Suryaa.co.in

Telangana

కేటీఆర్ గురువింద నీతులు మానుకోవాలి

– బండి సంజయ్ పాదయాత్ర కు జనం స్పందనతో హైబత్ లో కేటీఆర్
– సంజయ్ ప్రకటించిన ఉచిత విద్య, వైద్యం తో తమ పునాదులు కదిలాయని గుర్తించిన యువ రాజు
– తమ వైఫల్యాలను పక్కడివ పట్టించేందుకు మోడీ గారి విమర్శలు
– బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప

గుడిని గుడిలో లింగాన్ని మింగేటోళ్లా ప్రధాని మోడీ గారి గురించి మాట్లాడేది అంటూ కేటీఆర్ పై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కు ప్రజల నుంచి భారీ స్పందనరావడంతో కేటీఆర్ హైబత్ తిన్నారని సంగప్ప పేర్కొన్నారు. ఉచితాలు వద్దని మోడీ గారు ఎప్పుడు అనలేదని కేటీఆర్ఒ క పచ్చి అబద్ధాన్ని సృష్టించి బట్ట కాల్చి మీద వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో సంజయ్ ప్రకటించిన ఉచిత విద్య, వైద్యం తో తమ పునాదులు కదిలాయని కేటీఆర్ గుర్తించారని, అందుకే ఈ గజకర్ణ, గో కర్ణ విద్యల్ని ప్రదర్శిస్తున్నారని సంగప్ప ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి మోడీ గారు
ఏ రోజు కూడా ఉచిత పథకాలపై కామెంట్ చేయలేదని యాదాద్రి భువనగిరి జిల్లా లో ప్రజా సంగ్రామ యాత్ర లో ఉన్న సంగప్ప వివరించారు.

సుప్రీం కోర్ట్ ఉచిత పథకాల పైన చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ వక్రీకరించి ప్రధాని నరేంద్ర మోడీ గారిపై రుద్దాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇల్లు లేని 20 కోట్ల మందికి ఇల్లు కట్టివ్వాలని మోడీ గారు నిర్ణయించిన విషయం కేటీఆర్ కు తెలియదా అని సంగప్ప ప్రశ్నించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు రూ.6 వేలు మోడీ ఇవ్వట్లేదా అని సంగప్ప గుర్తు చేశారు. రైతుల కోసం కేవలం ఎరువుల సబ్సిడీపైనే ఏటా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అని సంగప్ప వివరించారు. పేద ప్రజల కోసం తీసుకునే సంక్షేమ పథకాలను, ఉచిత పథకాలను మోడీ గారు సమర్థిస్తారని, ఆయన పేదల పక్షపాతి అని సంగప్ప చెప్పారు.

కెసిఆర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఉచిత పథకాలను పెద్దలకు కట్ట పెడుతుందని దుయ్యబట్టారు. కాకులను కొట్టి గద్దలకు కట్టబెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వమీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ కు సంగప్ప సూచించారు.చిన్న సన్న కారు రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కట్టబెడుతుంది కేసీఆర్ కాదా అని సంగప్ప ప్రశ్నించారు.

రైతులకు ఇవ్వాల్సిన ఉచిత కరెంటును కోటీశ్వరుల ఫామ్ హౌస్ లకు ఫ్రీగా ఇస్తున్నారని ఆయన చెప్పారు. మంత్రులు, టీఆరెస్ పార్టీ నాయకులు ఒక్కో ఫామ్ హౌస్ కి 25 నుంచి 40 గ్రామాల కు సరిపోయే కరెంటును ఫ్రీగా వాడుకుంటున్నారని, ఇది కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు కాదా అని సంగప్ప మండి పడ్డారు.

65 ఏళ్లలో గత పాలకులు బ్రష్టు పట్టించిన భారత దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని సంగప్ప కొనియాడారు. కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే మన దేశ ఆర్థిక స్థితిని పడిపోకుండా నిలబెట్టిన ఘనత మోడీ గారిది అని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమ ఒకవైపు, అభివృద్ధి మరోవైపు, దేశ ఆర్థిక స్థితి నిలబెట్టడం ఇంకోవైపు… అన్నింటికీ మించి ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని తలెత్తుకునేలా నిలబెట్టే కార్యాన్ని మోడీ విజయవంతంగా నిర్వహిస్తున్నారని సంగప్ప అన్నారు.

అదనపు ఆదాయంతో ఏర్పడ్డ తెలంగాణను 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన అసమర్థ, అవినీతి పాలన కెసిఆర్ ది అని సంగప్ప ఫైర్ అయ్యారు.రాష్ట్రం లో బండి సంజయ్ నేతృత్వం లోని బీజేపీ త్వరలోనే కుటుంబ పాలనకు ముగింపు పలికి కేసీఆర్ ను ఫామ్ హౌజ్ కి పంపడం ఖాయమని సంగప్ప జోష్యం చెప్పారు. మరొకసారి మోడీ గురించి కామెంట్ చేసే ముందు ఆలోచించుకోవాలని కేటీఆర్ కు ఆయన హెచ్చరించారు.

 

LEAVE A RESPONSE