Suryaa.co.in

Telangana

కేసీఆర్…. రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

– హైకోర్టు ఆదేశాల మేరకు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే
– జీడీపీ పెరిగితే రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేశారో చెప్పాల్సిందే
– ఎంత మందికి దళిత బంధు ఇఛ్చావో శ్వేత పత్రం విడుదల చేయాల్సిందే
– కోవిడ్ వ్యాక్సిన్ పై అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలే
– వ్యాక్సిన్ కు నిధులిచ్చి ప్రోత్సహించిన నేత నరేంద్రమోదీ మాత్రమే
– గులాబ్ తుఫాను పోయినా ‘గులాబీ’ చీడ ఇంకా మిగిలే ఉంది
– కోహెడ ప్రజా సంగ్రామ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
ఆకాల వర్షాలు, ప్రక్రుతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తాము పదేపదే మొత్తుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని….తాజాగా ఆయా రైతాంగానికి 3 నెలల్లోగా పరిహారం అందించాల్సిందేనంటూ సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టికాయలు వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
కేంద్రం నిధులను వినియోగించుకోవడం లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి గులాబ్ తుఫాను బాధ తప్పినా…..గులాబీ చీడ మాత్రం ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించిన బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో గులాబీ చీడను వదిలించి బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. దళిత బంధు పథకం పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని, నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఎంతమందికి దళిత బంధు సాయం చేశారనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపద పెరిగిందని కోతలు కోస్తూ జీడీపీ అంశాన్ని లేవనెత్తుతున్న తండ్రీకొడుకులు ఏడేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఎందుకు దివాళా తీయించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తామే తయారు చేశామనే విధంగా అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ టీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండి పడ్డ బండి సంజయ్ వ్యాక్సిన్ తయారీకి నిధులిచ్చి ప్రోత్సహించిన నేత ప్రధాని నరేంద్రమోదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి భారత్ బయోటెక్ ను సందర్శించే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడ వ్యాక్సిన్ తయారవుతోందనే సోయే లేదని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 33వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు (29.11.2021) సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. వేలాది మంది తరలి వచ్చిన ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఘోరక్ పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, కార్యదర్శి బొమ్మ జయశ్రీతోపాటు సిద్దిపేట జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన జి.శివారెడ్డి, అందెల శ్రీరాం ప్రజా సంగ్రామ యాత్రపై ప్రత్యేకంగా రూపొందించిన పాటల సీడీని బండి సంజయ్, ఘోరక్ పూర్ ఎంపీ రవి కిషన్ ఆవిష్కరించారు. అనంతరం వేలాది మందిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు……
• ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతారో…ఆయనకే తెలియదు. ఆయనో అపరిచితుడు. పగలు నిర్ణయాలుండవ్. రాత్రి మాత్రమే ఉంటయ్.
• వరి వేస్తే ఉరే గతి అని మొన్న అన్నడు. అంతకుముందు సన్న వడ్లు పండించొద్దని అన్నడు. పత్తి వేయొద్దని ఒకసారి, మక్కలేయెద్దని మరోసారి చెబుతూ రోజుకో మాట మాట్లాడుతున్నడు. కేసీఆర్ పట్ల రైతులు కోపంతో ఉన్నరు. కేసీఆర్ బయట తిరిగితే రాళ్లతో కొట్టే పరిస్థితి. అందుకే బయటకు రావడం లేదు. నిన్న ఢిల్లీ పోయిండు. మోదీని 50 నిమిషాలు మాట్లాడినని గొప్పలు చెప్పుకుంటున్నడు. అన్నీ ఉత్త మాటలే. తుపాకీ రాముడి మాటలే. 300 ఎకరాలున్న ఎర్రవల్లి ఫాంహౌజ్ లో ఉంటూ వ్యవసాయ శాస్త్రవేత్తగా మీడియాకు ఫోజులు కొడతడు.
• నా పాదయాత్రలో మహిళలు, వ్రుద్దురాలు కలిసి గ్రామాల్లో బెల్టు షాపులను మూసి వేయించాలని కోరుతున్నరు. మద్యం తాగి ఇంటి పెద్దలు హింసిస్తున్నరని బాధపడుతున్నరు. మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నడు. మీకు పెన్షన్ రావాలన్నా…రైతు బంధు రావాలన్నా ఇకపై మందు తాగాల్సిందేనని అంటున్నడు.
• భూసార పరీక్షలు చేయాలని కేంద్రం నిధులిస్తే దారి మళ్లించిండు. ఏ ఒక్క రైతు పొలంలో భూ సార పరీక్షలు నిర్వహించనేలేదు. కేసీఆర్ ఫాంహౌజ్ లో మాత్రం భూసార పరీక్షలు చేసి పంటలు పండిస్తుండు.
• రైతులకు బియ్యంతో సంబంధమేముంది? వడ్లు మాత్రమే రైతులు అమ్ముతున్నరు. కొనేది కేంద్ర ప్రభుత్వం. కానీ కేసీఆర్ కేంద్రం పెత్తనమేంది? అని ఒకసారి అంటడు. ఇప్పుడేమో కేంద్రం వడ్లు కొనడం లేదని అంటున్నడు. అసలు ఈ విషయంలో కేసీఆర్ పెత్తనమేంది? కేంద్రానికి, రైతులకు మధ్య కేసీఆర్ బ్రోకర్ మాత్రమే. మరి నీ పెత్తనమేంది?
• కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని కేంద్రం చెప్పింది. ఇక మిగిలిన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర అవసరాలకు వాడుకోకూడదా? కర్నూలు రైస్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది.
• నేను మళ్లీ చెబుతున్నా….కేంద్రం మొత్తం ధాన్యం కొనిపించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఈ విషయంలో కేసీఆర్ చేస్తున్నదేమిటో చెప్పాలి. ఏడేళ్ల కాలంలో ఏనాడూ రోజువారీ కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేయని ఏకైక సీఎం కేసీఆర్.
• గులాబ్ తుఫాను పోయింది. కానీ గులాబీ చీడ ఇంకా మిగిలే ఉంది. 2023లో బీజేపీని తరిమితరమి కొట్టే పార్టీ బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తాం.
• నన్ను టీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకాయన అంటుండు….నేను పేదల తరపున పోరాడే విషయంలో నేను బ్రాండ్ అంబాసిడర్ నే. దళితుల తరపున కొట్లాడేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తా. ఆత్మహత్యల చేసుకుంటున్న రైతుల గొంతు విన్పించి కేసీఆర్ మెడలు వంచడానికి నేను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తా. హిందూ ధర్మాన్ని విచ్చిన్నం చేసేందుకు మీరు చేస్తున్న కుట్రలను చేధించి హిందూ అంబాసిడర్ గా పనిచేస్తా.
• మీ అయ్యా దేనికి బ్రాండ్ అంబాసిడర్. బ్రాందీకి మీ అయ్య బ్రాండ్ అంబాసిడర్. పేదలను ముంచడానికి, రైతులను చంపడానికి, దళితులను మోసం చేయడానికి బ్రాండ్ అంబాసిడర్.
• కేటీఆర్ కోతల రాయుడు. దేశానికి వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనట. అంతా అబద్దం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి నిధులిచ్చి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేసేలా అడుగడుగునా ప్రోత్సహించారు. ప్రధాని హైదరాబాద్ వచ్చి పోయేదాకా కేసీఆర్, కేటీఆర్ లకు సోయే లేదు.
• తెలంగాణలో విపరీతమైన కంపెనీలు పెడుతున్నరట. లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నరట. ధైర్యముంటే ఎంత మందికి ఉద్యోగాలిచ్చినవ్? ఆ జాబితా ఇస్తే కేసీఆర్ కు తోమాల పూల, పల్లకీ సేవ చేస్తా…..ఇయ్యకుంటే మాత్రం బడితె పూజ చేస్తా. నేను బక్కటోడినే కానీ ధైర్యవంతుడిని.
• తెలంగాణ దేనికోసం సాధించుకున్నం? 1400 మంది ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ సీఎం, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్యే, అల్లుడు మంత్రి, మరదలి కొడుకు ఎంపీ…వీళ్ల కోసమా తెలంగాణ తెచ్చుకుంది? రాష్ట్ర సీఎం కుటుంబం ఏ విధంగా జల్సాలు చేస్తుందో అర్ధం చేసుకోవాలి.
• ప్రజలకు కేసీఆర్ మోసాలు అర్ధమైనయ్. అందుకే నా పాదయాత్రకు ప్రజలు తండోపతండాలు వస్తున్నరు. కానీ అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు జనం రావడం లేదని పచ్చి అబద్దాలు చెబుతూ పవిత్రమైన సభను తప్పుదోవ పట్టిస్తున్నరు.
• టీఆర్ఎస్ నేతలు మీ దగ్గరకు వస్తే….మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేదు. ఉద్యోగాలైనా ఇవ్వు. నిరుద్యోగ భ్రుతి కింద రూ.లక్ష ఇవ్వాలని నిలదీయండి.
• కేంద్రం తెలంగాణకు 2.91 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం ఇక్కడి ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదు. కేంద్రం 3 లక్షల ఇండ్లు నిర్మిస్తే…మరో 10 లక్షల ఇండ్లను నేను కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పినా…ఇంతవరకు వాటి సంగతే చెప్పరు.
• రైతు బంధు తప్ప రైతులకున్న సబ్సిడీలన్నీ ఎత్తేసి అన్నదాతలను ఆగమాగం చేస్తుండు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడేళ్లయినా ఇంతవరకు ఒక్కసారి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. మేం రైతులను ఆదుకోవాలి…పంట నష్టపరిహారం చెల్లించాలని పదేపదే మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు పంట నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఇప్పటికైనా కేసీఆర్…సిగ్గు తెచ్చుకోవాలి.
• కేంద్ర నిధులను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని సాక్షాత్తు హైకోర్టు చెప్పినందున…నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అసలు సీఎంగా కేసీఆర్ ఉన్నది దేనికి? రైతులను బెదిరించడానికా? ఆత్మహత్యలను ప్రేరేపించడానికా సీఎంగా ఎన్నుకున్నది?
• తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం అన్ని విధాలా నిధులిస్తున్నా ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వాడుకోవడం లేదని మేం మొదటి నుండి చెబుతూనే ఉన్నం. మమ్ముల్ని దోషులుగా చిత్రీకరించే కుట్ర చేసిన కేసీఆర్….ఈరోజు హైకోర్డు కూడా ‘కేంద్ర నిధులు వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. మరి ఇప్పుడేమంటవ్? ముఖం ఎక్కడ పెట్టుకుంటవ్? కేంద్రం రైతుల కోసం ‘ఫసల్ బీమా యోజన’ తెస్తే రైతులు, కేంద్రం ప్రీమియం చెల్లిస్తుంటే రాష్ట్ర వాటా చెల్లించకుండా రైతులకు సాయం అందకుండా చేస్తున్నవ్? నరేంద్రమోదీ గారి ప్రభుత్వానికి పేరొస్తందనే సాకుతో ఈ పథకాన్ని అమలు చేయకుండా కుట్ర చేస్తోంది నీవు కాదా?
• నీ చేష్టలవల్ల కాయకష్టం చేసుకుని బతికే రైతన్నలు నష్టపోతున్నరు. ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. అరిగోస పడుతున్నరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో…తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా.
• తెలంగాణ బాగా అభివ్రుద్ది చెందిందని, రాష్ర్ట సంపద పెరిగిందని తండ్రీకొడుకులు చంకలు గుద్దుగుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. మరి 2014లో అప్పుల్లేకుండా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నీ ఏడేళ్ల పాలనలో 4 లక్షల 50 వేల కోట్లకుపైగా అప్పులు చేసింది. అట్లాంటప్పుడు పెరిగిన సంపద కంటే అప్పులే ఎక్కువ కన్పిస్తున్నయ్ కదా….మరి ఏడేళ్లలో నువ్వు సాధించేదేమిటో ప్రజలకు చెప్పాలి. నువ్వు సాధించేదేమిటంటే…ఈ ఏడేళ్లలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషి తలపై లక్ష రూపాయలకుపైగా అప్పు భారాన్ని పెట్టినవ్. ఇదీ నువ్వు సాధించిన ప్రగతి.
• నీ పాలన ఎట్లుందో… ‘ఇండియా రేటింగ్’ సంస్థ ఈ రోజు వెల్లడించిన సర్వేలోనే తేలిపోయింది. తెలంగాణ 67.2 శాతం మంది ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారని ఆ సంస్థ తేల్చింది. అంటే నీ పాలనలో ప్రతి 10 మందిలో 7 గురు అప్పులపాలై పోయిండ్రు. అట్లాంటిది నువ్వు, నీకొడుకు ప్రగతి మాట్లాడుతున్నరు. సిగ్గుండాలే. ఇంకెన్నాళ్లు ఇట్లాంటి అబద్దాలతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్నరు? తండ్రీ కొడుకులకు చేతనైతే ఈ లెక్కలతో చర్చక సిద్ధం కావాలని సవాల్ చేస్తున్న. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న ఆశావర్కర్లను, ఏఎన్ఎంలను పట్టించుకోవడం లేదు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వలంటీర్లను, స్టాఫ్ నర్సులను తొలగించి రోడ్డున పడేసిండ్రు.
• ప్రజల కోసం బీజేపీ పోరాడుతుంటే మాపై కేసులు పెడుతూ లాఠీఛార్జ్ చేస్తున్నరు. జైళ్లకు పంపుతున్నరు. అయినా ఏ కార్యకర్త భయపడటం లేదు. మీ కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని అధికారం ఇంకా కొనసాగించాలి? కుటుంబ పాలనను అంతం చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
• ఇవన్నీ మాట్లాడుతుంటే బండి సంజయ్ మత తత్వాన్ని రెచ్చగొడుతుండని ప్రచారం చేసున్నరు. బండి సంజయ్ కాంప్రమైజ్ కాడు. నో కాంప్రమైజ్. బరాబర్ కొట్లాడతా. ఎంఐఎం సవాల్ చేస్తే పాతబస్తీకి వెళ్లకుండా గజగజ వణికిన వ్యక్తి కేసీఆర్. మేం పాతబస్తీ వెళ్లి కాషాయా జెండా ఎగరేసి జై శ్రీ రాం అని గర్జించినం. మతం పేరుతో 12 శాతం ఓట్లను ఓటు బ్యాంకుగా మలిచి బీహార్ లో 5 సీట్లు ఎంఐఎం గెలుచుకుంటే….80 శాతం ప్రజలున్న హిందువులను ఏకం చేసి తెలంగాణలో గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేయలేమా? బరాబర్ ఎగరేసి తీరుతం.
• ఇంకా నీ కొడుకు ఒకడుగు ముందుకేసి ‘మాకు పోటీ రాష్ట్రాలతో కాదు…దేశాలతోనే’ అని ప్రగల్భాలు పలుకుతుండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అంతర్భాగం కాదా? వేర్పాటువాద మాటలతో దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నవా? రాష్ట్రాన్ని సమస్యలు పట్టి పీడిస్తుంటే వాటి గురించి ఆలోచించాల్సింది పోయి… ఎంఐఎంతో దోస్తీ చేస్తూ దేశాన్ని ముక్కలు చేయాలనే తీరులో మాట్లాడతావా? ఇట్లాంటి మాటలు మాట్లాడే మీరు నిజంగా దేశ ద్రోహులు. ఇలాంటి దేశ ద్రోహులకు తగిన బుద్ది చెప్పాల్సిందే.
• మీ నిర్వాకాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నరు. మీలాంటి దేశద్రోహుల, పచ్చి మోసగాళ్ల భాగోతం అందరికీ అర్ధమైంది. ఇక మీ పతనం మొదలైంది. హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నరు. మీ అహంకారాన్ని, మీ బలుపును హుజూరాబాద్ ఎన్నికల్లో దించి మిమ్ముల్ని పాతాళంలోకి తొక్కేందుకు ప్రజలు సిద్ధమైండ్రు. అక్కడ కాషాయ జెండా ఎగరేయడం ఖాయం. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతం.
• హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జెండాను తుక్కు తుక్క చేస్తాం. బీజేపీ జెండా ఎగరేస్తాం. మోదీ ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ ను గెలిపించి ఢిల్లీ వెళ్లి గిఫ్ట్ గా ఇస్తాం.
• టీఆర్ఎస్ కు మొన్నటి వరకు అభ్యర్థే దొరకలేదు. ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమకారుడు. కష్టపడి పనిచేసిండు. కోవిడ్ సమయంలో వైద్య మంత్రిగా ఉంటూ ప్రాణాలను తెగించి కష్టపడి పనిచేసిండు. అందుకే బీజేపీని గెలిపించి టీఆర్ఎస్ కు డిపాజిట్ రాకుండా తరిమి తరిమి కొడతామని ప్రజలే చెబుతున్నరు.
