Suryaa.co.in

Andhra Pradesh

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను..

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేనాని ప్రమాణ స్వీకారం
  • కొలువుదీరిన కూటమి ప్రభుత్వం
  • అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారోత్సవం
  • ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ
  • ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
  • జనసేన పార్టీ నుంచి మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందోత్సాహాలలో మునిగితేలారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను… ఈ మాటలు వినపడగానే సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలోని సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, కేసరపల్లి ఐటీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.

రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రితో సహా మొత్తం 25 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నుంచి గెలుపొందిన ఎంపీలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , సీనియర్ రాజకీయ ప్రముఖులు విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు పద్మవిభూషణ్ చిరంజీవి , అగ్ర కథానాయకులు రజనీకాంత్ రాష్ట్ర ప్రభుత్వ అతిధులుగా హాజరయ్యారు.

అపురూప ఘట్టం
పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టగానే అశేష జనవాహిని కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నంతసేపు సభకు హాజరైన ప్రజానీకం గౌరవ సూచకంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య అనా కొణిదెల తన్మయత్వంలో మునిగిపోయారు. సభా ప్రాంగణంపై ఆశీనులైన పవన్ కళ్యాణ్ సోదరులు పద్మవిభూషణ్ చిరంజీవితోపాటు కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

చిరంజీవికి పాదాభివందనం
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వేదికపై ఆశీనులైవున్న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి నమస్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆత్మీయంగా కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియచేశారు. అనంతరం వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు. చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ప్రధాన మంత్రి మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి సత్కరించారు. వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం మోదీతో కలసి వేదికపై ఆశీనులై ఉన్న పెద్దలందరినీ పలకరించారు.

మోదీ – పవన్ కళ్యాణ్ , చిరంజీవితో కలసి ప్రజలకు అభివాదం చేస్తూ ఫోటోలు దిగారు. వీరితో ప్రధానమంత్రి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ దృశ్యం ఆహుతులను ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిన కుటుంబ సభ్యులు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మెగా కుటుంబం మొత్తం తరలి వెళ్లింది. కుటుంబం మొత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు ఒక రోజు ముందుగానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబం మొత్తం విజయవాడకు చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో బస చేసిన పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి కుటుంబం, నాగబాబు కుటుంబం,  పవన్ కళ్యాణ్ కుటుంబం ఉదయం గం.9.30 నిమిషాలకు వేదిక వద్దకు చేరుకున్నారు.

LEAVE A RESPONSE