- డిప్యూటీ స్పీకర్‌గా కాలవ శ్రీనివాసులు?
- సీమలో బోయలకు పట్టం
- కాలవకు కలసిరానున్న శాసనవ్యవస్థపై పట్టు, పూర్వానుభవం
- చీఫ్ విప్ రేసులో ఆంజనేయులు, ధూళిపాళ్ల, చింతమనేని?
- అయినా కూనకే ఎక్కువ అవకాశం?
- ఆయనపై జగన్ జమానాలో 16 కేసులు, తమ్మినేనిపై పోరాటం
- రవికి పదవితో కళింగ సామాజికవర్గానికి అందలం
- శ్రీకాకుళంలో ఇప్పటికే ఇద్దరు బీసీ వెలమకు మంత్రి పదవులు
- సామాజిక సమతుల్యం కోసమే రవికి చీఫ్ విప్ పదవి
- తనకు ఆసక్తిలేదంటున్న కూన రవికుమార్
- మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అలక?
- కూన వద్దంటే జీవీకిచాన్స్?
- ఈసారి కొత్తగా 14 మంది విప్‌లు?
- రెండు జనసేన, ఒకటి బీజేపీకి
- ఈ వారంలో నిర్ణయం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రివర్గం తర్వాత మిగిలిపోయిన శాసనసభ పదవులపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటికీ ఇప్పటివరకూ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేయకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. పదవుల భర్తీ విషయంలో తమ పార్టీ అధినేత మళ్లీ తన పాత బాటలోనే నడుస్తున్నారని, ఈ విషయంలో ఆయన ఏమీ మారలేదన్న వ్యాఖ్యలు ఎమ్మెల్యేలలో వినిపిస్తున్నాయి.
పదవుల భర్తీలో గతంలో మాదిరిగానే తమ అధినేత నాన్చుడు విధానం అవలంబిస్తున్నారన్నది వారి అలకకు కారణం. వైసీపీ అధినేత జగన్ పదవుల విషయంలో.. శరవేగంగా నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని వారు తమ అధినేతతో పోల్చుకుంటున్నారు. ఐదేళ్లలో జగన్ వందలమందికి పదవులిచ్చిన వైనాన్ని, వారు తమ అంతర్గత సంభాషణలలో చర్చించుకుంటున్నారు.
దీన్ని గ్రహించిన చంద్రబాబునాయుడు.. శాసనసభలో పెండింగ్ పదవులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారంగా కీలకమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపై కసరత్తు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ వారంలో వాటిని ప్రకటించవచ్చంటున్నారు. ఆ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన బోయ నేత, వివాదరహితుడైన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా రాయలసీమలో అధికంగా ఉన్న బోయ వర్గాన్ని సంతృప్తిపరచవచ్చన్నదే ఆ నిర్ణయం వెనుక వ్యూహమంటున్నారు. పైగా ఎంపి, చీఫ్ విప్, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా కాలవకు కలసిరానుంది. డిప్యూటీ స్పీకర్‌గా కాలవ ఎంపిక దాదాపు ఖాయమంటున్నారు.
ఇక చీఫ్ విప్‌గా సీనియర్ ఎమ్మెల్యే, కళింగ సామాజికవర్గానికి చెందిన కూన రవికుమార్‌కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయనకు గతంలో విప్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. జగన్ జమానాలో తన సొంత బావ, మాజీ స్పీకర్ త మ్మినేని సీతారాం ఆయనపై 16 అక్రమ కేసులు పెట్టగా, జైలుకు సైతం వెళ్లాల్సివచ్చింది. గత ఎన్నికల్లో ఆయన తమ్మినేనిని ఓడించిన విషయం తెలిసిందే.
పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో, కళింగ సామాజికవర్గీయుల సంఖ్య ఎక్కువ. అన్ని వర్గాల్లోనూ వారిదే పైచే యి. అయితే బీసీ వెలమ అయిన అచ్చెన్నాయుడుకు రాష్ట్రంలో, రామ్మోహన్‌నాయుడుకు కేంద్రంలో మంత్రులుగా అవకాశం కల్పించారు. దానితో కళింగ వర్గాన్ని తృప్తి పరిచేందుకు, ఆ వర్గానికి చెందిన కూన రవికుమార్‌కు చీఫ్ విప్ ఇవ్వవచ్చంటున్నారు.
అయితే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న కూన, చీఫ్ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్లు, శ్రీకాకుళం జిల్లా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానితో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడే ఆయనను బుజ్జగించి, ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. బాబు చెబితే కూన చీఫ్ విప్‌ను ఈసారి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనతో అంగీకరించవచ్చని శ్రీకాకుళం పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నారు.
ఒకవేళ కూన తనకు చీఫ్ వద్దని గట్టిగా చెబితే, అది కమ్మ సామాజికవర్గానికి చెందిన వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు దక్కవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా పార్టీని, సొంత వనరులతో నడిపించిన జీవీ చీఫ్ విప్ రేసులో ఉన్నారు. అదీకాకుండా ఐదేళ్లు పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు, పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న జీవీకి సైతం అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయంటున్నారు.
ఇక పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు మొదటినుంచీ ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ శాసనసభా సమావేశాలలో ఎమ్మెల్యేల సమన్వయం ఆయనే పర్యవేక్షించడంతో, ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఆయనకు సంగం డైరీ చైర్మన్ పదవి ఉన్నందున, ఇంత పోటీలో మళ్లీ చీఫ్ విప్ ఇస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆయన కూడా జగన్ జమానాలో జైలుకు వెళ్లిన బాధితుడే. దెందులూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా, చీఫ్ విప్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో వారియర్‌గా పేరున్న చింతమనేనికే చీఫ్ విప్ ఇవ్వడం సబబన్న వాదన కూడా వినిపించకపోలేదు. ఆయన కూడా జగన్ బాధితుడిగా మారి, జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇలాఉండగా.. ఈసారి విప్‌ల సంఖ్యపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో 9 మంది విప్‌లను నియమించారు. అయితే ఎంతమంది విప్‌లను నియమించుకోవచ్చన్నదానిపై ఖచ్చితమైన నిబంధనలు, మార్గదర్శకాలు లేవంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి 14 మంది విప్‌లను నియమించడం ద్వారా ఎక్కువమందికి అవకాశం ఇవ్వవచ్చని కొందరు, ఇప్పుడున్న తొమ్మిదిమందినే కొసాగించవచ్చని మరికొందరు చెబుతున్నారు.
ఆరకంగా రెండు విప్‌లు జనసేనకు, ఒకటి భాజపాకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమకు రెండు విప్ పదవులు కావాలని జనసేన ఈపాటికే సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. మంత్రి పదవులపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన వారితోపాటు, కులసమీకరణలో స్థానం లభించని వారికి విప్‌లు ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చీఫ్ విప్ క్యాబినెట్ హోదా కాగా, విప్‌లకు గతంలో కేంద్ర సహాయమంత్రి హోదా ఉండేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల నుంచి, అందరికీ క్యాబినెట్ హోదానే లభిస్తోంది. విప్‌లకు ఒక ఎస్కార్టు, ఒక పీఎస్, ఇద్దరు పీఏలను నియమించుకునే అధికారం ఉంటుంది.