హిందూ సంప్రదాయాల ప్రకారం మనిషి అమ్మ కడుపులో పడినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా కార్యాలు చేస్తారు. ముఖ్యంగా చనిపోయిన తర్వాత, అనేక రకాల తంతులు నిర్వహిస్తుంటారు. అయితే ఇంట్లో ఎవరైనా చనిపోయిన పదకొండో రోజున కుటుంబ సభ్యులంతా వెళ్లి శివాలయ నిద్ర చేయాలంటారు.
అలా ఎందుకు చేయాలో మనకు తెలియకపోయినప్పటికీ. శివాలయ నిద్ర చేసే ఉంటాం. అయితే అసలు అలా ఎందుకు చేయాలి? చేస్తే ఏం వస్తుందనే అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా చనిపోతే కొన్ని రోజుల వరకూ ఇంటి వారందరూ కకావిక స్థితిని అనుభవించాల్సిందే. ముఖ్యంగా ఇంటి పెద్ద చనిపోతే.. యంత్రాంగం నడిపించే వారు లేక, నానా అవస్థలు పడాల్సి వస్తుంది.కుటుంబ సభ్యుడు చనిపోయాడనే బాధతో. వారి లోటును తీర్చుకోలేక తట్టుకోలేకపోతుంటారు. వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి. చనిపోయిన వారు లేకుండా జీవితాన్ని ఎలా గడపాలనేది అర్థం కాక కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటారు. అయితే అలాంటప్పుడే పోయిన వారితో మనం పోదామనిపిస్తుంది. అభద్రతా భావం హృదయాన్ని కుదించి వేస్తుంది. ఈ సమయంలో మనశ్శాంతి కోసం ఆత్మశక్తి కుదించి వేస్తుంది. శివాలయంలో ఒక్కరోజైనా ఉండి వస్తే ధైర్యం లభిస్తుందని, పరిస్థితులన్నీ చక్కబడి ప్రశాంతత దొరుకుతుందని పండితులు చెబుతారు. అందుకే శివాలయంలో దేవుని దగ్గర కూర్చొని ఆలోచించుకుంటే, దేనికైనా దేవుడున్నాడులే అనే ధైర్యం వస్తుందట. మన వెనుక ఒకరున్నారనే భావన కల్గుతుందట. అందుకే ఇంట్లో ఎవరైనా చనిపోతే శివాలయ నిద్ర చేయాలని అంటుంటారు…చేస్తుంటారు కూడా.
– ఎంబిఎస్ గిరిధర్‌రావు