నర మాంసానికి అలవాటు పడ్డ కుటుంబం పులులతో పోల్చుకుంటోంది
నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారు
తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేంత వరకు మీడియా సంయమనం పాటించాలి. పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి.నిర్ణయాలు జరిగితే మీడియాకు వెల్లడిస్తాం.సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటాం.వారి వారి హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్ కమిటీని నియమించారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ సభ్యులు ఇంచార్జ్ ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ , జానారెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. కొందరు అధికారులు బీఆరెస్ కు కొమ్ముకాస్తున్నారు.అలాంటి అధికారులపై పీఏసీ సమావేశంలో చర్చించాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు నిధులు విడుదల చేస్తున్నారు. పెన్షన్ తప్ప మిగతా వాటికి ఎన్నికలయ్యేవరకు ఎలాంటి నిధులు విడుదల చేయొద్దు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని బీఆరెస్ ప్రయత్నిస్తోంది.
బీఆరెస్ కు కొమ్ముకాసే పోలీస్, ఐఏఎస్, రెవెన్యూ, అన్ని విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోంది. మేం నియమించిన ప్రత్యేక కమిటీ ఆ వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుంది. రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్ పై అపోహలు సృష్టిస్తోంది. తప్పుడు వార్తలు వేసే మీడియా యజమాన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. తప్పుడు వార్తలు వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.
కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై అధికారంలోకి రాగానే సమీక్షిస్తాం.భూముల అమ్మకాలనూ సమీక్షిస్తాం.కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగానే ప్రభుత్వం పని చేయాలి.నియమ నిబంధనలు ఉల్లంఘించి బీఆరెస్ కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవు.
హైదరాబాద్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని మెట్రో హైదరాబాద్ వారికి సూచిస్తున్నా.బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వచ్చాయి. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా.. లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటాం. నర మాంసానికి అలవాటు పడ్డ కుటుంబం పులులతో పోల్చుకుంటోంది. తండ్రిని జంతువుతో కేటీఆర్ కరెక్ట్ గా పోల్చారు.