Suryaa.co.in

Editorial

కిషన్‌రెడ్డి.. కాళేశ్వరం.. ఒక సీబీఐ

– కిషన్‌రెడ్డికి ‘సీబీఐ’ సంకటం
-తెలంగాణ బీజేపీకి ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు కష్టాలు
– కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలన్న కిషన్‌రెడ్డి
– ప్రభుత్వం లేఖ రాస్తే రెండు గంటల్లోనే విచారణ ప్రారంభిస్తామన్న కిషన్‌రెడ్డి
– కేసీఆర్‌ సర్కారు అనుమతి అవసరం లేదన్న సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు
– కేంద్ర జలవనరుల శాఖ ఫిర్యాదు చేస్తే చాలని స్పష్టీకరణ
– నాగేశ్వర్‌రావు వివరణతో సంకటంలో కిషన్‌రెడ్డి
– సీబీఐ విచారణ జరిపిస్తారా? లేదా?
– నిన్నటి వరకూ కేసీఆర్‌ ఫ్యామిలీకి కాళేశ్వరం ఏటీఎం అని కమలదళం ఆరోపణలు
– విచారణ జరిపిస్తేనే బీజేపీపై ప్రజల్లో నమ్మకం
– లేకపోతే మళ్లీ బీజేపీ-బీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ అనుమానాలు తెరపైకి
– కిషన్‌రెడ్డి కిం కర్తవ్యం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ కమలదళపతి-కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి ‘కాళేశ్వరం కష్టం’ వచ్చిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ముందుకు వచ్చి లేఖ రాస్తే.. తాను రెండుగంటల్లో సీబీఐ విచారణ చేయిస్తానని, కిషన్‌రెడ్డి ఇటీవల మీడియాకు స్పష్టం చేశారు. అంటే.. నేరుగా తాము కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ చేయించలేమని కిషన్‌రెడ్డి చెప్పకనే చెప్పారన్నమాట.

నిజానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ లేఖ రాయడమో, లేదా కోర్టులు ఆదేశిస్తే తప్ప సీబీఐ విచారణ జరగదు. గతంలో జగన్‌ కేసు కూడా కోర్టు ఆదేశాలతో జరిగినదే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కూడా కేసీఆర్‌ సర్కారే సీబీఐకి లేఖ రాయాలన్నది కిషన్‌రెడ్డి వాదన. ఈ విషయంలో కేంద్రానికేం బాధ్యత-అధికారాలు లేవన్నది, కిషన్‌రెడ్డి కవిహృదయంలా కనిపించింది.

అయితే సీబీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన రిటైరైన మాజీ డైరక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు ఇచ్చిన వివరణ, కిషన్‌రెడ్డిని రాజకీయంగా కష్టాల్లో పడేసింది. ఆయన విశ్వసనీయతకు పరీక్షగా మారింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. బీజేపీ-బీఆర్‌ఎస్‌ బంధంపై ఇప్పటివరకూ ఉన్న అనుమానాలకు పెను పరీక్షగా నిలిచింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుమతి అవసరం లేదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందే కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలని ఆయన గుర్తు చేశారు. కాబట్టి కేంద్ర జలవనరుల శాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తే సరిపోతుందని నాగేశ్వరరావు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఓ అద్భుతమైన పరిష్కారమార్గం సూచించారు.

‘‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం కేంద్రజలవనరుల శాఖ సీబీఐకి లేఖ రాయవచ్చు. విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులని తేలితే, అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం, వారిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం’’ అని సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు.

దానితో సహజంగా కాళేశ్వరం విచారణ బంతి కిషన్‌రెడ్డి కోర్టులో పడింది. సీబీఐ డైరక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన నాగేశ్వరరావు వంటి అనుభవశాలి, సెక్షన్లు కూడా ఉటంకిస్తూ చేసిన సూచనల ప్రకారం.. కిషన్‌రెడ్డి అర్జెంటుగా కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి, కేంద్రజలవనరుల శాఖతో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేయకతప్పేలా లేదు. నాగేశ్వరరావు చెప్పినట్లు ఎలాగూ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రమే అనుమతి ఇచ్చింది కాబట్టి, సీబీఐ విచారణకు ఇక కేసీఆర్‌ అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన బృందానికి కిషన్‌రెడ్డి నాయకత్వం వహించారు. మేడిగడ్డ కుంగుబాటును పరిశీలించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డితోపాటు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌-పీసీసీ చీఫ్‌ రాహుల్‌ కూడా మేడిగడ్డ పరిస్ధితిని పరిశీలించారు.

కేవలం కాంట్రాక్టర్లను బతికించేందుకు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని రేవంత్‌రెడ్డి నుంచి షర్మిలారెడ్డి వరకూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మేఘాతో కుమ్మక్కయి, కేసీఆర్‌ సర్కారు అన్ని ప్రాజెక్టులూ ఆ కంపెనీకే కట్టబెడుతోందని షర్మిల ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఎలాగూ కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి.. కేంద్రజలవనరుల శాఖ మంత్రితో కిషన్‌రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి, సీబీఐ విచారణకు ఆదేశిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్కంఠ కలిగిస్తున్నాయి.

లిక్కర్‌ కేసులో కవితను అరెస్టు చేయకపోవడం, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వంతో విచారణ మాత్రం చేయించలేకపోవడం, బీజేపీ నేతలు ప్రచారంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై కాకుండా, ప్రతిపక్ష కాంగ్రెస్‌పైనే ఆరోపణలు చేస్తున్న పరిణామాలు ఆ రెండు పార్టీలూ ఒకటేనన్న భావన స్థిరపడేందుకు కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాళేశ్వరం రూపంలో అందివచ్చిన బీఆర్‌ఎస్‌ జుట్టును, బీజేపీ అందిపుచ్చుకుని అధికారపార్టీని ఎన్నికల సమయంలో ఆగం చేస్తుందా? లేక యథాప్రకారంగా తమ ఆరోపణలను మీడియా కాలక్షేపానికి పరిమిత ం చేసి, బీఆర్‌ఎస్‌ను సీబీఐ విచారణ గండం నుంచి గట్టెక్కిసుందా? అన్నది కిషన్‌రెడ్డి సమర్ధతపై ఆధారపడి ఉంది. ఆయన వేగం-కేంద్ర స్పందన బట్టి.. కేసీఆర్‌ సర్కారుకు కాళేశ్వరం మెడకు ఉచ్చు, ఎంతగట్టిగా బిగిస్తుందన్న అంశం ఆధారపడి ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కిషన్‌రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర వనరుల శాఖ మంత్రితోపాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా, హోంమంత్రి అమిత్‌షా దృష్టికి ఎప్పటిలోగా తీసుకువెళతారు? ఎప్పటిలోగా సీబీఐ విచారణకు ఆదేశిస్తారు? అంతా సక్రమంగా జరిగితే సీబీఐ ఎప్పుడు విచారణ ప్రారంభిస్తుంది? ఎన్నికల ముందా? ఎన్నికల తర్వాతనా? అన్న అంశాలు, కేంద్రమంత్రి కూడా అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చిత్తశుద్ధి-బీజేపీని గెలిపించాలన్న ఆయన విశ్వసనీయతకు పరీక్ష అన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అయితే సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు వివరణ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీము కాబట్టే లిక్కరు కేసులో కవితను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందంటున్నారు. మేం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, కేసీఆర్‌ కమిషన్లపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీబీఐ విచారణకు కేసీఆర్‌ లేఖ అవసరం లేదని సీబీఐ మాజీ డైరక్టరే స్పష్టం చేశారు.

మరిప్పుడు కిషన్‌రెడ్డి ఏం చేస్తారో చూద్దాం. సీబీఐ విచారణకు ఆదేశించకపోతే, బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమని తెలంగా ప్రజలకు మరోసారి స్పష్టవుతుంది. విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. కిషన్‌రెడ్డి కేసీఆర్‌ వైపా? ప్రజల వైపా అన్నది తేల్చాలి’’ అని అయోధ్యరెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE