Suryaa.co.in

Telangana

లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్

-పెట్రోల్, డీజిల్ పై పన్ను పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటోంది టీఆర్ఎస్సే
-ప్రజలపై ప్రేమ ఉంటే రూ.41 మినహాయించుకుని రూ.60 కే లీటర్ పెట్రోల్ అందించాలని సవాల్
-కేంద్రం నిధులను దారి మళ్లించి హుజూరాబాద్ లో ఓటుకు రూ.20 వేలతో కొనుగోలు చేసే కుట్ర
-టీఆర్ఎస్ పంచే డబ్బులతో ఆ పార్టీ నేతలు కొత్త కార్లు కొంటున్నారు
-ఒక్కో ఎకరానికి యూరియా, డీఏపీపై దాదాపు రూ.6 వేలు సబ్సిడీ ఇస్తోంది కేంద్రమే
-ఫ్రీగా యూరియా ఇస్తానన్న కేసీఆర్ మాటలేమైనయ్?
-దళిత బంధు పై హుజూరాబాద్ నుండే యుద్దం ప్రకటిస్తున్నాం
-బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచైనా దళితులందరికీ దళితబంధు అందిస్తాం
కమలాపూర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్య
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పన్నుల పేరు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నుండి రూ.వేల కోట్లు దోచుకుంటోందని దుయ్యబట్టారు. వాస్తవానికి ఒక్కో లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోందని చెప్పారు. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే…ఆ పన్ను మొత్తాన్ని మినహాయించుకుంటే 60 రూపాయలకే లీటర్ పెట్రోలు అందించవచ్చని సవాల్ విసిరారు. రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుధ్ది, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తోందని మండిపడ్డారు.
ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్దమయ్యారని పేర్కొన్న బండి సంజయ్ కుమార్ ఆ సొమ్ములో రూ.15 వేలు టీఆర్ఎస్ నేతలు కొట్టేసి ఓటర్లకు రూ.5 వేలు మాత్రమే ఇస్తూ….మిగిలిన సొమ్ముతో కొత్త కార్లు కొంటున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కమలాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ టీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్, జాతీయ ఎస్సీ మోర్చా విభాగం కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు రావు పద్మ, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప పాయల శంకర్, అశోక్ రెడ్డి, సదానందం గౌడ్, పల్లె వెంకట్, తిరుపతయ్య, మహేందర్ రెడ్ తదితరులు హాజరైన ఈ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.20 వేలు ఇస్తుండ్రట. వచ్చినాయా? (ఇంకా రాలేదంటూ ప్రజల నుండి నినాదాలు). టీఆర్ఎసోళ్లు పంచడం మొదలు పెట్టిండ్రు. దొంగ నోట్లు ఉంటాయోమో లెక్కపెట్టుకోండి. ఓ కార్ల కంపెనీయన కలిసిండు. టీఆర్ఎసోళ్లు కొత్త కార్లకు అడ్వాన్సులు ఇచ్చిండ్రట. ఓటుకు రూ.20 వేలు ఇస్తుంటే…వాళ్లు అందులో రూ.15 వేలు దొబ్బి ఓటర్ కు రూ.5 వేలే ఇస్తారట. మిగిలిన సొమ్ముతో కార్లు కొంటానికి అడ్వాన్స్ ఇస్తుండ్రట. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రేనేజీ, మరుగుదొడ్లు, స్మశాన వాటికల నిర్మాణం సహా అభివ్రుద్ది, సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఖర్చు పెడుతున్నరు.
పువ్వు గుర్తు వాళ్లు ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తుంటే….కనీసం నరేంద్రమోడీ ప్రస్తావించిన సిగ్గులేని నేతలు టీఆర్ఎసోళ్లు. హుజూరాబాధ్ ప్రజలందరికీ టీఆర్ఎస్ సంగతి అర్ధమైంది. ఒకవైపు రాష్ట్రంలో అల్లాడుతున్నరు రాష్ట్రంలో….ఈ మూర్ఖుడి పాలనతో ఆగమైపోతున్నరు. వాళ్లంతా హుజూరాబాధ్ ప్రజలకు చేతులు జోడించి మొక్కుతున్నరు….టీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం కావాలని, పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నరు. 30న జరిగే పోలింగ్ లో పువ్వు గుర్తుకు అందరూ ఓటేసి టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలి. కేసీఆర్ మైండ్ షాక్ కావాలి…
వచ్చేనెల 2న ‘ట్రిపుల్ ఆర్ సినిమా’ను ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ వేసి కేసీఆర్ కు చూపిస్తాం. అందులో ఒక ఆర్.. రాజాసింగ్…, ధర్మం, హిందూ ధర్మం కోసం యుద్దం చేస్తుండు. ప్రతిరోజు కోర్టుకు వెళుతుండు. రెండో ఆర్ రఘు నందన్….ఇక గెలవబోయే మూడో వ్యక్తి రాజేందర్…ఈ ముగ్గురితో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపించబోతున్నం. ఈ సినిమా చూపించాలంటే…ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి.
దేశంలో 100 కోట్ల డోసులను ఉచితంగా వేయించిన ఘనత నరేంద్రమోదీదే. వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వకపోతే పేదల పరిస్థితి ఏమిటో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తికి మనమంతా చప్పట్లతో క్రుతజ్ఝతలు చెబుదాం (అందరూ చప్పట్లతో హర్షం) కరోనా టైంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత లేక ఆస్తులు అమ్ముకున్ను. పుస్తెలతాడు అమ్ముకున్నరు. అయినా కేసీఆర్ ఏనాడూ బయటకు రాలేదు. వారిని ఆదుకున్న పాపాన పోలేదు. కానీ కరోనా లాక్ డౌన్ లో ప్రజల వద్దకు వచ్చిన వాళ్లు బీజేపీ నాయకులు మాత్రమే. మాస్కులు, శానిటైజర్లు, మందులతోసహా ప్రజలకు పంపిణీ చేస్తూ సేవ చేసే క్రమంలో 8 మంది కార్యకర్తలు మరణించారు. కరోనా సమయంలో తన కుటుంబ సభ్యులకంటే ప్రజలే ముఖ్యమంటూ రాత్రింబవళ్లు తిరుగుతూ పేదలకు భరోసా కల్పించిన నేత ఈటల రాజేందర్. సీఎం పోయి ఇంట్లో పండుకుంటే…వైద్య మంత్రిగా పేదలను కాపాడటమే లక్ష్యంగా ప్రాణాలను తెగించి అర్ధరాత్రి వరకు పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు దండుపాళ్యం బ్యాచ్ లా తిరుగుతున్నయ్. వాళ్లంతా టీఆర్ఎస్ నేతలే. ఈనెల 27 తరువాత ఎవరూ ఉండరు. మీకు నిరంతరం అండగా ఉండేది…సేవ చేసేది ఈటల రాజేందర్ మాత్రమే. బండి సంజయ్ మీటింగ్ కు 20 మంది కూడా రావడం లేదని కేసీఆర్ చెబుతుండు. బహుశా సోయి లేకుండా ఉన్నట్లున్నరు. సభకు వస్తున్న జనం ఎంతమంది ఉన్నరో చూస్తే తెలుస్తుంది.
దొంగ సర్వేలతో కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు. టీఆర్ఎస్ గెలుస్తుందంటూ….తన మనషులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నరు. హుజూరాబాద్ ప్రజల్లో నిజాయితీ ఉంది. ఉద్యమ స్పూర్తి ఉంది.
రైతు బంధు ఇచ్చి అన్నీ బంద్ చేసిన ఘనుడు కేసీఆర్. కేంద్రం ఎరువుల సబ్సిడీ కోసం రూ.79 వేల కోట్లు రైతుల కోసం చెల్లిస్తున్నరు. యూరియా అసలు ధర 1170 అయితే…సబ్సిడీపై 270 మాత్రమే. మిగిలిన రూ.900 లు కేంద్రమే భరిస్తోంది. ఒక్క ఎకరానికి రెండు బస్తాల యూరియా కొంటే…రూ.1800 లు మోదీ గారు కడుతున్నరు. ఇదిగాకుండా డీఏపీ బస్తా రూ. 2450లు ఉంటే…రూ.1200ల సబ్సిడీ మోడీ ప్రభుత్వం ఇస్తోంది. రైతు కట్టేది రూ.1250 మాత్రమే. ఈ లెక్కన ఒక్క ఎకరానికి మోదీ ప్రభుత్వం సుమారు రూ.6 వేలు సబ్సిడీ భరిస్తోంది. కానీ కేసీఆర్ చేస్తుందేమిటి?
ప్రగతి భవన్ లో రైతులతో మీటింగ్ పెట్టి యూరియా ఫ్రీగా ఇస్తామని ప్రగల్భాలు పలుకుతుండు. కానీ ఇంతవరకు ఫ్రీ ఇచ్చిన పాపానపోలేదు. పనిముట్ల సబ్సిడీ ధర కేంద్రం చెల్లిస్తున్నా…కేసీఆర్ ఇవ్వడం లేదు. దుబ్బాక ఎన్నికల సమయంలో సన్న వడ్లు వద్దు..దొడ్డు వడ్లు వేయాలంటడు. మరోసారి పత్తి వద్దంటుడు. మరోసారి వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరిస్తున్నడు. తన పొలంలో ఏ పంట పండించాలో రైతు ఇష్టం. రైతులు ఏ పంట పండిస్తే ఈ పంట కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నా…..ఆ పనిచేయకుండా రైతులను బెదిరిస్తున్నడు.