• ఏదో రకంగా అడ్డదారుల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోంది. బీజేపీ ఓట్లను తొలగించాలని కుట్ర చేస్తుండు. ఫాం హౌజ్ లో కూర్చుని కుట్రలు చేస్తుండు. హుజూరాబాద్ లో ఆ కుట్రలు సాగవు. కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
• దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసే కుట్ర కేసీఆర్ చేస్తుండు. ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇప్పటి వరకు ఎంత మంది దళితులకు ‘దళిత బంధు’ ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి.
• కేంద్రం రాష్ర్టానికి వేల కోట్ల నిధులిస్తోంది. ఈ కోహెడ మండలానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 16 కోట్ల 44 లక్షల 50 వేలు, గ్రామీణ ఉపాధి హామీ కింద 32 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.16.50 కోట్లు, ఆర్దిక సంఘం ద్వారా రూ. 16.40 కోట్లు, మరుగుదొడ్ల కోసం రూ. 2.53 కోట్లు ఇచ్చినం. దీంతోపాటు వైకుంఠ ధామానికి రూ.11.13,700లు, రైతు వేదిక నిర్మాణానికి రూ.10 లక్షలు, పల్లె ప్రక్రుతి వనాల కోసం రూ. 4.03 లక్షలు, మొక్కల పెంపకానికి 1 లక్ష 51 వేలబ114లు ఇస్తున్నం. ఇవి కాకుండా రోడ్లకు, నీళ్లకు సహా స్మశాన వాటికల నిర్మాణానికి డబ్బులు కేంద్రమే ఇస్తోంది. అయినా ప్రజలను తప్పుదారి పట్టించి టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తున్నట్లు ఫోజు కొడుతుండు.
• తోటపల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులను గాలికొదిలేసిండ్రు. ప్రాజెక్టు కట్టలేదు. భూములు తీసుకున్నరు. ఎక్కడైనా ఫ్యాక్టరీ కట్టకపోతే ఆ సంస్థకిచ్చిన భూములను స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం తొటపల్లి ప్రాజెక్టు కట్టనందుకు అందుకోసం తీసుకున్న భూములను రైతులకు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదో స్పష్టం చేయాలి?తక్షణమే 1600 ఎకరాల భూమిని రైతులకు అప్పగిస్తారా? ప్రాజెక్టు కడతారా? జిల్లా ప్రజలకు స్పష్టం చేయాలి. కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వరు. ప్రాజెక్టు కట్టరు. భూములు తిరిగి ఇవ్వమంటే ఇవ్వని మూర్ఖుపు సీఎం కేసీఆర్.
• వాస్తవాలు తెలియజేయడంతోపాటు ప్రజల బాధలను, కన్నీళ్లను తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. ప్రజలు ఎలాంటి పాలన కావాలనుకుంటున్నారో స్వయంగా తెలుసుకుని 2023లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అలాంటి పాలన అందిస్తాం. గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నం. ఇలాంటి నియంత, కుటుంబ పాలనను తరిమి కొట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. 2023లో బీజేపీ అధికారంలోకి తేవడం తథ్యం.
ఘోరక్ పూర్ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ : హిందుత్వ టైగర్ బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. బీజేపీ స్వచ్ఛమైన పార్టీ. హిందూ ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోదీ చేస్తున్న క్రుషి ప్రశంసనీయం.
తెలంగాణ, ఏపీలో ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతివ్వాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. బీజేపీకి చెందిన 18 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. బీజేపీలో కార్యకర్త సీఎం అయ్యే అవకాశం ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే బీజేపీ కుటుంబ పార్టీ కాదు. వంశపారంపర్య పార్టీ కాదు. కార్యకర్తలు నడిపే పార్టీ బీజేపీ మాత్రమే.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినం జరపాలని డిమాండ్ చేస్తున్నా ఎంఐఎంకు భయపడి నిర్వహించడం లేదు. నేను శివ భక్తుడ్ని. బండి సంజయ్ ను ఆశీర్వదించాలని కోరుతున్నా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుతున్నా.
బీజేపీ మండలాధ్యక్షుడు ఖమ్మం వెంకటేశ్వర్లు : కోహెడ జల దిగ్బంధంలో ఉంది. ఎటు వెళ్లలేని పరిస్థితి. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సరిగా రోడ్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు. బ్రిడ్జీలు కూలిపోయాయి.

LEAVE A RESPONSE