-దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు
-బలగం సినిమా సింగర్లు మొగిలయ్య, కొమురమ్మలకు దళిత బంధు కారు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-సిఎం కెసిఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మొగిలయ్య, కొమురమ్మ
హైదరాబాద్, మే 17ః దళితులకు అండగా కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే బలగం సినిమాలో పాటలు పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బలగం సినిమాలో తమ పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున దళిత బంధు పథకం కింద రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సుంకె రవిశంకర్, జోగినపల్లి శ్రీనివాసరావు, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరిల సమక్షంలో మంత్రుల నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కారును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులందరు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. మూడేళ్ళల్లో దళితులందరికీ దళిత బంధు ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సిఎం కెసిఆర్ మనసున్న మహారాజు. అందుకే అందరి క్షేమం కోసం ఆలోచిస్తూ, పరిపాలన సాగిస్తున్నారని, దళితులంతా ఆయనకు అండగా నిలవాలని మంత్రి కోరారు. బలగం సినిమాలో అద్భుతంగా పాట పాడి అందరినీ ఆకట్టుకున్న మొగిలయ్య, కొమురమ్మలకు సిఎం కెసిఆర్ అండగా నిలిచారన్నారు.
మొగిలయ్య ఆరోగ్యం బాగు కోసం నిమ్స్ లో చేర్పించి వైద్యం చేయిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మానవత్వమున్న ప్రభుత్వమని మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బేడ బుడగ జంగాల జెఎసి చైర్మన్ టి.జగదీశ్వర్, వైస్ చైర్మన్ చింతల యాదగిరిలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే బేడ బుడగ జంగాల ప్రతినిధిగా చింతల యాదగిరికి తగిన పదవి ఇచ్చి, గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల జెఎసి నేతలు చింతల దశరథ, విభూది నర్సింహులు, తిరుపాటి రామదాసు, పర్వత మధు, గోపాల్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.