Home » కొంపలో కుంపటి!

కొంపలో కుంపటి!

– జగన్ పార్టీకి కుటుంబపోరు
– జగన్‌పై చెల్లెళ్ల తిరుగుబాటు
– షర్మిల ప్రశ్నలకు జగన్ ఉక్కిరిబిక్కిరి
– వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ నిందలు
– జగనన్నకు మెదడు పనిచేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు
– బూడి ముత్యాలనాయుడికి ఓటేయద్దన్న సొంత కొడుకు
– మా నాన్నకు ఓటేయద్దని రోడ్డెక్కిన పుత్రరత్నం
– మా నాన్నను నమ్మవద్దన్న ముగ్రగడ కూతురు క్రాంతి చైతన్య
– పవన్‌కు చేయెత్తి జైకొట్టిన ముద్రగడ కూతురు
– అంబటి నీచుడు, నికృష్టుడంటూ సొంత అల్లుడి తిట్లపురాణం
– ముద్రగడ బిడ్డ, అంబటి అల్లుడి వీడియోలతో ‘ఫ్యాను’ ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలుస్తుంటారు. కానీ జగనన్న ప్రభుత్వ పాలసీ మాదిరిగానే పూర్తి రివర్సు. రచ్చ గెలిచి, ఇంట ఓడి రోడ్డున పడుతున్న విషాదం. వైసీపీ అధినేత జగనన్న పులివెందుల నుంచి సత్తెనపల్లి అంబటి రాంబాబు వరకూ… అనకాపల్లి బూడి ముత్యాలనాయుడు నుంచి పిఠాపురం ముద్రగడ పద్మనాభం వరకూ.. అందరికీ కొంపలో కుంపట్లే! ఈ కుటుంబ కొట్లాటలు రోడ్డెక్కడంతో ఫ్యాను ఉక్కిరిబిక్కిరవుతోంది. కంపకొల్లేరయిన వైనం, అధికారపార్టీకి అవస్థలు తెచ్చిపెడుతోంది. ఇదీ.. మండు వేసవిలో వైసీపీ నేతల కొంపలో కాలుతున్న కుంపటి కథ!

కొంపకొల్లేరయింది.. కొంపలో కుంపటి అని పాతకాలంలో తరచూ వినిపించే సామెతలు. అవి ఇప్పుడు ఎన్నికల సమయంలో, వైసీపీ కొంపను కొల్లేరుచేస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు- మంత్రులు- చివరాఖరకు పార్టీ అధినేత ఇంట్లోనే కొట్లాటల కొలిమి అధికారపార్టీకి వేడిపుట్టిస్తోంది.

స్వయంగా పార్టీ అధినేత జగనన్న ఇంట్లోనే కొట్లాట కొలిమి రాజుకుంది. సొంత చెల్లి షర్మిల- చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత.. జగనన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా జగనన్న పార్టీకి ఓటేయద్దని కోరింది. ‘‘చిన్నాన్న హంతకుడు అవినాష్‌రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చావు? అసలు నీవు అన్నవేనా? నీకు మైండ్ పనిచేస్తుందా? లేదా? తండ్రిని చంపారన్న రిలయన్స్ కంపెనీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఎలా ఇచ్చావ్? నా ప్రశ్నకు సమాధానం చెప్పాల’’ంటూ షర్మిల, ఇల్లుపీకి పందిరేస్తోంది. జగనన్నపై రోజూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అటు జగన్ కూడా షర్మిల తన తండ్రికి వారసురాలు కా, ఖరాఖండీగా నిండు సభలోనే సెలవిచ్చారు. ఆవిధంగా పులివెందుల పంచాయితీ విజయవంతంగా నడుస్తోంది.

ఇక కాపుజాతిపితగా తనను తాను ఊహించుకునే మాజీ మంత్రి మద్రగడ పద్మనాభం ఇమేజ్ కొండంత. ఆయన పిలిస్తే వేలమంది వచ్చేస్తారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒకప్పుడు ముద్రగడ మాట కాపులకు శాసనం. ఇప్పుడాయన పిఠాపురంలో

జనసేన దళపతి పవన్‌ను ఓడించేందుకు, కంకణాలు-కడియాలు కట్టుకుని తిరుగుతున్నారు. పవన్‌ను ఓడించకపోతే, తాను పేరు మార్చుకుంటానని ‘పద్మయ్య శపథం’ చేశారు. అంతలావు ముద్రగడకూ కొంపలో కుంపటి తప్పకపోవడమే ఆశ్చర్యం. ‘ మా నాన్న మాటలు నమ్మకండి. ఆయనను జగన్ మోసం

చేస్తున్నారు. మా నాన్న పవన్‌ను అకారణంగా తిడుతున్నారు. నా ఓటు పవన్‌కే’’ అని కుండబద్దలు కొట్టి, నాన్నారి పరువును రోడ్డెక్కించారు. దానితో ముద్రగడకు సొంతింట్లోనే ఠికాణా లేదని కాపులకు తెలిసిపోయింది.

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలరాజు ఇంటి కథ ఇంకో విచిత్రం. ఇంతకూ కథేమిటంటే.. ముత్యాల నాయుడుకు ఇద్దరు భార్యలట. అందులో మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్. కొద్దిరోజుల క్రితం ‘‘మా నాన్న ముత్యాలనాయుడుకు ఓటేయకండి. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాడు ప్రజలకేం చేస్తారు’’? అని కోడై కూస్తున్నారు.

మొదటి భార్య తమ్ముడు అంటే బామ్మర్ది గంగాధర్ బీజేపీ నాయకుడు. తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ ను అరెస్టు చేసిన సందర్భంలో ఎంటరయిన బూడి ముత్యాలనాయుడు, ఆ ఆవేశంలో తన బామ్మర్ది గంగాధర్‌ను చెప్పుతో కొట్టిన వైనం కలకలం రేపింది. ‘ మా నాన్నకు ఓటేయకండి. ఆయనను ఓడించండి’’ అంటూ బూడి రవికుమార్ సోషల్‌మీడియా వేదికగా చేస్తున్న రచ్చ, ముత్యాలనాయుడు కొంప కొల్లేరు చేస్తో ంది.

లేటయినా లేటస్టుగా మంత్రి అంబటి ఇంట్లోనూ ఇలాంటి రాం‘బాంబే’ పేలింది. ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చే అంబటి రాంబాబుపై.. సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ తాజాగా విడుదల చేసిన వీడియో, సత్తెనపల్లిని షేక్ చేస్తోంది. ‘సత్తెనపల్లిలో పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మినిష్టర్ అంబటి రాంబాబు మా మామ. అది చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అది నా దురదృష్టం. అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు.

దరిద్రుడు. శవాలపై పేలాలుఏరుకునే వాడు. ఇలాంటి వాడిని నా జీవితంలో చూడలేదు. ఎలాంటి విలువలు లేని వ్యక్తిని మళ్లీ అందలమెక్కించకండి. నేను రోజూ దేవుడిని ప్రార్ధించే సమయంలో రాంబాబు లాంటి నీచుడిని జీవిత ంలో పరిచయం చేయవద్దని కోరుకుంటా. కనీస మానవత్వ విలువ లేని రాంబాబుకు ఓటేయకండి’’ అంటూ సొంత అల్లుడు విడుదల చేసిన వీడియో, ఇప్పుడు సత్తెనపల్లి ప్రజల ఇంట్లో చర్చనీయాంశమయింది.

నిస్సిగ్గుగా, ఎంత లేకి పనయినా చేసి సమాజంలో పెద్దగొంతేసుకుని బతికే రాంబాబును ఎంచుకోకుండా, బాధ్యతతో సరైన నాయకుడిని ఎన్నుకోండి అన్న పిలుపు సత్తెనపల్లిలో వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా మారాయి. ఆటోమేటిక్‌గా అటు వైసీపీకి సైతం, అంబటి అల్లుడి యవ్వారం తలపోటుగా మారింది. ఈ వీడియో చూస్తే ఒక్క మహిళ కూడా, వైసీపీకి ఓటు వేయరన్న ఆందోళనే దానికి కారణంగా కనిపిస్తోంది.

Leave a Reply