వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి. అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాప గ్రస్తుడయ్యాడని కథ.
జ్ఞానం దైవ ప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించిన వాడు). ఆయనకు కృష్ణ ద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని.
కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉంటారు వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. గురు నానక్ దేవ్ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు. మనలో కూడా కొందరు బాలమేధావులుంటారు. సంగీతం, నృత్యం వంటి కళా రంగాల్లో వారు ప్రసిద్ధులు. కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది గౌరవానికి నోచుకుంటుందో వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు.
ప్రపంచ సంపదలకు హెచ్చు తగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది.విదురుడు కారణ జన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటి వారికి నీతి బోధ చేసినవాడు. అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం.
జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవ స్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు.దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు.. జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది.
ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం.
ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధ విద్యార్థితో ఆదిశంకరులు.. ‘ఓ మూఢుడా.. మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు.
ఈ సలహా అందరికీ వర్తిస్తుంది. భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే.. శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తి మార్గంలో స్థిరచిత్తులై ఉంటారు. భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు.
– ఆర్కే