జగన్‌రెడ్డి రథ చక్రాల కింద నలుగుతున్న ఆర్టీసీ రథ చక్రాలు

-ఆర్టీసీ భూములు దోచుకునేందుకే ప్రభుత్వ పరమనే నాటకం
ముఖ్యమంత్రి జేబు సంస్థలా మారిన ఆర్టీసీ
-వద్దు వద్దు అంటున్నా వినకుండా ప్రభుత్వ పరం చేసి బోల్తా పడ్డ ఆర్టీసీ యూనియన్ లు
– ఆర్టీసీ మాజీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వద్దు వద్దంటున్నా వినకుండా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు. భవిష్యత్ లో ఆర్టీసీలోని ఖాళీ స్థలాలన్ని వైకాపా పరం అవుతాయి. అందుకు తాజా ఉదాహరణ బాపట్లలో రెండు ఎకరాల భూమిని వైకాపాకి అంకితం చేయడమే. చోధ్యం చూస్తున్న ఆర్టీసీ ఛైర్మన్ మరియు ఆర్టీసీ ఎం.డీ. ఆర్టీసీ స్థలాలు ఆర్టీసీ ఆర్ధిక పరిపుష్టికి మాత్రమే ఉపయోగించుకోవాల్సింది పోయి, వైకాపా లబ్ది కోసం తక్కువ ధరలకు వారికి అంకితం చేయడం ప్రభుత్వ దగుల్బాజితనానికి నిదర్శనం.

ఆర్టీసీ స్థలాలను కొట్టేసేందుకే ఈ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంది. కార్పొరేషన్ గా కొనసాగితే ఆర్టీసీ స్థలాలను కొట్టేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండేది కాదు. ప్రభుత్వ సంస్థల భూములను ఒక వైపు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవడమే గాక మరోక వైపు స్వప్రయోజనాల కోసం ఆర్టీసీ స్థలాలను అమ్మేయడం అమానుషం, అరాచకం.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపో పరిధిలోని ఖాళీ స్థలాలను బీవోటీ ప్రాతిపదికన 33 సంవత్సరాల లీజుకిచ్చి ఆర్టీసీ ఆర్ధిక స్థితిని పెంచుకోండని చెబితే, ఆర్టీసీ స్థలాలను రాజకీయ లబ్ది కోసం వైకాపా పార్టీకి నామమాత్రం ధరలకు అంకితం చేయడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. కార్పొరేషన్ గా కొనసాగినట్లైతే ఆర్టీసీ స్థలాలు రాజకీయ పార్టీ లబ్దికి వశపరిచే అవకాశం ఉండేది కాదు.

ఈ ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి దొడ్డిదారిన ఆర్టీసీ స్థలాలను అధికారపార్టీ కొట్టేస్తున్నది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆర్టీసీ స్థలాల కబ్జాను వెంటనే ఆపాలి. ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికైనా నోరుతెరిచి ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఆర్టీసీ ఛైర్మన్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించకూడదు. ఆర్టీసీ ఎండీ కూడా అవసరమైతే న్యాయస్థానాలను సంప్రదించి ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.

Leave a Reply