తే సేవలందిస్తం.. లేకపోతే విపక్షంలో కూర్చుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సహజమన్నారు. గెలిచామన్న గర్వం, అహంభావం ఉండకూడదని హితవు పలికారు.
దిక్కు మాలిన పాద‌యాత్ర చేసుకుంటూ.. కేసీఆర్ నీ ఫామ్ హౌజ్‌కు వ‌చ్చి దున్నుతా అంట‌డు. ఏం దున్నుతావ్.. నీవు ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా? నా ఫామ్ హౌజ్ దాసిపెట్టేందుకు అదేమైనా అగ్గిపెట్టేనా? వంద ఎక‌రాల్లో నేను, నా కొడుకు బాజ‌ప్తాగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నాం.
మాకేం మ‌నీలాండ‌రింగ్‌లు, బొండ‌రింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. నాకేం లేవు. మీరు మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు. అది కూడా చెప్తున్నా.. జ్ఞాప‌కం పెట్టుకో. ఏమంటే ఏం చేయ‌లేరు. నిటారుగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవ‌రితోనైనా పోరాడుతాం. ఎవ‌రికీ భ‌య‌ప‌డం. ఇంకోమాట కూడా హెచ్చ‌రిస్తున్నా. పిడుగు, పెళ్లికి, చావుకు అదే మంత్రం అంటే న‌డ్వ‌దు. అన‌వ‌స‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తే బూమ‌ర్ హ్యాంగ్ అయిత‌ది. నేను సూట్ కేసులు ఇచ్చినాను? ఈ దేశంలో డ‌బ్బులు ఎక్కువ ఖ‌ర్చు పెట్టే పార్టీ బీజేపీనే అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులు కాదు. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా మేము దేశద్రోహులు కాదు. కానీ ఇప్పుడు దేశద్రోహులయం అయ్యాము. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు. అంటే బీజేపీ ఈ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా? ఇది బీజేపీ స్టయిల్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని నిలదీసినా వాళ్లు దేశద్రోహులు అయిపోతారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుంది. ఒకటి దేశద్రోహులు. రెండు అర్బన్ నక్సల్స్. ఇంకా గట్టిగా మట్లాడితే అర్బన్ నక్సల్స్ స్టాంప్ వేస్తారు.’’అన్నారు.
రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు సీడ్‌ కంపెనీలతో టై అప్‌ ఉంటే వరి పంట వేయొచ్చన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డోలాయమాన స్థితిని సృష్టిస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. కేంద్రాన్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నారు. రైతులు వేరే పంటలను పండించుకోవాలని సూచించారు. కేంద్రమే ధాన్యాన్ని కొనాలని కోరుతూ వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.ఎలాగైనా అమ్ముడు పోతుందని వరి పంట వేయవద్దని కేసీఆర్‌ పేర్కొన్నారు.
ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త వినిపించారు. త్వ‌రలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మి నిరుద్యోగులు మోస‌పోవ‌ద్దు. నిరుద్యోగుల‌కు నేను చెప్తున్నా.. మంచి ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఉద్యోగ నియామ‌కాలకు క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా నిబంధ‌న‌లు రూపొందించాం. నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మేలు చేస్తోంది.
జోన‌ల్ విధానం ప్ర‌కారం ఉద్యోగుల‌ను స‌ర్దుతున్నాం. ఒక‌ట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తాం. న‌వంబ‌ర్‌లో ఉద్యోగుల స‌ర్దుబాటు ప‌క్రియ పూర్తి చేసి.. 60 నుంచి 70 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్లు ఇస్తాం. ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం. పార‌ద‌ర్శ‌కంగా ఉద్యోగ నియామ‌కాలు జ‌రుపుతాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. బండి సంజ‌య్ ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నాడు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కం య‌ధాత‌థంగా అమ‌లు అవుతోంది అని స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధు ప‌థ‌కం హుజూరాబాద్‌లో సంపూర్ణంగా అమ‌లై తీరుతోంది. ద‌ళిత బంధు ప‌థ‌కంపై క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌లో ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 2 వేల కోట్లు విడుద‌ల చేశాం. ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించి, శిక్ష‌ణ ఇస్తున్నాం. ద‌ళితుల‌కు అన్నింట్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్నాం.
తెలంగాణ ద‌ళిత జాతిని అభివృద్ధి చేసే బాధ్య‌త నాదే. హుజూరాబాద్‌లో ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి ఈ ప‌థ‌కం అమ‌లు చేసి తీరుతాం. మిగ‌తా నాలుగు మండ‌లాల్లో కూడా నేనే స్వ‌యంగా వెళ్లి.. 100 కుటుంబాల చొప్పున అమ‌లు చేస్తాం. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గానికి 100 కుటుంబాల చొప్పున ద‌ళిత బంధు అమ‌లు చేస్తాం. ఈ ప్ర‌క్రియ మార్చి లోపు అమ‌ల‌వుతోంది. వ‌చ్చే మార్చి లోపు 20 ల‌క్ష‌ల కుటుంబాల‌కు అమ‌లు చేస్తాం. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డే కొద్ది అన్ని కుటుంబాల‌కు వ‌ర్తిస్తాం. తెలంగాణ ద‌ళిత‌జాతి అభివృద్ధి ఏడాది, రెండేండ్లో చేసి చూపిస్తాం అని స్ప‌ష్టం చేశారు.
‘తెలంగాణ రాష్ట్ర సాధన జరిగినప్పుడే మేం ప్రకటించాం. ఇప్పటి వరకూ ప్రజాస్వామికంగా పోరాడేందుకు ఉద్యమపార్టీగా, రాజకీయపార్టీగా ఉన్నాం. ఇకనుంచి రాజకీయ చాణక్యం చూపిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటాం’ అని అప్పుడే స్పష్టంగా ప్రకటించానని వెల్లడించారు.
తాము రాజకీయ పార్టీగా ఉంటామని బహిరంగంగానే ప్రకటించానని, అంతేకానీ సీక్రెట్‌గా చీకట్లో చెప్పలేదని అన్నారు. అభిప్రాయాలు, ఆలోచనలు నచ్చిన వారు ఇతర పార్టీల నుంచి వచ్చి తమ పార్టీలో చేరతామంటే చేర్చుకుంటామని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు.
అలా వచ్చిన వారు సీనియర్లు అయితే రాష్ట్రం కోసం వారి అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు మంత్రి పదవులు ఇచ్చినా తప్పు లేదు కదా? అని అన్నారు. అలా చేయడమే తప్పని బీజేపీ భావిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలో ఎలా చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమీటి సభ్యుడిగా ఉన్న సింధియాను కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకోలేదా? అని నిలదీశారు. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనే చందంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేశాం. ప్రభుత్వ శాఖలన్నింటినీ రీఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం. మేం తెచ్చిన జోనల్‌ చట్టానికి మేమే వ్యతిరేకంగా పోలేం కదా. ఉన్న ఉద్యోగులంతా ఎక్కడి వారు అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత జిల్లాల వారీగా ఏ జిల్లా వారికి అక్కడే ఖాళీలు దొరుకుతాయి’ అని తెలియజేశారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల యువకులకు ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశ్యంతోనే పరిపాలనా సంస్కరణలు, జోనల్‌ వ్యవస్థలు తెచ్చామన్నారు. ఉద్యోగుల అడ్జస్ట్‌మెంట్ పూర్తయితే ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుందని, ఇటీవల తాము వేసిన అంచనా ప్రకారం 60-70 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
‘ఉద్యోగాల విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పా. చేయగలిగిందే చెప్తాం తప్ప గోల్‌మాల్‌ మాటలు మేం చెప్పం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని, ఏటా కోటి ఉద్యోగాలు నాశనం చేస్తూ వచ్చిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉంది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply