Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర వ్యాప్తంగా ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులకు శిక్షణ కార్యక్రమం

కంకిపాడులో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడ : గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంను ఆచరణలోకి తీసుకువస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయానికి అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ ఉపసర్పంచ్లు, పంచాయతీ వార్డు సభ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా కృష్ణాజిల్లా కంకిపాడులో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధుల విధులు, అధికారాలు, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన కరదీపికను ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యం, వ్యవస్థల పట్ల సీఎం వైయస్ జగన్ గారికి గౌరవం, చిత్తశుద్ది ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆయన చేసిన ప్రయత్నాలను చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజాప్రతినిధులకు బదులుగా తెలుగుదేశం పార్టీ నేతలతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను అనర్హులకు కట్టబెట్టారని అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్యం స్పూర్తికి విరుద్దంగా చంద్రబాబు పరిపాలన సాగించారని అన్నారు.
వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో సీఎం వైయస్ జగన్ పట్ల ఉన్న విశ్వాసంను చూసి, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి అస్తిత్వం ఉండదనే కుట్రతోనే చంద్రబాబు నీచ రాజకీయాలు చేశాడని మండిపడ్డారు. తాను అధికారంలో ఉన్నప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రజాతీర్పును ఎదుర్కోలేక చంద్రబాబు వాయిదా వేశారని విమర్శించారు. అంతేకాదు 2014లో కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి చంద్రబాబు ఏరకంగా కుమ్మక్కు రాజకీయం చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళారో ప్రజలకు తెలుసునని అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ్యవస్థలను ఉపయోగించుకుని ఎన్నికలు జరగకుండా చివరి వరకు చంద్రబాబు ప్రయత్నించాడని అన్నారు. ఈ ఆటంకాలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు తనవంతు కృషి చేసిందని తెలిపారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు ఈ ప్రభుత్వానికి, అధికారపార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని చేరువ చేసేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దానిలో భాగంగానే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల నియామకాలను తీసుకువచ్చారని అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలన్న ధ్యేయంతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.
ప్రజాస్వామ్యం పట్ల సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమే ఈ ఎన్నికలు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై వేలకుపైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్లు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలకు ఎంతగా చేరువ అయితే, భవిష్యత్తులో వారిని ప్రజలు మరింత మంచి స్థానంలో కూర్చోబెడతారని గుర్తు చేశారు. రాజకీయ ఎదుగుదలకు, ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు మీ పనితీరే గీటురాయిగా చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అందుకు అవసరమైన చేయూతను అందిస్తున్నామని, ప్రతి మండలంలోనూ రెండు చోట్ల, పెద్ద మండలాల్లో మూడుచోట్ల ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
చట్టాలపై అవగాహన పెంచుకుని మంచి పాలనను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ఏర్పాటైన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో తుపాను పరిస్థితులు ఉండటం వల్ల వచ్చే నెలలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
పెనమలూరు శాసనసభ్యులు కె.పార్థసారధి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతులు మీదిగా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి పంచాయతీ వ్యవస్థ బలమైన పునాధిగా నిలుస్తోందని, ఈ వ్యవస్థను బలోపేతం చేస్తేనే గ్రామ పాలన సుస్థిరం అవుతుందని పేర్కొన్నారు. గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో చరిత్ర కలిగిఉంటే, ఇటీవల ఈ వ్యవస్థ కొంత బలహీనమైందని, చంద్రబాబు పాలనలో దీనిని మరింత నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ఈ వ్యవస్థ ద్వారా ప్రజాప్రతినిధులు తమ విధులు నిర్వర్తించలేని పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం అందుకు భిన్నంగా కింది నుంచి వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారని అన్నారు. ప్రజల అన్ని అవసరాలను తీర్చే వ్యవస్థగా గ్రామీణా వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ దేశానికి పల్లెల్లే పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటలను సీఎం శ్రీ వైయస్ జగన్ గ్రామసచివాలయ వ్యవస్థతో ఆచరణలో చేసి చూపిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజల ముంగిటకే పాలనను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో వార్డు సభ్యులు చేస్తున్న కృషి గొప్పదని, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే నవశకానికి నాంధి పలుకుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచిపనిలోనూ భాగస్వాములం అవుదామని కోరారు. కార్యక్రమంలో ఎపిఎస్ఐఆర్డి డైరెక్టర్ మురళి, పిఆర్అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, జెసి మాధవీలత, జెడ్పీ చైర్మన్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE