Suryaa.co.in

Telangana

ఖమ్మం బీఆర్ఎస్ సభ విజయవంతం

– దేశ రాజకీయాల్లో కీలక మలుపు

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖమ్మంలో బుధవారం జరిపిన భారీ బహిరంగ సభ విజయవతమైంది. ఎనిమిదిన్నరేళ్ల అత్యల్పకాలంలోనే తెలంగాణను అత్యద్భుతంగా అభివృద్ధి చేసి, ఈ దేశానికే మోడల్ గా నిలిపిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి సారధ్యం వహిస్తే ఈ దేశ ప్రజలకు ఇంకా ఎంతో మేలు జరుగుతుందనే సంకేతాన్నిచ్చింది. ఆభికి బార్ కిసాన్ సర్కార్ ‘ అనే నినాదం తో రైతు రాజ్యం తేవాల నే సిఎం కే సి ఆర్ లక్ష్యానికి భారీ ఆమోదం లభించింది. సహజ వనరులు , మానవ సంపద పుష్కలంగా ఉన్న భారత దేశం ప్రపంచంలోనే అత్యున్నత సుసంపన్న దేశంగా మారుతుందనే భరోసా ఏర్పడింది. కేంద్రంలో ఉన్మాద పోకడలతో పరిపాలన చేస్తున్న బీజేపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలంటే, దేశ అభ్యున్నతే ద్యేయంగా అడుగులు వేస్తున్న బి ఆర్ ఎస్ వంటి పార్టీలకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నదని ఖమ్మం గుమ్మంలో విజయవంతమైన బి ఆర్ ఎస్ తొలి భారీ బహిరంగ సభ ఈ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నదనే విషయాన్ని తేల్చి చెప్పింది.

బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ ముఖ్యాంశాలు
బుధవారం ఉదయం నుంచీ సాయంత్రందాకా పలు కార్యక్రమాలు…

తొలుత హైదరాబాద్ లో ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం అనంతరం వారు యాదాద్రిలో పర్యటించి, హెలీకాప్టర్లో ఖమ్మం వెళ్లారు. అక్కడ నూతన కలెక్టరేట్ ప్రారంభం, కంటి వెలుగు పథకం రెండోదశ ప్రారంభం తదితర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, ఖమ్మంలో బీఆర్ఎస్ జరిపిన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్ లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు మంగళవారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వీరంతా బుధవారం ఉదయం 9.45 గంటలకు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు జాతీయ నేతలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. వారందరితో కలిసి ప్రగతిభవన్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నారు.

రెండు హెలీకాప్టర్లలో యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు..
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు హెలీపాడ్ నుండి తొలుత ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు..
అక్కడి నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రధాన ఆలయానికి ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు, ముఖ్య అతిథులుగా వచ్చిన ఇతర ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలకు ఆలయ, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి కుంకుమబొట్టు పెట్టి స్వాగతించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్య నేతలంతా ఆలయంలోకి ప్రవేశించగానే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ధ్వజస్థంభ ప్రదక్షిణ గావించారు. ఆలయ గర్భగుడిలో మూల విరాట్ స్వయంభూ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం చెప్పి, సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వారందరికీ హారతి, తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు. ముఖ్య అతిథులకు ఆలయ అధికారులు స్వామివారి విగ్రహాలను అందించి, శాలువాలతో సత్కరించారు.

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం గురించి వివరించిన సీఎం కేసీఆర్..
శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన సందర్భంలో స్థల పురాణాన్ని, ప్రాశస్త్యాన్ని సీఎం వారికి తెలిపారు. గతంలో ఈ ఆలయం ఉన్న ఫొటోలను, ప్రస్తుతం పునర్నిర్మాణం జరిగిన తర్వాత తీసిన ఫొటోలను ముఖ్యమంత్రి కేసీఆర్ సహచర సీఎంలు, ముఖ్యనేతలకు చూపిస్తూ, ఆలయ పునర్నిర్మాణం జరిపించిన తీరును వివరించారు. గతంలో యాదగిరిగుట్టపై ఆలయం కేవలం అర ఎకరం స్థలంలో మాత్రమే ఉండేదని, దాన్ని ఇపుడు నాలుగు ఎకరాల స్థలానికి విస్తరించి, అభివృద్ధి జరిపిన తీరును సీఎం కేసీఆర్ వారికి వివరించారు.
సిమెంటు లేకుండా పూర్తిగా కృష్ణశిలతోపాటు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఇతర స్టోన్స్ ను దేశంలోని ఇతర ప్రాంతాల నుండి తెప్పించి, వివిధ రాష్ట్రాలోని నిపుణులైన స్తపతులతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ వారికి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్సును నిర్మించినట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ తర్వాత వారు అద్దాల మంటపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఆ తర్వాత విజిటర్స్ బుక్ లో ఆలయ గొప్పతనం గురించి అతిథులు తమ అభిప్రాయాన్ని నమోదు చేశారు. అనంతరం వారంతా శివాలయానికి చేరుకొని స్వామివారి పూజలో పాల్గొన్నారు. అర్చకులు వారికి ఆశీర్వచనంతోపాటు, తీర్థ ప్రసాదాలు అందించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు ప్రశంసించారు. అనంతరం వారంతా ఆలయం నుండి ప్రెసిడెన్సియల్ సూట్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆ సూట్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని, టెంపుల్ సిటీని చూపించారు. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రెసిడెన్షియల్ సూట్ నుండి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, టెంపుల్ సిటీ, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం వారు హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆర్డీఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత యాదగిరి గుట్ట నుంచి వారందరూ రెండు హెలీకాప్టర్లలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

యాదాద్రి నుంచి ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు :
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి దర్శనానంతరం హెలీకాప్టర్లలో ఖమ్మం బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా తదితరులు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకున్నారు. వీరికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. వారంతా నేరుగా ఖమ్మం కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రులు :
ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా ప్రారంభోత్సవం చేశారు. ఖమ్మంలో రూ. 53 కోట్లతో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆ తర్వాత వారు కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో అందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను సీటులో కూర్చుండబెట్టిన సీఎం కేసీఆర్ గారు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు.

ఖమ్మంలో రెండోవిడత కంటి వెలుగును ప్రారంభించిన నలుగురు సీఎంలు :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్‌ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌ గౌసియా బేగం తదితరులకు నేతలు సీఎంలు కేసీఆర్, పినరయి విజనయ్‌, అరవింద్‌ కేజ్రీవాల్ భగవంత్‌ మాన్‌లతో పాటు, అఖిలేశ్‌ యాదవ్‌, డీ.రాజా కంటి అద్దాలను అందజేశారు. కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ తో పాటు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరిచయం చేసిన సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజనయ్‌, అరవింద్‌ కేజ్రీవాల్ భగవంత్‌ మాన్‌లకు సీఎం కేసీఆర్ గారు కేబినెట్ మంత్రులను, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పరిచయం చేశారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా కేజ్రీవాల్ కు పరిచయం చేసిన సీఎం కేసీఆర్.. భట్టిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు.

కంటి వెలుగు అదనపు సమాచారం :
తెలంగాణలో అంధత్వ వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదల కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 1 కోటి 54 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఇచ్చారు. 41 లక్షల 6 వేల మందికి కళ్లద్దాలు అందజేశారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానాలకు సిఫారసు చేశారు.

తొలివిడత కంటివెలుగు సక్సెస్ స్ఫూర్తితో.. రెండో విడతకు శ్రీకారం :
తొలివిడత కంటి వెలుగు విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్‌లో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్‌ ను స్టాల్స్‌ వారీగా నెలకొల్పారు.

LEAVE A RESPONSE