మోడీ ఇంటికి – మనం ఢిల్లీకి అంటే దేశ ప్రజలు ఎలా నమ్ముతారు?

– స్టాలిన్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ఎందుకు ముఖం చాటేశారో ?
– తన మాయలో పడే పార్టీలను కూడగట్టుకొనే పనిలో భాగమే ఈ భగీరథ ప్రయత్నం
– జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో ?

బిఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ వేదిక దృశ్యం చూసినప్పుడు “కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు” అన్న సామెత గుర్తుకొచ్చింది. బిఆర్ఎస్ “జాతీయ పార్టీ” అట. ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఇరుగపొరుగు రాష్ట్రాల ప్రాతినిథ్యం దుర్భిణీ వేసి వెతికినా కనపడలేదే! టీఆర్ఎస్, బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సందర్భంలో కనిపించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కనపడలేదు.

మనసున్న నాయకుడని ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఒకనాడు కొనియాడిన, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో! గతంలో తానే స్వయంగా వెళ్ళి శాలువాలు కప్పి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తదితరులు ఎందుకు ముఖం చాటేశారో! అలాగే తెలంగాణాకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో కలిపితే ఈ రాష్ట్రాల్లో 201 లోక్ సభ స్థానాలున్నాయి.

“ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి” అన్న నానుడి ఉన్నది. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో ప్రస్తుతం బిఆర్ఎస్(టీఆర్ఎస్)కు ఉన్నది 9 మాత్రమే. వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యను నిలబెట్టుకొంటారా! అన్నది సందేహమే. 543 స్థానాలున్న లోక్ సభలో నిన్నటి బిఆర్ఎస్ సభలో పాల్గొన్న ఐదు పార్టీలకు ప్రస్తుతం ఉన్న స్థానాలు 17. ఈ “బలం”తో “మోడీ ఇంటికి – మనం డిల్లీకి” అంటే దేశ ప్రజలు ఎలా నమ్ముతారు!

గుజరాత్ నమూనా అంటూ గద్దెనెక్కిన మోడీ దేశాన్ని అధోగతిపాలు చేసిన మాట నిజమే. తెలుగు జాతిని అధోగతి పాలు చేసిన కేసీఅర్ తెలంగాణ నమూనా అంటూ నేడు బయలుదేరాడు. లోక్ సభ ఎన్నికల కంటే ముందే ఈ ఏడాది చివరిలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ గట్టెక్కగలడా! లేదా! అన్నది తేలిపోతుంది.

తన బాధను దేశ బాధగా భావించి, తన చుట్టూ చేరి, తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి సహకరించమని తన మాయలో పడే పార్టీలను కూడగట్టుకొనే పనిలో భాగమే ఈ భగీరథ ప్రయత్నం. తెలంగాణ గడ్డపై, దేశంలో జరగబోయే చిత్రవిచిత్రాలను తెరపై తిలకిద్దాం!

-టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply