– మోదీ విమర్శలపై కేసీఆర్ మౌనం
– ఇప్పటిదాకా కనిపించని ఎదురుదాడి
– మంత్రుల ప్రెస్‌మీట్లతోనే సరి
– కేసీఆర్ మాట్లాడితే ఆ కిక్కే వేరప్పా అంటున్ని నేతలు
– సహజత్వానికి భిన్నంగా కేసీఆర్
– మౌనం వెనుక మతలబు ఏమిటో?
– బీఆర్‌ఎస్ స్థాపన తర్వాత మోదీపై కేసీఆర్ నేరుగా మాటల దాడి
– కేసీఆర్ పేరెత్తకుండా ఆయనపై తాజాగా మోదీ విమర్శల వర్షం
– హైదరాబాద్ వచ్చి మాటల దాడి చేసినా మౌనమేల?
– కేసీఆర్ మౌనంపు పార్టీ నేతల ఆశ్చర్యం
– మోదీ మాటలు ఖండిస్తూ ప్రకటన కూడా విడుదల చేయని వైనం
– బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో చాకిరేవు పెడతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘మోదీ హైదరాబాద్ అడ్డమీదకొచ్చి అంత గనం సారును తిడితే సారు సప్పుడు చేయడేందీ?.. మోదీ హైదరాబాదచ్చి సర్కారును పొట్టు పొట్టు తిట్టినా సారులో సప్పుడేదీ?.. మంత్రులు తిడితే లెక్కేంది? సారు మాట్లాడితేనే లెక్కాపత్రం ఉంటుంది. సారు మాట్లాడితే ఆ కిక్కే వేరప్పా. సారు తిడితేనే మా అందరికీ కిక్కస్తది. ఇగ సారు బీఆర్‌ఎస్ ఆవిర్భావసభలో మోదీని ఒక లెవల్ల తిడ్తడేమో’’
– ఇదీ.. మోదీ తనపై మాటల దాడి చేసినా.. స్పందించని సీఎం కేసీఆర్ మౌనంపై బీఆర్‌ఎస్ నేతల మనోగతం.
హైదరాబాద్ అడ్డమీదకొచ్చి.. కేసీఆర్ పేరెత్తకుండా, కుటుంబపాలనపై విరుచుకుపడిన ప్రధాని మోదీ మాటల దాడిపై… ఇప్పటిదాకా ఎదురుదాడి చేయని కేసీఆర్ మౌనంపై, బీఆర్‌ఎస్ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీని.. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత జరిగిన అన్ని సభలు, ప్రెస్‌మీట్లలో.. కేసీఆర్ నేరుగా మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీకి చెందిన నాయకులు.. తన పార్టీలో చేరిన సందర్భాల్లో.. మోదీ పాలనపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
కానీ.. అదే మోదీ, హైదరాబాద్‌కు వచ్చి.. తన కుటుంబ పాలనపై విమర్శనాస్తాలు సంధించి 48గంటలు దాటుతున్నా… ఇప్పటివరకూ ఆయనపై కేసీఆర్ ఎదురుదాడి చేయకపోవడం బీఆర్‌ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి తనపై మాటల యుద్ధం చేసిన మోదీపై.. కేసీఆర్ వెంటనే ఎదురుదాడి చేస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. మోదీ వచ్చిన సాయంత్రానికే ప్రెస్‌మీట్ పెట్టి, ఆయనపై ఎదురుదాడి చేస్తారని అంచనా వేశాయి.
కానీ ఇప్పటిదాకా మోదీ మాటల యుద్ధంపై కేసీఆర్ మౌనం వహించడం, బీఆర్‌ఎస్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. మోదీపై మంత్రులతో ఎదురుదాడి చేయించినప్పటికీ, అది బీఆర్‌ఎస్ వర్గాలను సంతృప్తి పరచ లేదు. ‘‘కేసీఆర్ మాట్లాడితే ఆ కిక్కే వేరేప్పా’’ అన్న అంచనాతో ఉన్నాయి.
తాజాగా కేసీఆర్ మౌనరాగంపై బీఆర్‌ఎస్ వర్గాల్లో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. మోదీ తన స్థాయి నాయకుడు కాదన్న అభిప్రాయంతో ఉన్న కేసీఆర్.. ఆ మేరకు తన మంత్రులతో, ఎదురుదాడి చేయించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొందరు నేతలు మాత్రం.. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు, తమ అధినేత మోదీని చాకిరేవు పెడతారని, అందుకే మౌనం పాటించారని విశ్లేషిస్తున్నారు.