– రెండేళ్లయినా ఫ్లోర్‌లీడర్ లేని దుస్థితి
– ఈలోగా బీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు
– పట్టించుకోని కిషన్‌రెడ్డి, సంజయ్, లక్ష్మణ్
– మళ్లీ ఈనెల 24న ‘గ్రేటర్’ కౌన్సిల్ మీటింగ్
– కిషన్‌రెడ్డి ఉన్నందున పట్టించుకోని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్
-పార్టీ చూసుకుంటుందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
– కిషన్‌రెడ్డిని కాదని ఫ్లోర్‌లీడర్‌ను నియమించలేని రాష్ట్ర అధ్యక్షుడి నిస్సహాయత
– జీహెచ్‌ఎంసీలో బీజేపీకి పెద్ద దిక్కులేని దయనీయం
– సమన్వయం చేసుకోని జోనల్ ఇన్చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షులు
– గతంలో కార్పొరేటర్లతో జిల్లా అధ్యక్షుల వారాంతపు వ్యూహరచన భేటీలు
– కరుణాకర్, చింతల, రమణి జమానాలో వెలిగిన ఎంసీహెచ్ బీజేపీ
– ఫ్లోర్‌లీడర్ నియామకంపై ఇంతవరకూ కదలని బీజేపీ నాయకత్వం
– జిల్లా పార్టీలకు ఆఫీసు సెక్రటరీలు లేని దుస్థితి
– ఆరు జిల్లాలున్నా సమన్వయం సున్నా
– నగరంలో నడిపించే నాధుడు లేని వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజధాని నగరమైన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సాధించిన ‘అద్భుతవిజయం’, ఇప్పుడు అనాధగా మారింది. రెండేళ్ల క్రితం జరిగినగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 సీట్లతో, అద్భుత-అనూహ్య-అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. ఇప్పుడు అదే కార్పొరేషన్‌లో నాయకుడు లేని అనాధగా మారిన దుస్థితి. నాలుగుసార్లు సర్వసభ్య సమావేశాలు జరిగినా, ఇప్పటివరకూ బీజేపీకి ఫ్లోర్‌లీడర్ లేని దయనీయం. ఈలోగా నలుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌లోకి జంప్‌జిలానీలయ్యారు. మరికొందరు బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ గడ్డపై జెండా పాతేందుకు, వడి వడిగా అడుగులేస్తున్న బీజేపీ నాయకత్వం.. రాజధానిలోని కార్పొరేషన్‌కు ఫ్లోర్ లీడర్‌ను నియమించలేక, అడుగులు తడబడుతున్న నిస్సహాయపరిస్థితి, పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. జీహెచ్‌ఎంసీలో అనూహ్య విజయం సాధించిన బీజేపీకి, గత రెండేళ్లుగా ఫ్లోర్ లీడర్ లేని దుస్థితి, ఆ పార్టీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోంది.
ఫ్లోర్ లీడర్ నియామకంపై రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ కొన్ని పేర్లు తీసుకున్నా, ఇప్పటిదాకా ఎవరినీ ప్రకటించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈనెల 24న జీహెచ్‌హెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లోపయినా, ఫ్లోర్ లీడర్‌ను నియమిస్తారా? లేదా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
బీజేపీకి గుండెకాయ వంటి హైదరాబాద్‌లో.. భాగ్యలక్ష్మీ దేవాలయ సంద ర్శనలపై దృష్టి సారిస్తున్న పార్టీ నాయకత్వం, కీలకమైన కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నియామకానికి మాత్రం, ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోర్ కమిటీలో నగరానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి.. ఉన్నప్పటికీ ఫ్లోర్ లీడర్ నియామకంపై చర్చించకపోవడాన్ని, పార్టీ సీనియర్లు తప్పుపడుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌జీ సంఘటనా మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ, ఆయన కూడా ఈ విషయాన్ని విస్మరించారంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను 6 జిల్లాలుగా విభజించినప్పటికీ, కార్పొరేటర్లతో ఇప్పటివరకూ ఏ జిల్లా అధ్యక్షుడు గానీ, జిల్లా ఇన్చార్జిలుగానీ, జోనల్ ఇన్చార్జి ప్రదీప్‌కుమార్ గానీ, ప్రజా సమస్యల పరిష్కారంపై వ్యూహరచన చేసింది లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు 6 జిల్లా పార్టీ కార్యాలయాలకు, ఆఫీసు సెక్రటరీలే లేని దుస్థితి నెలకొందరి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో జీఆర్ కరుణాకర్, వెంకటరమణి నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు .. బీజేపీ ఎంసీహెచ్ ఎన్నికల్లో సొంతగా పోటీ చేస్తే, 12 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ తర్వాత చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉండగా, టీడీపీతో పొత్తు పెట్టుకుని 15 మంది కార్పొరేటర్లు గె లవడంతోపాటు, సుభాష్‌చందర్జీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయిన చరిత్ర ఉంది. కరుణాకర్, వెంటరమణి హయాంలో ప్రతి వారం.. కార్పొరేటర్లతో భేటీలు వేసి, నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చించే సంప్రదాయం ఉండేది.
అప్పట్లో ముత్యాలు, ఆ తర్వాత శ్యాంసుందర్‌గౌడ్ పార్టీ ఎంసీహెచ్ ఫ్లోర్ లీడర్లుగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఎవరు ఏ సమస్యపై మాట్లాడాలన్న దానిపై, ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. అసలు ఇప్పటివరకూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు.. కనీసం శిక్షణా శిబిరాలు గానీ, సీనియర్ కార్పొరేటర్లు- సీనియర్ నాయకులతో నగర సమస్యలకు సంబంధించి, శిక్షణా తరగతులు గానీ ఇప్పించిన దాఖలాలు లేవు. దీన్నిబట్టి నాయకత్వం, హైదరాబాద్‌లో పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నగర మాజీ అధ్యక్షుడు కరుణాకర్, వెంకటరమణి, వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్జీ వంటి అనుభవజ్ఞుల సేవలను.. వినియోగించుకోకపోవడంపై, సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఫ్లోర్ లీడర్ ఎంపిక విషయంలో , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి-రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య అవగాహన కుదరకపోవడమే, ఆలస్యానికి కారణమంటున్నారు. కోర్ కమిటీలో హైదరాబాద్ నగరం నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, అందులో జోక్యం చేసుకునేందుకు బండి సంజయ్ ఇష్టపడటం లేదని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర అధ్యక్షుడే తేల్చాలని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
కిషన్‌రెడ్డి మాత్రం తనను కలిసిన వారితో.. అది పార్టీ చూసుకుంటుందని చెబుతున్నారట. ఈ విధంగా రాష్ర్టానికి ముగ్గురు ఇన్చార్జిలు, ఒక కేంద్రమంత్రి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు-ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పటికీ, కీలకమైన ఫ్లోర్ లీడర్ నియామకంపై, ఎవరూ దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరి ఈనెల 24న జరగనున్న, జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లోపయినా.. ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేస్తారో లేదో చూడాలి.