Suryaa.co.in

Telangana

కేసీఆర్.. వరద బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తరు?

– గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతల ప్రశ్న
గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో వచ్చిన భారీ వరదల్లో నష్టపోయిన బాధితులకు 10 వేలు ఎప్పుడిస్తారని, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కొంతమందికే 10 వేలు ఇచ్చిన కేసీఆర్, మిగిలిన బాధితులకు నష్టపరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలని నిలదీశారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో, అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి, తొలిసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన నేతలు, నరకకూపంగా మారిన నగర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు, తక్షణం గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్‌కు ప్రభుత్వం 50 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్, ఇప్పుడు ఫాంహౌస్‌లో పడుకున్నారని నేతలు విమర్శించారు. ధరణి పోర్టల్ వైఫల్యం నేపథ్యంలో జరుగుతున్న భూదోపిడీని ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కరోనా కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారి నుంచి, వాహన చలాన్ల పేరుతో ప్రభుత్వం ఖజానా నింపేసుకునే పనిలో ఉందని, ఇది దారుణమన్నారు. తక్షణం చలాన్లు విధించడం ఆపాలని డిమాండ్ చేశారు.
కాగా చాలాకాలం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలు ఎం.అరవిందకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని, గంధం గురుమూర్తి, పి.అశోక్, శ్రీపతి సతీష్, జోత్స్న, పొగాకు జయరాం, పార్లమెంటు అధ్యక్షుడు పి.సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్‌కుమార్, పి.బాలరాజ్‌గౌడ్, చిట్టినేని విజయశ్రీ, గడ్డి పద్మావతి, రాజేంద్రప్రసాద్, కొమరన్న, బోస్, గడ్డి పద్మావతి, సూర్యదేవర లత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE