Suryaa.co.in

Telangana

ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్?

-కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, సంక్షేమ పథకాలు చేపడుతుంది అవి వద్దు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్
-ఫ్యూడల్ గవర్నమెంట్ వద్దు.. పీపుల్స్ గవర్నమెంట్ కావాలని రాష్ట్ర ప్రజలంతా చెప్పాలి
– మిగులు విద్యుత్తు రాష్ట్రం గా పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు విక్రయాలు చేపట్టి లాభాలు సాధిస్తాం
-తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తాం
– రుణమాఫీ చేస్తామని మీలాగా ఇళ్లల్లో పడుకోలేదు
ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం.. అర్హులైన వారందరికీ రైతు రుణమాఫీ అమలు చేస్తాం
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ – ప్రారంభిస్తాం.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇప్పిస్తాం
– రామగుండం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రామగుండం: ఏం అడగడానికి.. ఏం చెప్పడానికి.. ఈ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తావు కెసిఆర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రశ్నించారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించారు.

మీ 10 ఏళ్ల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే 18 వేల కోట్లు రైతుల కోసం బ్యాంకుల్లో జమ చేయడం తప్పు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని మీరు ఇవ్వలేకపోయారు మేము ప్రతి నియోజకవర్గానికి 3500 మందికి తగ్గకుండా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించేందుకు ముందుకు పోతున్నాం.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు.

పదేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం.. కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర నెలలోనే 60 వేల ఉద్యోగాలు ఇస్తుంది.. ఇది తప్పు మాలాగా ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్ అన్నారు. దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి ఎగనామం పెట్టిన కేసీఆర్ ఏం చెప్పడానికి ప్రజల్లోకి వస్తారని అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రాలేదు.. ఏ సామాజిక, భావ స్వేచ్ఛ కోసం, సంపద అందరికీ పంచాలని తెలంగాణ తెచ్చుకుంటే అవేవీ కాకుండా సంపద మొత్తం దోపిడికి గురైంది అన్నారు.

కార్మికుల శ్రమను సైతం దోచుకున్న గత ప్రభుత్వాన్ని కూల్చాల్సిందేనని రామగుండం ప్రజలు పెద్ద ఎత్తున నా పాదయాత్రలో పాల్గొని అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ మొత్తం సమావేశమై నిర్ణయించిందన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నెలల వ్యవధిలోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు.మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ. సౌకర్యం కల్పించి ఆ మొత్తాన్ని ఇప్పటివరకు 2500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించిందన్నారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఏ ఒక్క నిమిషం ఆలస్యమైనా ఏ మూలనో రోగి ఇబ్బంది పడతాడని భావించి ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోపే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి అమలు చేశామన్నారు.

ప్రజా పాలన పేరిట సభలు పెట్టి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్నామన్నారు.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తారో లేదో అని అంతా అనుమానపడ్డారు అర్హత కలిగిన అందరికీ 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నాం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పదేళ్ల పాలనలో విదేశాలకు వెళ్లి పెట్టుబడి తీసుకురాని కెసిఆర్ ఆయన కుమారుడు.. రాష్ట్ర సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. మా సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు అమెరికా కొరియా దేశాల్లో పర్యటించి 36వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని తెలిపారు.

బొగ్గు భాయి బొంబాయి అని మోసపు మాటలు చెప్పి గత పాలకులు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మేం మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చాం. కాంటాక్ట్ కార్మికులకు 30 లక్షల బీమాను అమలు చేస్తున్నాం అన్నారు.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ మరోవైపు రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 18 వేల కోట్లు జమ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ పొందలేని రైతులందరికీ రుణమాఫీని వర్తింప చేస్తామన్నారు. వ్యవసాయ అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. కెసిఆర్ మీలాగా మేం ఇళ్లల్లో పడుకోలేదు ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నామన్నారు.

ఈ రాష్ట్ర ప్రజలకు ఆస్తులు సృష్టించి వ్యవస్థలు ఏర్పరిచి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. రామగుండం ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న థర్మల్ పవర్ ప్లాంట్ ను 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తామన్నారు. జెన్కో ,సింగరేణి సంయుక్తంగా రామగుండంలో పవర్ ప్రాజెక్టు నిర్మించి ఉద్యోగాలు పోకుండా నిలబెట్టేందుకు ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుంది అన్నారు.

రైతులు ,యువత, సాగునీటి ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో పట్టు ఉంది కదా అని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తే ప్రజలు ఏమాత్రం ఉపేక్షించారన్నారు.

మీ కన్నా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసాం. రేపు పాటు కూడా కరెంటు కోతలు లేకుండా ఉద్యోగులు శ్రమిస్తున్నారని తెలిపారు. పిక్ డిమాండ్ 15,600 మెగావాట్లను అందుకున్నామన్నారు. 2032 రెండు కల్లా రాష్ట్ర విద్యుత్తు అవసరాలు 27059 మెగావాట్లు అంచనా వేసి ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

థర్మల్ ప్రాజెక్టులు నిర్మిస్తాం, సోలార్, ఫ్లూటింగ్ అన్ని రకాల వనరులు వినియోగించి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఎదగడమే కాదు ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మి లాభాలు సాధిస్తాం. ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి యువతకు ఉపాధిని కల్పిస్తాం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

పీఎం కుసుమ ప్రాజెక్టు కింద 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. ప్రతి మహిళను మహారానిగా ఈ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఏటా 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందిస్తాం అన్నారు. మహిళల పక్షాన ఆ వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు.

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభిస్తాం అన్నారు. హైదరాబాద్ కు వెళ్లి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోలేని వారికోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. దేశంలోనే నిష్ణాతులైన లెక్చరర్లతో ఉచితంగా పోటీ పరీక్షలకు ఆన్లైన్లో శిక్షణ అన్నారు.

నాలుగు నుంచి ఐదు లక్షల మంది నిరుపేద విద్యార్థులు రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నారని… వారికి గత ప్రభుత్వం మూడు కోట్లు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి 5000 కోట్లు కేటాయించింది అన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్ గవర్నమెంట్ వద్దు పీపుల్స్ గవర్నమెంట్ ఉండాలి అని రాష్ట్ర ప్రజలందరూ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ కరెంటు పోల్స్ అవసరం ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదిస్తే వెంటనే మంజూరు చేస్తాం అన్నారు.

LEAVE A RESPONSE