-కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకోవడానికి 500 కోట్లు కేసీఆర్ ఆఫర్
-నీ నిజ స్వరూపం తెలిసే, కుమారస్వామి నీ సభకు హాజరు కాలేదు
-ఇంటెలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారు
-మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను దూషిస్తున్నారు
-కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆరెస్ ఎందుకు పోటీ చేయలేదు?
-ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు
-మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ ను పోలుస్తారా?
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆరెస్ గా మార్చుకున్నారు. ఆయన పార్టీకి ఏ పేరైనా మార్చుకోవచ్చు. కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీ తో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆరెస్ ఎందుకు పోటీ చేయలేదు.? యూపీలో అఖిలేష్ ను గెలిపించాలని ఎందుకు మద్దతు ఇవ్వలేదు.? ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీని గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదు? డి.రాజా, కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, అఖిలేష్ యాదవ్ బీఆరెస్ సభలో పాల్గొన్నారు. వీళ్లంతా ఒక బృహత్ ప్రణాళిక తో ముందుకు వస్తారని చివరి వరకు గమనించా. కానీ కాంగ్రెస్, బీజేపీ లను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారు. దేశంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 245 టీఎంసీల సామర్ధ్యంతో నాగార్జున సాగర్ ను నిర్మించింది. 1 లక్ష 45 వేల గ్రామాలకు కరెంట్ 1 లక్ష తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ది. పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాంగ్రెస్. ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా లను ప్రారంభించింది కాంగ్రెస్.
మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి, పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్? కాళేశ్వరం ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా? మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్నారు.. కానీ గజ్వేల్ లో మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే..ఎనిమిదేళ్లలో 25 లక్షల పంపుసెట్లు రైతులు ఎందుకు ఉపయోగిస్తారు? ప్రతీ రైతులకు 24 గంటల కరెంటు అవసరం ఎందుకు ఉంటుంది? మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను దూషిస్తున్నారు నిజం కాదా కేసీఆర్? 65 మంది ప్రధానులు కలిసి 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎనిమిదేళ్లలో మోడీ100 లక్షల కోట్లు అప్పు చేశారు. అలాంటి మోదీ తో కాంగ్రెస్ ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట. చైనా మెడలు వంచింది కాంగ్రెస్ అయితే… 2వేల చదరపు కి.మీ. మన దేశాన్ని అక్రమించుకున్నా చైనాకు మోడీ క్లీన్ చిట్ ఇచ్చాడు. అలాంటి మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ ను పోలుస్తారా?
కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులు మూతవేశాడు. కంది పప్పుకు మద్దతు ధర గురించి స్పందించని కేసీఆర్, కంది పంటల గురించి మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ దగ్గర నిర్మించే అంబేద్కర్ విగ్రహం చైనా నుంచి తీసుకొచ్చింది నిజం కాదా? కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకోవడానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? కర్ణాటకలో 25 నుంచి 30 సీట్లు ఓడించడానికి ఆయనతో బేర సారాలు చేసింది నిజం కాదా? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కు నోప్పేంటి? ఇక్కడికి సంబంధించిన ఇంటలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. ఇంత నీచమైన పనికి పూనుకున్న కేసీఆర్, ఈ సమాజానికి చీడ పురుగో కాదో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నీ నిజ స్వరూపం తెలిసే, కుమారస్వామి నీ సభకు హాజరు కాలేదు. కేసీఆర్ అరాచకాలకు కాలం తప్పక సమాధానం చెబుతుంది. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
దేశంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగింది. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? కాంగ్రెస్ ఏం చేసింది.. బీజేపీ ఏం చేసింది.. కేసీఆర్ ఏం చేశారో తేల్చుకుందాం. ప్రజల ముందు నిలబడదాం.. ఎవరు దోషులో ప్రజలే తేలుస్తారు.కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ స్వార్థం కోసం, ఆర్ధిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మే నాయకుడు కేసీఆర్.విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు.. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధం.కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదు. ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.