– రాజీనామా తర్వాత మీడియాతో కొడాలి
– 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం
ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) కీలక వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని చెప్పిన నాని.. తాను కూడా అందరి మాదిరిగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొందరికి స్థానం ఉంటుందని చెప్పిన నానికి మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది.
ఈ సందర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అన్న ప్రశ్నకు స్పందించిన నాని… కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని వ్యాఖ్యానించారు. కొత్త కేబినెట్‌లో తనకు స్థానంపై అవకాశాలు తక్కువేనని ఆయన చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశామని చెప్పారు.
ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ చెప్పారన్నారు. మంత్రి పదవులకు తాము రాజీనామా చేస్తుంటే..జగన్ ఎక్కువగా బాధ పడినట్టుగా కనిపించిందని, అయితే తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని,. మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదని నాని వ్యాఖ్యానించారు.