రైతుల వడ్లు మాత్రమే అమ్మేది. బియ్యం అమ్మేది మిల్లర్లు మాత్రమే. కానీ కేసీఆర్ మాత్రం కమీషన్ల కోసం బ్రోకర్ గా వ్యవహరిస్తూ రైతులను బెదిరిస్తున్నడు. భూసార పరీక్షల కోసం కేంద్రం రూ.120 కోట్లు ఇస్తే…ఆ డబ్బును దారి మళ్లించి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నరు. రాష్ట్రానికి 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే….ఒక్క ఇల్లు కట్టకుండా ఆ డబ్బును దారి మళ్లించి కేంద్రాన్ని అప్రదిష్టపాల్జేస్తున్నరు.
తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్, ఇషాంత్ రెడ్డి వంటి 1400 మంది యువత ప్రత్యేక రాష్ట్రం వస్తే పేదల బతుకులు బాగుపడతాయని బలిదానం చేస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నరు. తెలంగాణ కోసం కేసీఆర్…ఆయన కుటుంబం చేసిన త్యాగాలేమున్నయ్. అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీష్ రావు చేసిన త్యాగమేంది? కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ బందీ అయ్యింది.
ఈటల రాజేందర్ చేసిన తప్పేమిటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? దళితులకు మూడెకరాలు ఎందుకు ఇవ్వడం లేదు? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టడం లేదు? అంటూ పేదల తరపున కొట్లాడితే పార్టీ నుండి బయటకు పంపిన మూర్ఖుడు కేసీఆర్…దళిత బంధు ఈటల రాజేందర్ వల్లే ఆగిందంటూ…ఇప్పుడు టీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నరు. దళిత బంధు పేరిట ఇచ్చిన చెక్కులేవీ పనిచేయడం లేదు. అకౌంట్లో వేసిన డబ్బులను ఫ్రీజ్ చేసిండ్రు. నేను ఈ విషయాన్ని ముందే చెప్పిన.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నా పేరు మీద దొంగ లేఖ స్రుష్టించి వరద సాయం ఆపితే నేను సవాల్ చేసిన. కేసీఆర్ చేసి తోక ముడిచిండు.ఇక్కడ కూడా దళిత బంధు విషయంలో అదే కుట్ర చేస్తుండు. యాదాద్రిలో ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ విసిరితే తోక ముడిచిండు…దళితులను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారు. ఇక మోసాలు భరించే స్థితిలో దళితులు లేరు…..కేసీఆర్ కు తగిన గుణ పాఠం చెప్పడం ఖాయం.
ఎన్నికలై పోంగనే కోర్టులో కేసు వేయించి దళిత బంధును పూర్తిగా ఆపేయించే కుట్ర కేసీఆర్ చేస్తుండు. ఈటల రాజేందర్ ను గెలిపిస్తే దళిత బంధు కోసం కేసీఆర్ మెడలు వంచుతాం. బీజేపీ పార్టీ ప్రగతి భవన్ బద్దలు కొట్టి దళిత బంధు వచ్చేలా పోరాడతాం. దళిత బంధుపై హుజూరాబాద్ నుండే యుద్దం ప్రారంభిస్తున్నం. దళిత బంధు డబ్బులు లబ్దిదారులకు అందేలా కేసీఆర్ మెడలు వంచుతాం.
పెట్రోలు ధరల పెంచడంపై స్పందిస్తూ……‘ కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్ (ఎమ్మెస్సార్ మాటలను ప్రస్తావించారు). ఒక్క లీటర్ పెట్రోల్ కు రూ.41 లు కేసీఆర్ దొబ్బుతున్నడు. కానీ కేంద్రం మీద విమర్శలు చేస్తుండు. కేసీఆర్…నీకు ప్రజలపై చిత్తశుద్ది ఉంటే….41లు మినహాయిస్తే….ప్రజలకు లీటర్ కు రూ.60 లకే అందుతుంది. కానీ ఆ పనిచేయకుండా లీటర్ కు రూ.41 చొప్పున వేల కోట్లు దోచుకుంటూ…నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తూ సిగ్గులేకుండా బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నరు. దయచేసి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న. టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం.

LEAVE A RESPONSE