– ఎట్టకేలకు మంత్రి లక్ష్మణ్‌కు సారీ చెప్పిన మంత్రి పొన్నం
– వివాదానికి తెరవేసిన టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
– మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య ముగిసిన వివాదం..
– కాంగ్రెస్‌లో ముగిసిన ‘దున్నపోతు’ పంచాయతీ
– సారీతో సరి
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ కాంగ్రెస్‌లో ‘దున్నపోతు’ పంచాయతీకి ఎట్టకేలకు తెరపడింది. దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన దున్నపోతు వ్యాఖ్య నిన్న ఒక్కరోజునే కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పొన్నం వ్యాఖ్యలపై నిరసనగా మాదిగ సంఘాలు విరుచుకుపడ్డాయి.
పొన్నంను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే ఆయన కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కూడా రంగంలోకి దిగి పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తనకు జరిగిన అవమానంపై నాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రి లక్ష్మణ్ సిద్ధమయ్యారు. అప్పటికే ఆయన రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ దళిత సంఘాలు ఫిర్యాదు చేయడంతో, తాజాగా పొన్నం ప్రభాకర్‌కు పొన్నంకు అదనపు రక్షణ కల్పించారు.
పార్టీలో రేగిన ఈ కులపంచాయతీ ముదురుపాకానపడి, మాదిగల రూపంలో కాంగ్రెస్ కిందకు నీళ్లు రాకముందే టీపీసీసీ చీప్ మహేష్‌కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరూ సంయమనం పాటించాలని సూచించారు. దానితో పొన్నం పీసీసీ చీఫ్‌తో భేటీ అయ్యారు. తాను క్షమాపణ చెప్పేదిలేదని, పీసీసీ చీఫ్‌తో చెప్పిందే ఫైనల్ అని వెళ్లిపోయారు. దానితో దున్నపోతు పంచాయతీపై చిక్కుముడి మరింత బిగుసుకుంది.
దీనితో రాబోయే ప్రమాదం పసిగట్టిన పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మరోసారి రంగంలోకి దిగి ఇద్దరు మంత్రులతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక-స్థానిక సంస్ధల ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదం మంచిదికాదని, అది విపక్షాలకు లబ్ధి చేకూరుతుందని నచ్చచెప్పారు. లక్ష్మణ్‌కు సారీ చెప్పాలని సూచించగా, మంత్రి పొన్నం అందుకు అంగీకరించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,కవ్వంపల్లి సత్యనారాయణ,శివసేన రెడ్డి ,సంపత్ కుమార్, అనిల్ ,వినయ్ కుమార్ కూడా.. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సయోధ్య కుదుర్చుకోవాలని సూచించగా, అందుకు వారిద్దరూ అంగీకరించారు.
ఈ సందర్భంగా పొన్నం ఏమన్నార ంటే.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు.
నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న. నాకు అలాంటి ఆలోచన లేదు.. నేను ఆ ఒరవడి లో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదు.
సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుంది. ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తాం.
లక్ష్మణ్ కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నా కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గం మేమంతా కలిసి పెరిగాం. ఆ అపోహ ఉండవద్ధని విజ్ఞప్తి చేస్తున్నా .