– బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టే
– 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని కేసీఆర్ సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..?
– చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయండి
– కేటీఆర్ కు గళం లేదు.. బలం లేదు.. దళం లేదు
– బీజేపీ మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు
హైదరాబాద్: కృష్టా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని, ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోలేదని బీజేపీ మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోడం ఖాయమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులను, కార్యకర్తలను ఏనాడైనా గౌరవిస్తే.. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ హితవు పలికారు. పార్లమెంటు ఎన్నికల్లో వందలకోట్లు సమర్పించుకున్న వారికే టిక్కెట్లు అమ్ముకుంటారని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్.. ఎంపీలుగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టేనని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డి , రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడిన ముఖ్యాంశాలు :
కేఆర్‌ఎంబీకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదని బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు మాట్లాడిండు. 2014-2019 మధ్య కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన కృష్ణానదీ జలాల పంపకాలపై జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..? హరీశ్ రావు సమాధానం చెప్పాలి. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు ఈ విషయాలు తెలియవా..?
ఎన్నికలు వస్తేనే బీజేపీని బద్నాం చేసేందుకు ప్రచారం మొదలుపెడుతరు. దుబ్బాకలో ఉప ఎన్నికలు రాగానే మోటార్లకు మీటర్లు అంటూ బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ మొదలుపెట్టారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ అసత్యాలు ప్రచారం చేశారు. తెలంగాణలో బీజేపీ లేదు అనేవారికి దుబ్బాక ఉపఎన్నికల్లో సత్తా చూపించాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవదు.
చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయండి. ఒక్కసీటు కూడా గెలవలేరు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ పోటీ చేసినా.. ఒక్కరు కూడా ఎంపీగా గెలవరు. తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టక తప్పదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక మెజారిటీ సీట్లు గెలచుకోవడం తథ్యం. ఇది నా సవాల్.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారికి బీఆర్ఎస్ లో టిక్కెట్లివ్వరు.. సూట్ కేసులు, వందల కోట్లు ఇచ్చినవారికి సీట్లు ఇచ్చే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వందల కోట్లు ఇచ్చినవారికే బీఆర్ఎస్ లోకసభ సీట్లు. మెదక్ పార్లమెంటులో 1998లోనే బీజేపీ గెలిచింది. ఇది హరీశ్ రావు గుర్తెరగాలి.
కేటీఆర్ కు గళం లేదు.. బలం లేదు.. దళం లేదు.బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగిందో అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి సమాధానం చెప్పాలి. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే పదిసార్లు మొహం చాటేసింది గత ముఖ్యమంత్రి కేసీఆర్. ఆగస్టు 2016లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వచ్చారు.
నాడు కేసీఆర్ … నిధులు వద్దు.. మీ హృదయంలో చోటిస్తే చాలంటూ ప్రధానిపై పొగడ్తలు కురిపించారు. గజ్వేల్ కు, సిద్దిపేటకు రైలు సదుపాయం కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిపించింది. దేశంలో కేవలం 15 రోజుల్లో యాదాద్రి పవర్ ప్లాంటుకు అనుమతులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని నాడు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
కృష్టా నీటిలో 299టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆర్ కాదా? కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ సర్కారు.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోలేదు? మమతా బెనర్జీ, పినరయి విజయన్ లాంటి వారు ఆయా రాష్ట్రాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ని కలిశారు. కాని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎందుకు కలవలేదు..?
తెలంగాణకు చట్టపరంగా రావాల్సిన నిధులు, ఇతర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తుందని ప్రధాని స్వయంగా చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే చెప్పిండు. పదేండ్ల పాలనలో ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకులు నరేంద్ర మోదీ ని ఎందుకు కలవలేదు..? రాష్ట్రంలో గెలిచే సీట్లను వందల కోట్లకు అమ్ముకోవడమే బీఆర్ఎస్ నైజం. భారతీయ జనతా పార్టీపై విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు అని ప్రచారం చేసుకున్నరు. తెలంగాణ సమాజం సింగిల్ డిజిట్ కు పరిమితం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఓటువేస్తే హుస్సేన్ సాగర్ లో వేసినట్లే. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయం.