Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ఫలాలు, ఫలితాలు దూరం చేస్తున్న పాలకులు

-మనువాదం అమలు చేయాలని బిజెపి సర్కారు కుట్ర
-దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్న మోడీ
-మోడీ సర్కార్ బాటలోనే కెసిఆర్ పాలన
– ధాన్యం కొనమనే ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర
– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
– సమరయోధులు, సీనియర్ నాయకులను సన్మానించిన భట్టి విక్రమార్క

పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన బహుళార్థసాధక ప్రాజెక్టులు, మిశ్రమ ఆర్థిక విధానాలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఫలాలను వాటి ఫలితాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నేడు వాటిని ప్రజలకు దూరం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం కాంగ్రెస్
bhatti-2 పార్టీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను భట్టి విక్రమార్క శాలువా కప్పి, మెమొంటో అందజేసి ఘనంగా సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారు చేసిన సేవలను కొనియాడారు.

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ… దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ దారాదత్తం చేస్తున్నదని ధ్వజ మెత్తారు.

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందని వివరించారు. ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ,రైతులు చేసిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలన్న కుట్రలో భాగమే ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకుండ చేస్తున్న రాజకీయంతో విసిగి వేసారిన రైతులు వారి భూములను తామంతట తామే కార్పొరేట్ శక్తులకు లీజుకు అప్పగించాలన్న కుట్రలో భాగంగానే పరోక్షంగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుతున్న రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం మరో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల పైనే ఉందని పిలుపునిచ్చారు. దేశానికి కాంగ్రెస్ ప్రసాదించిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు రాచరిక పాలన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, ఉద్యమిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తూ పౌరుల భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో అమలు చేయాలని కుట్ర చేస్తున్న బీజేపీ సర్కారును గద్దె దించడానికి దేశ ప్రజలు మరో స్వాతంత్ర్య సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి కాంగ్రెస్ సృష్టించిన జాతి సంపదను గుజరాత్ వ్యాపారులకు అమ్మే ప్రక్రియను మోడీ సర్కార్
మొదలు పెట్టిందని దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల పైన ప్రధానంగా ఉందని వక్కాణించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకు కాంగ్రెస్ సైన్యం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం తమ ఆస్తులను, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టిన సీనియర్ నాయకుల సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అందరినీ ఆహ్వానించి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవం జనవరి 26, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న వారిని గౌరవించి సత్కారం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ Mlc అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మొక్కా శేఖర్, దొబ్బల సౌజన్య, వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్ తిలక్, కొత్త సీతారాములు, పులిపాటి వెంకయ్య, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE