ఒకానొక సందర్భంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ, ఆంజనేయుని కలుసుకున్నాడు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నాక, కురుక్షేత్ర సంగ్రామం గురించిన ప్రస్తావన వచ్చింది.
‘‘శ్రీకృష్ణుడే అందరికన్నా గొప్పవాడు. అందుకే మేము అంతటి మహాసంగ్రామంలో విజయం సాధించాము’’ అన్నాడు అర్జునుడు. ఆంజనేయుడికి ఆ మాట నచ్చలేదు.
‘‘మా ప్రభువైన రాముడి ముందు కృష్ణుడెంతటివాడు’’ అన్నాడు హనుమ.‘‘మీ రాముడే అంతటి గొప్పవాడైతే సేతువును నిర్మించడానికి అల్పులైన మీ వానరుల సాయం ఎందుకు తీసుకున్నట్టు? తన ధనుర్విద్యా కౌశలంతో వంతెన నిర్మించవచ్చు కదా’’ అన్నాడు అర్జునుడు.
“అర్జునా! నీవు ధనుర్విద్యలో నిపుణుడివి కదా, నీ బాణాలతో సేతువును నిర్మించు, నేను దాని మీద నడిచి, ముక్కలు ముక్కలు చేసేస్తాను.అలా చేయలేకపోతే చితి పేర్చుకుని ప్రాయోపవేశం చేస్తాను’’అన్నాడు హనుమ. ‘‘వంతెన కూలిపోతే నేను మంటల్లో పడి ప్రాణత్యాగం చేస్తాను’’ అన్నాడు అర్జునుడు.
ఇద్దరూ అందుకు సమ్మతించారు. అర్జునుడు కృష్ణపరమాత్మను తలచుకుని అప్పటికప్పుడే బాణాలతో వంతెన నిర్మించాడు. హనుమ ఆ వంతెనపై అటూ ఇటూ నడిచాడు… గంతులు వేశాడు. చివరకు తన బలమంతా ఉపయోగించి, కూలగొట్టేందుకు ప్రయత్నించాడు. వంతెన చెక్కు చెదరలేదు.
హనుమ తన ఓటమిని అంగీకరిస్తూ, పందెం ప్రకారం చితి పేర్చాడు. చితిచుట్టూ మూడుమార్లు ప్రదక్షిణ చేసి, రాముణ్ణి తలచుకుని మంటల్లో దూకబోయాడు. ఆంజనేయుడి వంటి ధీమంతుడి ప్రాణత్యాగానికి తాను కారణమవుతున్నందుకు ఎంతో బాధపడ్డాడు అర్జునుడు. కృష్ణుని ధ్యానించాడు.
ఇంతలో అక్కడికి వయోభారంతో బాగా వంగిపోయి, చెవులు సరిగా వినపడక, అడుగులు సరిగా పడక, కళ్లు సరిగా ఆననంతటి పండు ముదుసలి వచ్చాడు. జరుగుతున్న తతంగాన్నంతటినీ చూశాక, ‘‘ఏమయ్యా! ఏం జరుగుతోందిక్కడ? ఎందుకీయన ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నాడు?’’ అని అడిగాడు.
ఇద్దరూ తమ తమ ప్రతిజ్ఞలను వివరించారు. వృద్ధుడు శాంతంగా విని, ‘‘ఇదంతా జరిగినప్పుడు సాక్ష్యం ఎవరైనా ఉన్నారా?’’ అనడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో, ‘‘ఈసారి నేను చూస్తాను, మళ్లీ నువ్వు బాణాలతో వంతెన నిర్మించు’’ అన్నాడు అర్జునుడితో.
అర్జునుడు మళ్లీ వంతెన నిర్మించాడు కానీ, కృష్ణుని తలచుకోలేదు. హనుమ తన ఆరాధ్యదైవమైన శ్రీరాముని తలచుకుని, ఆ వంతెనపై అడుగు పెట్టగానే అది ఫటఫటమని విరిగి, కూలిపోయింది. ఈసారి అర్జునుడు తన ఓటమిని అంగీకరిస్తూ, ఆ చితిలో తాను దూకబోయాడు.
ఆ వృద్ధుడు ఆంజనేయుడికి శ్రీరాముడిగా, అర్జునుడికి శ్రీకృష్ణుడిగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఇద్దరూ భక్తి పారవశ్యంతో కనులు మూసుకుని శ్రీకృష్ణా! శ్రీ రామా అంటూ ఆ వృద్ధుని కౌగిలించుకున్నారు. కళ్లు తెరిచేసరికి ఆ వృద్ధుడు లేడక్కడ. అర్జునుడు, హనుమ ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరున్నారు.
ఇద్దరూ తమ తొందరపాటుకు, అహంకారానికి సిగ్గుపడ్డారు. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిందేమంటే మన జీవితంలో ఏమి సాధించాలన్నా మన ఇష్ట దైవాన్ని జ్ఞాన గురువులను స్మరించుకుంటూ ముందుకు కొనసాగాలి అప్పుడే అన్నింటా విజయం.
కృష్ణం వందే జగద్గురుం